close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దస్త్రాల్లోనే క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు

● ఈఎన్‌సీ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు

● జూరాల ప్రాజెక్టు పనులకు విడుదల కాని నిధులు

న్యూస్‌టుడే, గద్వాల

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమై 25 ఏళ్లు గడుస్తున్నా.. క్రస్ట్‌ గేట్ల నిర్వహణ మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టి నిర్వహణ వ్యవస్థ దెబ్బతింటోందని, అత్యవసర మరమ్మతులు తప్పనిసరి అని నిపుణుల బృందం తేల్చింది. విశ్రాంత ఇంజినీర్ల బృందం నాలుగు నెలల కిందటే ప్రాజెక్టును పరిశీలించి నివేదికను ఇచ్చింది. నిపుణుల సూచన మేరకు క్రస్ట్‌ గేట్ల పూర్తిస్థాయి మరమ్మతుల కోసం తక్షణం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 62 క్రస్ట్‌గేట్లు ఉండగా.. వాటికి సంబంధించి పూర్తిస్థాయి మరమ్మతుల కోసం చేపట్టాల్సిన పనులు, అయ్యే ఖర్చును అంచనా వేసి నివేదిక పంపాలని ప్రభుత్వం జూరాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మూణ్నెల్ల కిందట పూర్తిస్థాయి నివేదికను క్రస్ట్‌ గేట్ల మెకానికల్‌ విభాగం అధికారులు ఈఎన్‌సీకి పంపారు. అక్కణ్నుంచి రెణ్నెల్ల కిందట ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియకు నిధులు మాత్రం ఇంకా విడుదల కాలేదు.

ఈ ఏడాది లేనట్లేనా?

ప్రస్తుతం కర్ణాటక ప్రాజెక్టులకు వరద నీటి రాక ప్రారంభమైంది. రెండ్రోజులుగా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాలకు వరదనీటి ఉద్ధృతి మొదలైతే డిసెంబరు నెలాఖరు వరకు ఉంటుంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు కాస్త ఉద్ధృతంగా, మిగతా రెణ్నెల్లు స్వల్పంగానైనా తాకిడి ఉంటుంది. క్రస్ట్‌ గేట్ల మరమ్మతులకు సంబంధించి రూ.12.50 కోట్లతో అంచనాలను సాగునీటి శాఖ అధికారులు ఈఎస్‌సీకి పంపించారు. పరిశీలించిన ఈఎన్‌సీ ఆ దస్త్రాన్ని ప్రభుత్వానికి రెణ్నెల్ల కిందట పంపినట్లు తెలిసింది. అప్పట్నుంచి దస్త్రం అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడు నిధులిచ్చినా టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు మొదలయ్యే నాటికి ఆగస్టు వస్తుంది. అప్పుడు వరద ఉద్ధృతిలో క్రస్ట్‌ గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడం సాధ్యమేనా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో గేటుకు మరమ్మతు చేయాలంటే మొదట గ్యాంటీక్రేన్‌ ద్వారా స్టాప్‌లాక్‌ గేటు అమర్చాల్సి ఉంటుంది. ఆ తరవాతే ప్రస్తుతమున్న క్రస్ట్‌ గేట్లకు మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో గేటు మరమ్మతుకు కనీసం 5 రోజుల సమయం పడుతుందని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. అలా చేసినా అన్ని గేట్లకు పెయింటింగ్‌, మెకానికల్‌ లోపాలను సరిచేయడానికి కనీసం 10 నెలల కాలం పట్టనుంది. దీంతో ప్రభుత్వం నిధులిచ్చినా ఈ ఏడాది మాత్రం పనులు పూర్తయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.


నివేదిక పంపించాం : ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లకు తక్షణ మరమ్మతులు చేయడానికి అంచనా నివేదిక పంపాల్సిందిగా ఈఎన్‌సీ నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు నివేదిక పంపించాం. అక్కణ్నుంచి ఆదేశాలు వస్తే టెండర్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం గేట్ల పూర్తిస్థాయి మరమ్మతులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

- విజయకుమార్‌, ఈఈ (మెకానికల్‌), జూరాల


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.