close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన పరిశ్రమలు ఎంత భద్రం!

● నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో తనిఖీలు

సంప్రదింపుల కమిటీ నియామకం

● వేధిస్తున్న సిబ్బంది కొరత

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం

పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా? కార్మికులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయా.. బాయిలర్ల పనితీరు ఎలా ఉంది.. తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 18 వరకు వారం రోజులపాటు తనిఖీలు చేయనున్నారు. రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లోని పరిశ్రమల్లో భద్రతపై పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఆడిట్‌ కన్సల్టేషన్‌ టీం (పరిశ్రమల భద్రత మదింపు సంప్రదింపుల కమిటీ)ని నియమించారు. వారం రోజులపాటు వివరాలను సేకరించి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు వీరు నివేదిక సమర్పించనున్నారు.

సంప్రదింపుల కమిటీలో సభ్యులు వీరే.. : కమిటీలో అయిదు శాఖల అధికారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ పరిశ్రమల కేంద్రం అదనపు సంచాలకులు రామసుబ్బారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ దయానంద్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ మనోహర్‌రెడ్డి, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.సరితతోపాటు కార్మిక శాఖ తరఫున ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారి సభ్యులుగా ఉంటారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఉప కార్మికశాఖ అధికారి ఎం.నీలమ్మ కమిటీలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో వందలాది కార్మికులు, కూలీలు పని చేస్తుంటారు. రూ.కోట్ల విలువ చేసే సామగ్రి, ముడిసరుకు ఉంటుంది. కర్మాగారాల్లో బాయిలర్‌ పేలుళ్లు, లీకేజీలు, అగ్ని ప్రమాదాలు, షార్ట్‌ సర్క్యూట్స్‌ చోటు చేసుకొని రూ.కోట్లలో నష్టంతోపాటు ప్రాణనష్టం జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు పరిశ్రమలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయా.. లేదా? భద్రతాపరంగా ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా.. తదితర అంశాలు పరిశీలించనున్నారు. ప్రమాణాల లోపం కన్పిస్తే చర్యలకు నివేదించనున్నారు. రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌ విభాగాల్లో ఉమ్మడి జిల్లాలో వందలాది పరిశ్రమలున్నాయి. డ్రగ్స్‌, గ్లాస్‌ తదితర ఉత్పాదక, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు.

సిబ్బంది కొరతతో ఇబ్బంది

ఉమ్మడి జిల్లాలో వందలాది పరిశ్రమలను పరిశీలించాల్సిన అవసరం ఉండగా సిబ్బంది మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ ఆ శాఖలో ముగ్గురు, నలుగురు ఉద్యోగులే ఉన్నారు. వీరు వారం రోజుల్లో తనిఖీ ప్రక్రియ సమగ్రంగా పూర్తి చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి..


ఈ నెల 18 వరకు పూర్తి చేస్తాం

పారిశ్రామిక వాడల్లోని రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌లోని పరిశ్రమలను వారం రోజుల్లో పరిశీలిస్తాం. సంప్రదింపుల కమిటీ ద్వారా అన్ని పరిశ్రమల వివరాలను సేకరించి భద్రతా ప్రమాణాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.

- రాజేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు, మహబూబ్‌నగర్‌ జిల్లా


ప్రధానంగా తనిఖీ చేసే అంశాలు

 

● బాయిలర్‌ సిగ్నల్స్‌

● వాల్వు లీకేజీలు

● హైడ్రో పరీక్ష

● తాగునీటి స్వచ్ఛత

● వాయు కాలుష్యం


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.