close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.కోట్లు వెచ్చించి వదిలేశారు!

 ఏళ్లుగా రాజోలిలో తాగునీటి పథకాలు నిరుపయోగం

● చెంతనే తుంగభద్ర ఉన్నా.. గ్రామాలకు కృష్ణా నీరే దిక్కు

● పట్టించుకోని అధికారులు

న్యూస్‌టుడే, రాజోలి

ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మంచినీటి పథకాలు ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం శాపంగా మారడంతో.. పథకాలు నీటిని అందించడం లేదు. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా కృష్ణానది నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే.. జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ, దాని పక్క గ్రామాలకు కూడా వాటి జలాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతోరాజోలిలో మంచినీటి పథకాలు వృథాగా ఉండటమేనని ప్రజలు వాపోతున్నారు.

● మొదటగా అలంపూర్‌ నియోజకవర్గంలోని 23 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు 2005లో సుమారు రూ.6 కోట్లు వెచ్చించి మండలకేంద్రమైన రాజోలి గ్రామంలో మంచినీటి పథకాన్ని నిర్మించారు. తుంగభద్ర నీటిని ప్రజలకు సరఫరా చేసేవారు. అలాగే.. అలంపూర్‌ మండలంలోని గ్రామాలతో పాటుగా, మానవపాడు, ఉండవల్లి మండలాల్లోని 40 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చడం కోసం.. రాజోలి పథకం పక్కనే 2015 లో రూ.18 కోట్లు వెచ్చించి అలంపూర్‌ పథకాన్ని నిర్మించారు. అయినా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో సుంకేసుల డ్యాంకు వెళ్లే వారందరికీ ఈ రెండు పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

రాజోలి పథకం : భగీరథ పథకం ప్రారంభమైన నాటి నుంచి రాజోలి మంచినీటి పథకం నిలిపివేశారు. రూ.50 లక్షలకు పైగా వెచ్చించి పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టి, మిషన్‌ భగీరథకు అనుసంధానం చేసి, మూడేళ్లు గడిచింది. అయినా ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా తాగునీటి సరఫరా చేపట్టడం లేదు. పథకం నిర్వహణ కోసం అయిదుగురు సిబ్బంది నిత్యం విధులు నిర్వహిస్తున్నా.. వారికి ఎలాంటి పని ఉండటం లేదు.

అలంపూర్‌ పథకం : మొదట పథకం నిర్మాణం కోసం రూ.18 కోట్లు వెచ్చించగా, మిషన్‌ భగీరథలో అనుసంధానం చేయడం, ఇతర అభివృద్ధి పనుల కోసం మరో రూ.2 కోట్లకు పైగా వెచ్చించి, విద్యుత్తు సరఫరా, నాణ్యమైన మోటర్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. ట్రయల్‌ రన్‌ పూర్తి చేసినప్పటికీ, గతంలో అలంపూర్‌ వరకు వేసిన పైపులు సక్రమంగా లేవంటూ వడ్డేపల్లి వరకే కుదించారు. అయినా ఇంకా లీకేజీలున్నాయి. దీంతో రూ.లక్షలు వెచ్చించి వేసిన మిగితా పైప్‌లైన్‌ నిరుపయోగమేనా.? ప్రజాధనం ఇలా వృథా కావాల్సిందేనా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


లక్ష్యం మేర నీరు సరిపోదని : మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలందరికీ జూరాల నీరు సరఫరా చేయాలని ఆదేశాలున్నాయి. ప్రతి మనిషికి 100 లీ. చొప్పున ప్రతి రోజూ సరఫరా చేస్తున్నాం. ఇలా ఇవ్వాలంటే తుంగభద్ర నది నీళ్లు సరిపోవు. అందుకే ప్రారంభించడం లేదు. అలంపూర్‌ మంచినీటి పథకానికి సంబంధించి వేసిన పైప్‌లైన్లు మిషన్‌ భగీరథకు ఉపయోగపడవు. లీకేజీ ఉండటం వల్ల ట్రయల్‌ రన్స్‌ ఇంకా నిర్వహిస్తున్నాం.

- సందీప్‌, మిషన్‌ భగీరథ డీఈ, రాజోలి


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.