close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నలభీముల నకనకలు

● కరోనాతో వంట కార్మికుల అవస్థలు

● శుభకార్యాలు లేక ఇళ్లకే పరిమితం

● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

న్యూస్‌టుడే, అనుమసముద్రంపేట : జిల్లా వ్యాప్తంగా సుమారు 350 నుంచి 400 వరకు క్యాటరింగ్‌ కేంద్రాలున్నాయి. అందులో నెల్లూరు నగరంలోనే వందకు పైగా ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో సుమారు పది నుంచి 20 మంది పని చేస్తున్నారు. నగరంలోనే రమారమి రెండుమూడు వేల మంది వరకు వంట నిర్వాహకులు, ఇతర సిబ్బంది ఉండగా- మిగిలిన పురపాలక సంఘాలు, మండలాల్లో మరో ఆరేడు వేల మంది ఉపాధి పొందుతున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో శాకాహార, మాంసాహార వంటలు తయారు చేస్తూ... జీవనం సాగిస్తున్నారు. ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, సంగం, చేజర్ల తదితర ప్రాంతాల్లో కార్యాలకు హాజరైతే సుమారు ఒకట్రెండు రోజులు అక్కడే ఉండి మూణ్నాలుగు వేల రూపాయలు సంపాదించేవారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఈ రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నమయ్యాయి. సుమారు నాలుగైదు నెలలుగా గిరాకీ లేకపోవడంతో ఇళ్ల వద్దే ఉంటున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో... దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరైతే అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తుండగా- మరికొందరు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కేవలం 50 మంది లోపు బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. ఆ నిబంధనలను అనుసరించి ఒకట్రెండు చోట్ల వివాహాలు జరుగుతున్నా- ఒకరిద్దరు వంట నిర్వాహకులతో నామమాత్రంగా ముగిస్తున్నారు.

‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు’ అని సుష్ఠుగా ఫలహారాలు ఆరగించి... కులాసాగా పడుకునే రోజులు ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్క వివాహమే కాదు... ఏ శుభకార్యాలు, ఫంక్షన్లు జరగడం లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలూ కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో అడపాదడపా కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఆయా కార్యాల్లో షడ్రసోపేతంగా భోజనాలందించే నలభీములు మాత్రం నేటికీ తేరుకోలేదు. ఎక్కడా శుభకార్యాలు లేకపోవడంతో... ఉపాధి గగనమై కుటుంబాలు నకనకలాడుతున్నాయి.

తీవ్రంగా నష్టపోయాం..

కరోనాతో ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌ కోల్పోయాం. సుమారు రూ.3 లక్షల ఆదాయం నష్టపోయాం. ఎక్కడా వివాహాలు, ఇతరత్రా కార్యాలు జరగడం లేదు. ప్రస్తుతం ఎలాంటి పనుల్లేవు. ఇళ్లకే పరిమితం కావడంతో... కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. భార్యాపిల్లలు ఒకపూట భోజనం చేస్తుంటే, మరో పూట పస్తులు ఉంటున్నాం. - ఖాజామస్తాన్‌, వంట నిర్వాహకుడు, ఏఎస్‌పేట

ప్రభుత్వం ఆదుకోవాలి..

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందించి ఆదుకుంది. చేనేత కార్మికులు, ఆటోవాలాలు, దర్జీలు తదితర వర్గాలకు చేయూతనిచ్చింది. వంట కార్మికులను మాత్రం విస్మరించడం బాధాకరం. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి మాకూ ఆర్థికసాయం అందించాలి. - బాబు, వంట నిర్వాహకుడు, ఏఎస్‌పేట

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.