close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గూడుకుట్టిన వేదన

● ఏకరూప దుస్తుల కుట్టు కూలి చెల్లింపుల్లో జాప్యం

● రెండేళ్లుగా బకాయి; రూ.50 లక్షల మేర పెండింగ్‌


సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఏకరూప దుస్తుల తయారీ కేంద్రం

నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ సాంఘిక సంక్షేమ శాఖ ఏకరూప దుస్తుల తయారీ కేంద్రంలో గత మూడేళ్లుగా పని చేస్తున్నారు. అధికారుల ఆదేశంతో వసతిగృహ విద్యార్థుల అవసరాల మేరకు ఏకరూప దస్తులు కుట్టిస్తుండగా- రెండేళ్లుగా ఆ కూలి చెల్లింపులు లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. సుమారు రూ. 80వేల వరకు రావాల్సి ఉందని, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న క్రమంలో ఆ కూలి సొమ్ము ఆమెకు అత్యవసరంగా మారింది.

వెంకటాచలం మండలానికి చెందిన మరో మహిళదీ అదే పరిస్థితి. మారుమూల గ్రామం నుంచి రోజూ బస్సులు, ఆటోల్లో ఛార్జీ పెట్టుకుని వచ్చి మరీ కష్టపడి ఏకరూప దుస్తులు కుట్టారు. ఆ వచ్చే సొమ్ము.. కుటుంబానికి ఆధారమవుతుందని భావించారు. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అతీగతి లేదని, సిబ్బందిని అడిగితే.. బడ్జెట్‌ రాలేదని చెబుతుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాను ఛార్జీల కోసం వెచ్చించిన సొమ్ములైనా వస్తాయో?రావో అని మదనపడుతున్నారు.

నిర్లక్ష్యం గూడు ‘కుట్టు’కుంది. చేసిన కష్టానికి ప్రతిఫలం కోసం ఆ అభాగ్యులు పడుతున్న ఆరాటం ఆవేదన కలిగిస్తోంది. రెండేళ్లు గడుస్తున్నా ఎంతకూ పరిష్కారం లభించకపోవడం, బడ్జెట్‌ రాలేదంటూ అధికారులు పేర్కొంటుండటం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది. ఇదీ జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థుల కోసం ఏకరూప దుస్తులు కుట్టిన దర్జీల పరిస్థితి.

ఈనాడు, నెల్లూరు : ఏకరూప దస్తులు కుట్టినందుకు చెల్లించాల్సిన కూలి సొమ్ము చెల్లింపులపై సందిగ్ధం నెలకొంది. గత రెండేళ్లుగా బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవడం ఇబ్బందిగా మారింది. జిల్లాలో 2018-19, 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.48.22 లక్షల మేర బకాయి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఒక్కో దర్జీకి రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు చెల్లించాలని సమాచారం. వీరిలో కొందరు మహిళలు నెల్లూరు పరిసర మండలాలకు చెందిన వారు కాగా- అప్పులు చేసుకుని మరీ నిత్యం వాహనాల్లో ఛార్జీలు పెట్టుకుని వచ్చి దుస్తులు కుట్టిన పరిస్థితి ఉంది. ఓ దశలో ప్రజాప్రతినిధుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు.

బడ్జెట్‌ రాలేదట! : సాంఘిక సంక్షేమశాఖ అధికారులు మాత్రం బడ్జెట్‌ రాకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతున్నారు. ఆ మేరకు ఆ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులూ ఇటీవల లేఖ రాశారు. జూన్‌ 23న పంపిన ఆ లేఖలో రూ. 50 లక్షలు మంజూరు చేస్తే చెల్లింపులు చేయడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. నెలన్నర గడుస్తున్నా.. ఇప్పటికీ పరిష్కారం దిశగా అడుగులు లేవు. ప్రస్తుతం ఓ వైపు కరోనా ఇబ్బంది పెడుతోంది. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో ఉపాధి లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ క్రమంలో బాధిత మహిళలు సైతం ఆవేదనకు గురవుతున్నారు. కనీసం కుట్టుకూలి సొమ్ములైనా మంజూరైతే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జీవపుత్రకుమార్‌తో ‘ఈనాడు’ మాట్లాడగా.. బడ్జెట్‌ రాకపోవడం వల్లే చెల్లింపులు చేయలేకపోయినట్లు చెప్పారు. ఇటీవలే ఉన్నత స్థాయికి సమగ్రంగా నివేదించామన్న ఆయన.. రాగానే అందిస్తామని చెప్పారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో వసతిగృహ విద్యార్థులకు ఏకరూప దుస్తులతో పాటు పుస్తకాలు భోజనం అందించి వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. ఆ క్రమంలోనే ఏటా విరివిగా ఏకరూప దస్తులు సిద్ధం చేసి అందిస్తోంది. ఇందుకుగాను మద్రాసు బస్టాండ్‌ సమీపంలో తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ ఏటా మార్చి- జూన్‌ మధ్య కాలంలో ఏకరూప దుస్తులు సిద్ధం చేస్తుంటారు.’

‘కేంద్రంలో సుమారు 60 మంది వరకు దర్జీలు పని చేస్తుండగా- వారిలో అత్యధికం మహిళలే. వీరికి నిర్ణీత కొలతలతో కత్తిరించిన వస్త్రాన్ని అందించి కుట్టిస్తారు. ఇందుకుగాను ఒక్కో జతపై 64 మేర చెల్లిస్తారని తెలుస్తోంది. దారం, గుండీలతో పాటు కుట్టు యంత్రాన్ని సదరు మహిళలే తెచ్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఒక్కో దర్జీ నెలకు 140 నుంచి 150 జతలు కుట్టేవారని చెబుతున్నారు.’

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.