close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేసీ వినోద్‌కుమార్‌ బదిలీ

ఏపీఎస్‌హెచ్‌ఎస్‌ఎస్‌పీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పంపుతూ ఉత్తర్వులు

వీడబ్ల్యూఎస్‌అండ్‌డీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతల అప్పగింత


వినోద్‌కుమార్‌

ఈనాడు, నెల్లూరు : జిల్లా రెవెన్యూ, రైతుభరోసా (ఆర్‌బీ అండ్‌ ఆర్‌) సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఏపీ హెల్త్‌ సిస్టమ్స్‌ స్ట్రెన్త్‌నింగ్‌ ప్రాజెక్టు (ఏపీఎస్‌హెచ్‌ఎస్‌ఎస్‌పీ) డైరెక్టర్‌గా ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా వీడబ్ల్యూఎస్‌అండ్‌డీ జేసీ ప్రభాకరరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వినోద్‌కుమార్‌ కర్ణాటక వాసి. 11 నెలల కిందట జిల్లా జేసీగా ఉన్న వెట్రిసెల్వి బదిలీ కాగా- ఆమె స్థానంలో వినోద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయనపై బదిలీ వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ ఒత్తిళ్లు : పాలనా పరంగా తనదైన ముద్ర వేసుకున్నా... రాజకీయంగా వినోద్‌కుమార్‌ ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొందరు నాయకులకు కంటగింపుగా మారడం ఆయనకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని టెండర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో ఫైళ్లు పేరుకుపోవడం, ఇళ్ల స్థలాలకు భూసేకరణ విషయంలో ‘కావలి’ వ్యవహారం ఈయనకు ప్రతిబంధకమయ్యాయని చెప్పొచ్ఛు తొలుత ఓ ప్రాంతంలో భూమిని సేకరించేందుకు మొగ్గుచూపడం, అనంతరం అనూహ్యంగా అధికార పార్టీ నాయకుల స్థలాన్ని అధిక ధరకు సేకరించేందుకు నిర్ణయించడంపై విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత కారణాలని చెప్పినప్పటికీ.. ఈ భూముల వ్యవహారం గత కలెక్టర్‌ శేషగిరిబాబు బదిలీకి ఓ కారణమైందన్నది బహిరంగ రహస్యం. ఇంకోవైపు ఆది నుంచి ప్రతికూలంగా ఉన్న ఇద్దరు నాయకులు అమరావతి స్థాయిలో వినోద్‌కుమార్‌పై ఫిర్యాదులు చేసినట్లు చర్చ జరుగుతోంది. కలెక్టర్‌గా పనిచేసిన శేషగిరిబాబు బదిలీ జరిగిన నెలరోజుల్లోనే సంయుక్త కలెక్టర్‌ కూడా మార్పు జరగడం గమనార్హం.

పోటాపోటీ : జిల్లాలో రెండు సంయుక్త కలెక్టర్‌ పోస్టులు ఖాళీ ఉండటంతో ఇక్కడకు వచ్చేందుకు పలువురు ఐఏఎస్‌లు పోటీపడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా జిల్లాలో వివిధ స్థాయుల్లో పనిచేసి బదిలీపై వెళ్లిన వారు తిరిగి ఈ కుర్చీల్లోకి వచ్చేందుకు తమదైన రీతిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు ఇప్పటికే జిల్లా ముఖ్య నేతల ఆశీస్సులు కూడా అందుకున్నట్లు తెలిసింది. వీరికే, ఆ అవకాశం దక్కుతుందా? కొత్త వారికి చోటు కల్పిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. కలెక్టర్‌ శేషగిరిబాబు బదిలీకి అభ్యర్థించారన్న విషయం బయటకు రాగానే.. ఇద్దరు ఐఏఎస్‌లు కలెక్టర్‌ స్థానానికి జిల్లాకు వచ్చేందుకు పోటీపడ్డారు. చివరి క్షణంలో అనూహ్యంగా చక్రధర్‌బాబును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంయుక్త కలెక్టర్ల స్థానాలకూ ఇదే సూత్రం వర్తిస్తుందా? అన్న మీమాంస ఉంటోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ కమిషనర్‌గానూ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారన్న ప్రచారం నేపథ్యం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.