close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది మా నవతరం

ప్రతికూలతలను అధిగమించి విజయ తీరాలకు

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

‘కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు’ అన్నారు వివేకానందుడు. నిజమే మరి.. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో.. కోరుకున్న ఉద్యోగం రాలేదనో.. అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక పోయామనో.. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా ప్రయత్నాలను కొనసాగించినప్పుడే విజయాలు చేరువవుతాయి. అందుకు నిదర్శనం వీరే.. నిరంతర సాధన, అకుంఠిత దీక్ష.. సాధించాలనే పట్టుదలను ఆయుధాలుగా చేసుకుని విభిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్న యువతరంపై అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

‘శ్రేయా’నురాగం

నెల్లూరు(సాంస్కృతికం) : చిరుప్రాయం నుంచి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తున్న నెల్లూరు పొగతోటకు చెందిన శ్రేయ అరుదైన ఘనతను సాధించారు. డాక్టర్‌ సర్వేపల్లి అజయ్‌కుమార్‌, లక్ష్మీశారద దంపతుల కుమార్తె ఈమె.. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తూనే.. సంగీతంలోనూ రాణిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా నూతన రాగాన్ని ఆవిష్కరించారు. దానికి ‘నారదప్రియ’ రాగంగా నామకరణం చేసి.. కీర్తనను రచించడంతో పాటు చిట్ట స్వరాన్ని రూపకల్పన చేసి గానం చేశారు. నారదముని మహతి వీణ ప్రస్థావనతో ద్వితీయాక్షర ప్రాసతో రచించిన ‘వరవీణసుతా వరనారద’ అనే ఈ కీర్తన రికార్డు చేశారు. దత్తపీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహంతోనే నారదప్రియ రాగాన్ని ఆవిష్కరించినట్లు శ్రేయ తెలిపారు.

పరిశోధనలే ప్రాణం

కోట : చిన్నతనం నుంచి శాస్త్రీయ సలహాదారుగా దేశానికి సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. చిన్న ఉద్యోగంతో ప్రస్థానం మొదలుపెట్టి పట్టుదల, కృషితో నాలుగు రాష్ట్రాలకు పర్యావరణ మంత్రిత్వశాఖ జేడీగా ఎదిగారు గూడూరుకు చెందిన మురళీకృష్ణ. తండ్రి శ్రీనివాసులు, తల్లి కౌసల్య ఆకాంక్షలకు అనుగుణంగా, గురువు కిషాంధర్‌ సూచనలు, సలహాలతో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొలుత హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరినా.. దాన్ని వదిలేసి పరిశోధనలవైపు మళ్లారు. అంచెలంచలుగా ఎదిగి కర్ణాటక, కేరళ, గోవా, లక్షదీప్‌లకు పర్యావరణ మంత్రిత్వశాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. జెనీటిక్‌ ఇంజినీరింగ్‌ అఫ్రైజర్‌ కమిటీ కార్యదర్శిగానూ రాణిస్తున్నారు. ఇంతటితో తన లక్ష్యం నెరవేరలేదని, దేశానికి పర్యావరణంపై సేవలందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు.

గిరి నుంచి బరికి

వెంకటగిరి గ్రామీణం, గూడూరు గ్రామీణం : వెంకటగిరి పట్టణానికి చెందిన బీరం రాజేశ్వరరావు, దేవీశ్రీ కుమారుడు నితిన్‌శేఖర్‌. అంతర్జాతీయ మినీ ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యారు. తొలి విడతలో జట్టుకు ఎంపికైనా అనివార్య కారణాలతో వెళ్లలేకపోయారు. పట్టు విడువకుండా ఆటలో సాధన చేస్తూ మలి విడతలో జట్టులో స్థానం పొందడంతో పాటు దేశం తరఫున ఆడారు. గత ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన మినీ ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ జట్టులో స్థానం సంపాదించారు. దేశానికి ఆడటమే గొప్ఫ అనుకున్నది సాధించేందుకు కఠోర శిక్షణ తీసుకున్నా. అలా ప్రపంచ్‌కప్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడా. తల్లిదండ్రులు, పుట్టిన ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చానని ఆనందం వ్యక్తం చేశారు.

కష్టాలకు ఎదురీది...

నాయుడుపేట : నాయుడుపేట పట్టణం లక్ష్మణ్‌నగర్‌కు చెందిన లక్ష్మయ్యకు చిన్నతనంలోనే ఓ కాలు చచ్చుబడి ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి నెలకొంది. ఆపై నిరుపేద కుటుంబం. కానీ, ఇవేవి ఆయన లక్ష్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. క్రీడాకారుడిగా రాణించాలన్న పట్టుదలతో కఠోర సాధన చేశారు. పరుగు పందెం ఇతర క్రీడల్లో నైపుణ్యం సాధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పారా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించి ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల ప్రశంసలందుకున్నారు. వికలాంగుల విభాగం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో రైల్యేలో ఉద్యోగం సాధించారు. నేటికీ అదే స్ఫూర్తితో యువతకు క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు.

పేదింటి నుంచి ఆఫ్రికా ఖండం వరకు

వెంకటగిరి గ్రామీణం : డక్కిలి మండలం డి.వడ్డిపల్లికి చెందిన బోసి నరసింహులు కుమారుడు బండారు హరినారాయణ రసాయనశాస్త్రంలో ద యాక్టివేషన్‌ ఆఫ్‌ ఆక్టైన్‌ ఓవర్‌ క్రోమియం మొలబ్దినం మిక్స్‌డ్‌ మెటల్‌ ఆక్సైడ్‌ కెటలిస్ట్‌ అన్న అంశంపై పరిశోధన జరిపి దక్షిణాఫ్రికా డర్భన్‌లోని క్వాజులు నటాల్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. మరికొన్ని ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ మూలకాలపై వేర్వేరు బృందాలతో ఈయన సమర్పించిన పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. తన పరిశోధనలు దేశానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు మానవాళికి ఉపయోగపడాలని కాంక్షిస్తున్నారు.

డాబావాలా... ఉపాధి మేళ

నాయుడుపేట పట్టణం : ఓజిలి మండలం పెదపరియకు చెందిన పండి రమణయ్య, ఎల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు రాధయ్య. నాయుడుపేటలో కళాశాల విద్య అభ్యసిస్తూనే రాత్రివేళ డాబాలో పని చేశారు. యజమాని రామకృష్ణనాయుడు సహకారంతో పగటి వేళ కళాశాలకు వెళ్లారు. ఎంబీఏ ప్రవేశ పరీక్ష రాసి కావలి సిద్ధార్థ కళాశాల్లో ఉచిత సీటు సాధించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఏడాది పాటు చెన్నైలో ఉద్యోగం చేశారు. అక్కడి నుంచి బెంగళూరులో నేడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా కొనసాగుతున్నారు. ఏడో తరగతిలో చదువు మానేసి కూలి పనులకు వెళుతున్న తన తమ్ముడి చదువులకూ ఆసరాగా నిలిచారు. తన గ్రామానికి చెందిన మహేష్‌ అనే యువకుడికి శిక్షణ ఇప్పించి బ్యాంకు పీవో ఉద్యోగం సాధించేందుకు, తల్లిదండ్రులు లేని తన సమీప బంధువు చందు అనే యువకుడి బాగోగులు చూడటంతో పాటు అతడికి సివిల్స్‌ శిక్షణ ఇప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.