close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగని నీరు.. దాగని నిజం

● ముంపు నుంచి పాఠాలు నేర్వని వైనం

● కార్యరూపం దాల్చని పాత ప్రతిపాదనలు

● దిద్దుబాటు చర్యలతోనే సురక్షిత నగరం

నాటి ముంపు బాధలు ప్రజల మది నుంచి తొలగిపోనే లేదు. ఆ అనుకోని సంఘటన ఛాయలు ఇంకా తుడిచిపెట్టుకుపోనేలేదు.. చేస్తామన్న.. చేయాల్సిన దిద్దుబాటు చర్యలు పట్టాలెక్కనేలేదు... ఇంతలోనే నెల్లూరుకు మరో ఉపద్రవం. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సోమశిలకు వచ్చిన వరదను.. పెన్నాలోకి వదలగా... నగరంలోని పరీవాహకంలో ఉన్న పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి మొదట చేసిన హెచ్చరికను పాఠంగా తీసుకుని.. గుణపాఠం నేర్చుకుని తగు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మరోసారి నగరానికి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్న కాంక్ష నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆ దిశగా పాలకులు, అధికారులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. - ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, (నగరపాలకసంస్థ)

 

2015 లో అలా...

● నెల్లూరు నగరంలో 2015లో కురిసిన భారీ వర్షాలకు సింహపురి అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినగా.. కల్వర్టులు కూలిపోయాయి. మన్సూన్‌నగర్‌, ఖుద్దూస్‌నగర్‌, శివగిరికాలనీ, మనుమసిద్ధినగర్‌, చంద్రబాబునగర్‌, గాంధీ గిరిజన కాలనీ, మద్రాసు బస్టాండ్‌ ప్రాంతాల్లో వారం రోజుల పాటు నీరు నిలిచింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. వారం రోజులపాటు దాతలు ఇచ్చిన ఆహారంతో సర్దుకుంటూ నానా యాతన పడ్డారు. 3,900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరపాలక సంస్థకు రూ. 14.32 కోట్ల నష్టం వాటిల్లింది.

● ప్రధానంగా పంట కాలువలపై ఆక్రమణలే నగరం ముంపునకు కారణమని అధికారులు గుర్తించారు. 14 పంట కాలువలపై ఆక్రమణల సర్వే కోసం 15 మంది సభ్యులతో కూడిన 28 బృందాలను నియమించారు. ఎక్కడెక్కడ ఎంతెంత మేర ఆక్రమణలు జరిగాయో గుర్తించడంతో పాటు.. కొలతలు తీశారు. ఫొటో, వీడియో చిత్రీకరణ చేసి.. మార్కింగ్‌ కూడా ఇచ్చారు. అంతర్జాలం ద్వారా జియో ట్యాగింగ్‌ విధానంలో ఆక్రమణదారుల వివరాలనూ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. కాలువ గట్లపై ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపించి.. మూడు నెలల్లో ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు ప్రకటించారు. నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు.

 

అలా చేస్తే నిలువదు... -ఇమాముద్దీన్‌, విశ్రాంత ఎస్‌ఈ

నెల్లూరు మీదుగా వెళ్లే 14 పంట కాలువల్లో పూడిక తీయించడంతో పాటు లైనింగ్‌ చేయించి.. నగరంలోని చిన్న కాలువలను వాటికి అనుసంధానం చేస్తే వర్షపు నీరు సజావుగా వెళుతుంది. 2015లో స్వర్ణాల చెరువు నీరు నీలగిరి సంఘంలోని కలుజు నుంచి రామిరెడ్డి కాలువలోకి రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం నీలగిరి సంఘంలోని కలుజును మూసివేశారు. పంట కాలువల్లో అక్కడక్కడా కాకుండా.. ఒక్కో కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్‌ పనులు చేయించడం అవసరం.

 

రూ. 65 కోట్లతో ప్రతిపాదనలు - వెంకటేశ్వర్లు, ప్రజా ఆరోగ్యశాఖ ఎస్‌ఈ

పంట కాలువలకు రూ. 65 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. 12 కిలోమీటర్ల మేర వాటిని బాగు చేయాలి. ప్రస్తుతం రివర్స్‌ టెండర్ల దశలో ఉంది.ఈ కార్యక్రమంపూర్తయితే పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేపడతాం.

చెరువుకు కలుజు ఏర్పాటు - కృష్ణమోహన్‌, ఇరిగేషన్‌ ఈఈ

2015లో స్వర్ణాల చెరువు పొంగి నీరు నగరంలో నిలిచింది. పంట కాలువల్లో నుంచి బయటకు వెళ్లలేకపోయింది. పూడికలు తీయాలని, ఆక్రమణలు తొలగించాలని అప్పట్లో ప్రణాళికలు వేశాం. ప్రస్తుతం ఈ సమస్యలో భాగంగా నెల్లూరు చెరువు నీరు నగరం వైపు రాకుండా పొట్టేపాళెం వద్ద రూ. కోటితో 50 మీటర్లు కలుజును ఏర్పాటు చేశాం. తద్వారా పంట కాలువల్లోని నీరు సర్వేపల్లి కాలువకు వెళతాయి. సర్వేపల్లి కాలువ కట్టల నిర్మాణానికి రూ. 12 కోట్లతో ప్రతిపాదనలు, టెండర్లు కూడా త్వరలో జరగనున్నాయి.

2020 లో ఇలా...

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశయం పూర్తిగా నిండింది. దాంతో అధికారులు వరదనీటిని పెన్నా ద్వారా సముద్రానికి వదిలారు. దాంతో పరీవాహక ప్రాంతాలైన చేజర్ల, సంగం మండలాలతో పాటు నెల్లూరు నగరంలోని జనార్దన్‌రెడ్డికాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, అహ్మద్‌నగర్‌, పొర్లుకట్ట, జయలలితనగర్‌, అరవపాళెం, తూకుమానుమిట్ట, పాత మున్సిపల్‌ కార్యాలయం తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని సుమారు రెండు వేల మందిని ఏడు పునరావాస కేంద్రాలకు తరలించారు. పెన్నా నదికి వరదొచ్చినప్పుడల్లా ఈ ప్రాంతాలు ముంపునకు గురవుతూనే ఉన్నాయి.

పెన్నా పరీవాహక ప్రాంతం పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కొందరు నదిని ఆక్రమించి పొలాలుగా మార్చగా- మరికొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిని గుర్తించి ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండగా- వరదల సమయంలో ఈ ప్రాంతం ముంపునకు గురవుతూనే ఉంది. ముంపు ప్రాంత వాసులకు శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న అధికారులు, పాలకుల మాటలు, హామీలు ఆచరణ దిశగా ముందుకు సాగకపోవడం పరిస్థితిని నానాటికీ తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం పెన్నా ఒడ్డున ఆక్రమించి నిర్మించినవేనని, జలవనరులశాఖ అధికారులతో కలిసి సర్వే చేస్తున్నామని ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. నీటి మట్టం ఎంత వరకు వచ్చింది. ఆ ప్రాంతాల్లో ఎన్ని ఇళ్లు ముంపునకు గురయ్యాయని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు.

కాలువ గట్లపై నివాసాలను తొలగించి బాధితులకు టిడ్కో ఆధ్వర్యంలో షీర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. కానీ వాటిని నేటికీ వారికి అందించలేదు. నాలుగేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఆనాటి పెద్దలు వందేళ్ల కిందటే నగరంలో పడిన వర్షపు నీరంతా కాలువల ద్వారా సర్వేపల్లి కాలువలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నేడు.. ఆ పంట కాలువలను కాస్తా మురుగు కాలువలుగా మార్చారు. చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలకు తోడు ఆక్రమణలతో పది మీటర్లు ఉండాల్సినవి కుంచించుకుపోయాయి. కొన్నిచోట్ల 5 మీటర్లు, మరికొన్ని చోట్ల రెండు మీటర్లకు చేరాయి.’

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.