close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వడివడిగా ‘నడవా’!

పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు

చురుగ్గా భూసేకరణకు కసరత్తు

నెల్లూరు-చిత్తూరు పురోభివృద్ధికి కృషి

న్యూస్‌టుడే, నాయుడుపేట, వెంకటగిరి  : జిల్లాలో రెండు ప్రధాన పారిశ్రామిక నడవాలకు చెందిన అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో ఇటీవల పారిశ్రామిక కారిడార్ల పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈమేరకు ఏపీకి చెందిన   పలువురు ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో తరచుగా చర్చించడంతో.. ప్రక్రియ మళ్లీ మొదలైంది. పనులపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఇటీవల ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) ప్రాజెక్టు ద్వారా జిల్లాకు రూ. 37,500 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

తీర ప్రాంతం వేదికగా..

ఆంధ్రప్రదేశ్‌ను ఆసియా వ్యాపార పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో పారిశ్రామిక నడవాల నిర్మాణానికి రూపకల్పన చేసింది. విశాల తీరప్రాంతమున్న జిల్లాలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి దశలో ఏడీబీ రుణం ద్వారా పారిశ్రామిక కేంద్రాలు, సముదాయాలను ఏర్పాటు చేసి.. వాటిని జాతీయ రహదారులు, ఓడరేవులు, రైల్వే లైన్లు, ప్రధాన పట్టణాలకు అనుసంధానం చేస్తారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా ద్వారా జిల్లాలో నాయుడుపేట కేంద్రంగా పారిశ్రామిక సముదాయం, కృష్ణపట్నం ప్రాంతంలో అంకుర ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు మూడు ప్రధాన రహదారులను నాలుగు వరుసలుగా మార్చనున్నారు. కండలేరు నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు నీటి వసతి కల్పించేందుకు ఏడీబీ రూ.2,505 కోట్లు రుణసాయం చేసింది. నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌లోని మేనకూరు సెజ్‌ పరిధిలో 4,156 ఎకరాల్లో రూ.219 కోట్లతో చేపట్టిన అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులు, విద్యుత్తు ఉప కేంద్రాలు, కలుషిత నీటి శుద్ధి ప్లాంటు, మురుగు కాలువల నిర్మాణం తదితర పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో 1,350 ఎకరాలను పారిశ్రామిక అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు గతంలో రూ. 680 కోట్లు కేటాయించినా.. భూసేకరణ జాప్యంతో .పనులు ప్రారంభించలేదు.

పైపులైను పనులకు రూ.689 కోట్లు..

కండలేరు నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పరిశ్రమలకు పైపులైను పనులకు రూ.689 కోట్లు కేటాయించగా- ప్రారంభ దశలో ఉన్నాయి. నడవా పరిధిలోని నాలుగు వరుసల రహదారుల నిర్మాణ భూసేకరణలో జాప్యం జరిగింది. నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు 23 కి.మీ. దూరం నాలుగు వరుసల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారు. తడ- శ్రీకాళహస్తి రోడ్డు 46 కి.మీ. విస్తీర్ణానికి రూ.414 కోట్లు, నాయుడుపేట- వెంకటగిరి రోడ్డు 27 కి.మీ. రూ.125 కోట్లతో నాలుగు వరుసలుగా నిర్మించేందుకు నిధులు విడుదల చేసినా, ఇందుకు సంబంధించిన భూసేకరణ ముందుకు సాగడం లేదు. ఇవన్నీ పూర్తిచేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేసింది.

ద్వారకాపురం వద్ద నిర్మిస్తున్న విద్యుత్తు ఉపకేంద్రం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.