close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పల్లెకు.. నిధుల పల్లకి

● ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 52.29 కోట్ల విడుదల

 

ఇటీవల ఏర్పడిన కొత్త వాటితో కలిపి జిల్లాలో మొత్తం 1050 గ్రామ పంచాయతీలు ఉండగా- గత ఆరేళ్లుగా మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో నుంచే సీపీడబ్ల్యూ, తాగునీటి బోర్ల నిర్వహణకు కొంత కేటాయించారు. తాజాగా పరిషత్తులకూ నిధుల కేటాయింపు జరిగింది. తద్వారా వాటితోనే బిల్లుల చెల్లింపు చేపట్టనున్నారు.

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మొత్తం పంచాయతీల విస్తీర్ణం 14,909 చదరపు కిలో మీటర్లు కాగా.. 2018 ఆగస్టు రెండో తేదీన పాలకవర్గాల గడువు పూర్తయింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. నిధుల కొరత ఉన్న గ్రామాల్లో కార్యదర్శులే అప్పులు చేసి మరీ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పనులు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాతే కేంద్రం నుంచి నిధులు వస్తాయని అంతా భావించినా.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో పంచాయతీలకు ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభించింది. పల్లెల్లో తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకూ అవకాశం ఏర్పడింది.

*గత కొంత కాలంగా నిధుల లేమితో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు ఊరట లభించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మొదటి విడత బేసిక్‌ గ్రాంట్‌ కింద జిల్లాకు రూ. 52,29,82,495 నిధులు వచ్చాయి. అందులో 70 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయించగా- మండల, జడ్పీలకు 15 శాతం చొప్పున విడుదల చేశారు.

*రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ నిబంధనల ప్రకారం 2011లో జిల్లాలో గ్రామీణ ప్రాంత జనాభా 27,43,417 మంది ఉండగా- ఆ ప్రాతిపదికన పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో 90 శాతం సర్దుబాటు చేయనున్నారు. మరో పది శాతం నిధులకు పంచాయతీ చదరపు కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోనున్నారు.

*రూ. 52,29,82,495 జిల్లాకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులు

*రూ.36,60,87,747 అందులో గ్రామ పంచాయతీలకు

*రూ.7,84,47,374 జిల్లా ప్రజా పరిషత్‌కు

*రూ.7,84,47,374 మండల పరిషత్‌లకు

తాగునీటి పథకాల నిర్వహణకు మోక్షం

జిల్లా వ్యాప్తంగా 45 సీపీడబ్ల్యూ పథకాలు ఉండగా- వాటి నిర్వహణకు సంబంధించి గుత్తేదారులకు భారీగానే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక మొత్తం 24,544 తాగునీటి బోర్లు ఉన్నాయి. వేసవిలో బోర్ల మరమ్మతుల నిమిత్తం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు క్రాష్‌ కార్యక్రమం చేపట్టారు. మండల కార్యాలయాల్లో నిధుల కొరత కారణంగా కొన్ని చోట్ల ఆ బిల్లులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో కొంత గతంలో మాదిరిగానే సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు, తాగునీటి బోర్ల మరమ్మతులకు కేటాయించనున్నారు. వాటి నిర్వహణకు పోను మిగిలిన నిధులను ప్రాధాన్య క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. తాజాగా వచ్చిన ఆర్థిక సంఘం నిధులకు పాత నిబంధనలే వర్తించనున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా నిధులను పారిశుద్ధ్యానికి ఖర్చు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి.

పరిషత్‌లకు ఊరట

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక సంఘం నిధులను నేరుగా వాటి ఖాతాలకే కేటాయించింది. దాంతో మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దాంతో వాటి పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సైతం గ్రామాల్లో తాము ఏ పనులు చేయలేకపోతున్నామంటూ సర్వసభ్య సమావేశాల్లోనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాలకవర్గ సభ్యులు నిధులు కోరుతూ పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశే మిగిలింది. గత ఏడాది జులై నాలుగో తేదీతో పాలకవర్గాలకు గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. తాజాగా నిధులు ఇవ్వడంతో పరిషత్తులకు ఊరట లభించింది.

త్వరలోనే సర్దుబాటు చేస్తాం

జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే వాటిని కొత్త వాటితోపాటు, అన్ని పంచాయతీల ఖాతాలకు సర్దుబాటు చేస్తాం. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఖర్చు చేయాలి. ఈ మేరకు ఎంపీడీవో, ఈవోఆర్డీలకు ఆదేశాలు ఇవ్వనున్నాం. - నారాయణరెడ్డి, డీపీవో

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.