close

శనివారం, సెప్టెంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆశల సాగరం

● వరి నారుమడులకు సిద్ధమవుతున్న రైతులు

● కృష్ణా వరద నీరు రాకతో చిగురించిన ఆశలు

వరి విత్తనాలు చల్లుతున్న దృశ్యం

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణాలో వరద నీరు రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ ఏడాది సాగునీటి రాకపై సాగర్‌ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వానలతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు వస్తోంది. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం మెండుగా ఉండటంతో మాగాణి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

నిండుగా ఎగువ జలాశయాలు

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఎగువ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర గరిష్ఠ మట్టానికి చేరువలో ఉన్నాయి. ఎగువ నుంచి శ్రీశైలానికి 1.65 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఈక్రమంలో 885 అడుగుల గరిష్ఠ స్థాయి నీటిమట్టం కాగా ఆదివారం నాటికి 855 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 40 వేల క్యూసెక్కులు విడుదలవుతుండగా 590 అడుగుల గరిష్ఠ మట్టానికి గాను 559 అడుగులకు నీరు చేరింది. జిల్లాకు సాగు నీటి అవసరాలకు సాగర్‌ కుడి కాలువ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ముమ్మరంగా పనులు

వరద నీటిరాకతో నారుమడులపై రైతులు దృష్టిపెట్టారు. జిల్లాలో సాగర్‌ ప్రధాన కాలువ, అద్దంకి బ్రాంచి కాలువ, దర్శి బ్రాంచి కాలువ, పమిడిపాడు బ్రాంచి కాలువల పరిధిలో 4.15 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు ఉంది. మాగాణుల్లోని బోరు బావుల కింద సాగర్‌ రైతులు వరి నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఈ ఏడాది రైతుభరోసా కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా బీపీటీ-5204, ఎన్‌ఎల్‌ఆర్‌-3449 తదితర వరి వంగడాలను స్థానికంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే త్రిపురాంతకం మండలంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులు 420 క్వింటాళ్ల వరి విత్తనాలను కొన్నారు. జిల్లాలోని కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, అద్దంకి తదితర మండలాల్లో బోరు బావుల కింద వరి నారుమడులను సిద్ధం చేస్తున్నారు.

సాగర్‌ నీరు వస్తుందని ఆశతో ఉన్నాం...

సాగర్‌ ఆయకట్టు కింద నాకు నాలుగు ఎకరాలు ఉంది. ఈ ఏడాది కూడా సాగర్‌ జలాలు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం. కాలువలకు నీరు వస్తుందన్న భరోసాతో నారుమడులు సిద్ధం చేసుకున్నాం. ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు తెచ్చుకున్నాం. బోరు బావి కింద నారు బాగుంది. - పల్లెబోయిన పిచ్చయ్య, సాగర్‌ రైతు, ఎండూరివారిపాలెం, త్రిపురాంతకం మండలం

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.