మధ్యవర్తిత్వమే మేలిమి మార్గం

సంపాదకీయం

మధ్యవర్తిత్వమే మేలిమి మార్గం

పోనుపోను ఇంతలంతలవుతున్న అపరిష్కృత వ్యాజ్యాల సమస్యతో సామాన్యుడికి సత్వర న్యాయం సుదూర స్వప్నమవుతోంది. తీర్పులు వచ్చేసరికి తరాలు గడచిపోతున్నాయన్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా వ్యాఖ్య- న్యాయపాలనలో సంస్కరణల ఆవశ్యకతను ఎలుగెత్తి చాటుతోంది. మధ్యవర్తిత్వానికి మేలుబాటలు పరచి వివాదాల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులను సుసాధ్యం చేసే సంపూర్ణ చట్టం అవసరమంటున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తాజా సూచన సహర్షంగా స్వాగతించదగింది. విశాల జనశ్రేయం దృష్ట్యా ఆ శాసనం అభిలషణీయం. కోట్ల కొద్దీ కేసుల పెండింగ్‌తో కక్షిదారులపై ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల భారం పడుతోందని ‘దక్ష్’ అధ్యయనం అయిదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో తెమలని దావాలతో దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతనూ నష్టపోతోందని లెక్కగట్టింది. విశ్వసనీయమైన మధ్యవర్తిత్వ వ్యవస్థ ద్వారా స్వల్ప వ్యయంతో సులువుగా వేగంగా వివాదాలను ఓ కొలిక్కి తీసుకురావచ్చంటున్న ప్రధాన న్యాయమూర్తి- పేద, మధ్యతరగతి వర్గాలకు దీనితో గణనీయమైన లబ్ధి చేకూరుతుందని భరోసా ఇస్తున్నారు. న్యాయస్థానాల్లో దావాల దాఖలుకు మునుపే మధ్యవర్తిత్వ మార్గంలో పరిష్కారం కోసం ప్రయత్నించాలని పౌర న్యాయస్మృతి సెక్షన్‌ 89 సిఫార్సు చేస్తోంది. అపరిష్కృత వ్యాజ్యాల భారం నుంచి న్యాయస్థానాలకు ఊరట దక్కాలంటే మధ్యవర్తిత్వ విధానాన్ని అందిపుచ్చుకోవాల్సిందేనని భారత న్యాయసంఘం (లా కమిషన్‌) ఏనాడో సూచించింది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగం వ్యవస్థాపనతో ఒనగూరే మేలును సర్వోన్నత న్యాయస్థానమూ అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. ఉభయ వర్గాలతో మాటామంతీ నెరిపే మధ్యవర్తుల నైపుణ్యాలకు మెరుగుపెట్టడానికి 2005లోనే ‘మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ’కి ప్రాణంపోసింది. నిష్పక్షపాత వైఖరితో హితవచన బోధనతో ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని పట్టాలెక్కించాలంటే మధ్యవర్తులు సుశిక్షితులు కావాలి. ప్రధాన న్యాయమూర్తి సూచించిన సమగ్ర శిక్షణా కార్యక్రమంతోనే అది సాధ్యం!

పల్లె రచ్చబండల సాక్షిగా మధ్యవర్తిత్వ విధానంలో ఇండియాకు ఘనమైన వారసత్వముంది. ఆంగ్లేయ న్యాయవ్యవస్థ దేశీయంగా పాదుకొన్నాక ఆ సంప్రదాయం మరుగున పడింది. గడచిన పదిహేనేళ్లలో సుప్రీంకోర్టు చొరవతో సంప్రదింపుల బాటలో వివాదాల పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు గణనీయమైన స్థాయిలో సాఫల్యమయ్యాయని అధ్యయనాలు చాటుతున్నాయి. దిల్లీ, రాంచీ, జంషెడ్‌పూర్‌, నాగ్‌పూర్‌, చండీగఢ్‌, ఔరంగాబాద్‌ వంటి నగరాల్లో ఈ విధానం గొప్పగా విజయవంతమైందని ‘సుప్రీం’ పత్రాలే సాక్ష్యమిస్తున్నాయి. మధ్యవర్తిత్వ వ్యవస్థకు మెరుగులు దిద్ది పేదలకు న్యాయఫలాలను అందించే ప్రగతి బాటలో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ చురుగ్గా ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా సింహభాగం వ్యాజ్యాలకు ఇదే విధానంలో పరిష్కారం చూపుతోంది. పౌర న్యాయప్రక్రియలో సంస్కరణల ద్వారా బ్రిటన్‌ సైతం తన ప్రజలకు గరిష్ఠంగా మేలు చేకూరుస్తోంది. మూడొంతుల మంది కక్షిదారులు, తొంభై శాతానికి పైగా న్యాయవాదులు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతికి మద్దతు పలుకుతున్నారన్న గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం- దేశీయంగా మధ్యవర్తిత్వ విధానం వ్యవస్థీకృతం కావాల్సిన సమయమిదేనని సూచిస్తోంది. న్యాయవిద్యార్థులకు దీనిపై విస్తృత అవగాహన కల్పించేలా విశ్వవిద్యాలయాలు ముందడుగేయాలి. న్యాయసేవల్లో కాలహరణాన్ని నివారించే ఈ మేలిమి విధానం మరింతగా విజయవంతం కావాలంటే- జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నట్లు చట్టబద్ధత, విశ్వసనీయత, ఆమోదయోగ్యతలకు సంబంధించి వ్యవస్థాపరమైన సమస్యలను పరిష్కరించాలి. ఈ మేరకు న్యాయ, శాసన వ్యవస్థలు సమష్టి కార్యాచరణతో కంకణబద్ధమైతేనే- ఏళ్లూపూళ్లు సాగుతున్న వ్యాజ్యాల విచారణతో నీరసించిపోతున్న న్యాయార్థులకు సాంత్వన లభిస్తుంది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న