close
Updated : 25/06/2021 15:42 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అందుకే మా బంధం గురించి ఇలా ఓపెన్‌గా మాట్లాడుతున్నా!

Photos: Instagram

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో ఆనందిగా పరిచయమైంది అవికా గోర్‌. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే అభినయంతో అతి తక్కువ కాలంలోనే పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. వెండితెర పైనా తన అభినయ ప్రతిభను చాటింది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ కొద్దిరోజుల క్రితం సన్నజాజి తీగలా మారి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నానంటూ తెలిపింది. అలా మొదలు.. ఇప్పటివరకు ఎప్పుడు, ఎక్కడున్నా తన ప్రేమికుడి గురించే మాట్లాడుతోందీ అందాల తార. సోషల్‌ మీడియాలోనూ తనతో దిగిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అయితే రిలేషన్‌షిప్‌ విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుతోన్న అవిక తీరు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆమె... తన రిలేషన్‌షిప్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ప్రేమలో ఉన్నామంటూ!

‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్‌. బాలనటిగా కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2013లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘తను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’.. మొదలైన సినిమాలతో తెలుగు సినీ ప్రియులకు బాగా చేరువైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ సీఈవోగా ఉన్న మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో ఉన్నట్లు గత నవంబర్‌లో నోరు విప్పింది అవిక. అప్పటి నుంచి సందర్భమొచ్చినప్పుడల్లా తన రిలేషన్‌షిప్‌ గురించి చెబుతోన్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా తమ ప్రేమ బంధం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

అమ్మానాన్నలు ఆశీర్వదించాకే!

‘నేను ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా ఉండాలనుకుంటాను. ఎలాంటి సందర్భమైనా దాపరికాల్లేకుండా మాట్లాడాలనుకుంటాను. ఇలా ఓపెన్‌గా ఉండాలన్న విషయాన్ని మా అమ్మానాన్నల నుంచే నేర్చుకున్నాను. వారు ఏ విషయమైనా సూటిగా మాట్లాడతారు. ఏదీ దాచుకోరు. ఈ కారణంగానే మా అమ్మానాన్నలను బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా భావిస్తాను. నాకు సంబంధించిన ఏ విషయమైనా మొదట వారితోనే చర్చిస్తాను. అలా మిలింద్‌ గురించి కూడా మొదట అమ్మానాన్నలతోనే మాట్లాడాను. వారు కూడా మా ప్రేమను ఆశీర్వదించిన తర్వాతే మేం ముందుకెళ్లాం. మా రిలేషన్‌షిప్‌ గురించి బహిరంగంగా ప్రకటించాం.’

అందుకే ఇలా ఓపెన్‌గా మాట్లాడుతున్నా!

‘ఇక మిలింద్‌ విషయానికొస్తే... వ్యక్తిగతంగానే కాదు మానసికంగా కూడా నేను ఎదగడంలో అతను ఎంతో సహకరించాడు. అందుకే మిలింద్‌తో నా రిలేషన్‌షిప్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నాను. నేను జీవితంలో ఎలాంటి వ్యక్తితోనైతే కలిసుండాలని కోరుకున్నానో...అలాంటి వ్యక్తే నా జీవితంలోకి వచ్చాడు. అందుకు నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ప్రస్తుతం మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.. అదేవిధంగా జంటగా మా భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం. మనం ఎప్పుడైనా అత్యంత సంతోషంగా ఉంటే, మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. మనలోని మార్పులను వారు సులభంగా గ్రహిస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది... మిలింద్‌ నా జీవితంలోకి వచ్చాక ఎన్నో మార్పులు సంభవించాయి. అతను నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. వ్యక్తిగతంగా... మానసికంగా నేను ఎదగడంలో ఎంతో సహకరించాడు. దీంతో మునుపటి కంటే నేను బాగా ఆలోచించడం మొదలుపెట్టాను. కష్టాలెదురైనా సంతోషంగా జీవించడం అలవాటు నేర్చుకున్నాను. మిలింద్‌ కారణంగానే నాలో ఎనలేని ఆత్మవిశ్వాసం పెంపొందింది. అందుకే అతడి గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

‘థ్యాంక్యూ’తో మళ్లీ తెర పైకి!

ముంబయికి చెందిన అవిక ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటోంది. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్యూ’ సినిమాలో ఓ కీలకపాత్రకు ఆమె ఎంపికైంది. అలాగే కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రూపొందుతోన్న ఓ చిత్రంలోనూ నటిస్తోందీ అందాల తార.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని