close
Updated : 07/07/2021 15:27 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

దిలీప్ నా కోహినూర్ వజ్రం... మాది దేవుడు కలిపిన బంధం!

Photo: Twitter

ఇద్దరి మధ్య 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి.. మనసులు ముడివేసుకున్నాయి.. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ‘అంత ఏజ్‌ గ్యాపా?’ అని అందరూ మాట్లాడుకున్నా.. ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా నిలిచారు. అనుక్షణం ప్రేమను పంచుకుంటూ తమ వైవాహిక జీవితాన్ని నిత్యనూతనం చేసుకున్నారు. వారే బాలీవుడ్‌ లెజెండరీ కపుల్‌ దిలీప్‌ కుమార్‌ - సైరా భాను. తొలి చూపులోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తమ అనుబంధాన్ని పెళ్లి పీటలెక్కించడానికి సుమారు ఆరేళ్లకు పైగానే పట్టింది. తమ 54 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో మధుర క్షణాలను మూటగట్టుకుంటూ ఎంతోమంది కపుల్స్‌కు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పారీ ఐకానిక్‌ కపుల్‌. దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ దివికేగిన ఈ విషాద తరుణంలో ఈ లవ్లీ కపుల్ ప్రేమకథను ఒక్కసారి నెమరు వేసుకుందాం!

‘ఎంతమంది అమ్మాయిల కళ్లు అతడినే చూస్తున్నా.. తొలి చూపులోనే అతడిని నా భర్తగా ఊహించుకున్నానం’టూ దిలీప్‌ గురించి ఓ సందర్భంలో పంచుకుంటూ మురిసిపోయారు సైరా. 12 ఏళ్ల వయసులోనే 34 ఏళ్ల దిలీప్‌తో ప్రేమలో పడిపోయారామె. ఆపై నాలుగేళ్ల తర్వాత అనుకోకుండా ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. 1960లో మొగల్‌-ఏ-ఆజమ్‌ చిత్ర ప్రీమియర్‌లో భాగంగా తన డ్రీమ్‌బాయ్‌ని తొలిసారి కలవాలని ఆరాటపడ్డారామె. కానీ అక్కడికి దిలీప్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు.

రాసిపెట్టుంది కాబట్టి..!

‘రాసిపెట్టుంటే అది తప్పకుండా జరుగుతుంది’ అంటుంటారు. సైరా విషయంలోనూ అదే జరిగింది. గతంలో ఓసారి దిలీప్‌ని మిస్సయినా.. ఆ తర్వాత మరో సందర్భంలో తొలిసారిగా ఆయన్ని కలిసే అవకాశమొచ్చింది. ఆ సమయంలో దిలీప్‌ తనను కళ్లతోనే పలకరించాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె. ‘దిలీప్‌ నా వైపు చూసి ఓ నవ్వు రువ్వాడు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అన్నట్లుగా ఆ నవ్వు నాతో చెబుతున్నట్లనిపించింది. అంతే.. నా మనసుకు ఒక్కసారిగా రెక్కలొచ్చినట్లనిపించింది. అప్పటికే నా మనసు లోతుల్లో ముద్రపడిపోయిన అతడి ప్రతిరూపాన్ని ఆరాధించడం మొదలుపెట్టా. అతడినే నా భర్తగా ఊహించుకున్నా’ అంటూ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు సైరా.

అలా మూగ ప్రేమ పెదవి దాటింది!

పాత కాలపు ప్రేమలు ఎలా ఉండేవి? మనసులో ప్రేమున్నా బయటికి చెప్పడానికి సిగ్గుపడేవారు.. కళ్లతోనే కౌగిలించుకోవడం, మనసుతోనే మాట్లాడుకోవడం.. వంటివి చేసేవారు.. సైరా-దిలీప్‌లు కూడా చాన్నాళ్ల పాటు ఇలాంటి మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర ఆమెదే అని చెప్పాలి. దీంతో ఆఖరికి దిలీప్‌ తన మూగ ప్రేమను బయటపెట్టారు. ఓ మంచి సందర్భం చూసి సైరాకు ‘ఐ లవ్యూ’ చెప్పారు. అప్పటికే తన మనసు నిండా అతడినే నింపుకొన్న సైరా వెంటనే అతని ప్రేమను అంగీకరించింది. అలా 1966లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

22 ఏళ్ల వయోభేదమా?

అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న వయోభేదం గురించే మాట్లాడుకున్నారట! ఈ ఏజ్‌ గ్యాపే కొన్నాళ్లకు ఇద్దరినీ విడదీస్తుందేమో అని అనుకునేవారట! అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారీ ఐకానిక్‌ కపుల్‌. ‘మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది’ అని తమ అనుబంధంతోనే నిరూపించారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్‌ గ్యాప్‌ పెళ్లి తర్వాతే కాదు.. పెళ్లికి ముందూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. పెళ్లికి ముందు దిలీప్‌ సైరాను తన హీరోయిన్‌గా ఎంచుకోవడానికి చాలా సార్లు నిరాకరించారట! ఎందుకంటే తనకంటే ఆమె వయసులో చాలా చిన్నది కావడమే ఇందుకు కారణమట! హీరోయిన్‌గానైతే తిరస్కరించాను కానీ.. ఆమె అందమైన రూపాన్ని మాత్రం తన మనసులో నుంచి తొలగించలేకపోయానంటూ ‘Dilip Kumar: The Substance and the Shadow’ అనే ఆత్మకథలో రాసుకొచ్చాడీ దిగ్గజ నటుడు.

ఆలోచనల్లో ఆమే.. మనసులోనూ ఆమే!

‘ఓసారి మా ఇంటి ముందు కారు దిగి అందమైన గార్డెన్‌ మధ్యలో నుంచి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నా. ఆ సమయంలో ఒక్కసారి సైరా రూపం నా కళ్ల ముందు కదలాడింది. అందమైన బ్రొకేడ్‌ శారీ ధరించి తన ఇంటి ముందు నిల్చున్నట్లుగా నా మనసులో ఆమె ప్రతిరూపం కనిపించింది. కానీ ‘తనది చాలా చిన్న వయసు.. ఇలా ఆలోచించడం సరికాదు..!’ అంటూ నా మనసును వెనక్కి తీసుకున్నా. ఈ వయోభేదంతోనే తనతో సినిమాలు చేయడానికి నిరాకరించాను. ఇలా నా ఊహల్లో నుంచి ఆమె ఆలోచనల్ని తాత్కాలికంగానైతే తొలగించగలిగాను కానీ.. నా మనసు నిండా ఆమే నిండిపోయిందని ఆ తర్వాత గానీ తెలుసుకోలేకపోయా..’ అంటూ తన భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడీ లెజెండరీ స్టార్‌.

అతడు నా ‘కోహినూర్‌’!

దిలీప్‌ను సైరా ముద్దుగా కోహినూర్‌ అని పిలుచుకునే వారట! అయితే పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్‌ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ గర్భం ధరించలేదామె. ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు చెందిన ఆస్మా రెహ్మాన్‌ అనే మహిళను దిలీప్‌ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. దాన్నో పీడకలలా మర్చిపోతూ తిరిగి సైరాను చేరుకున్నారాయన. ఇంత జరిగినా దిలీప్‌ నా వాడే అంటారు సైరా. ‘దిలీప్‌ నా కోహినూర్‌ వజ్రం. అతడు నాకు తెలిసిన క్షణం నుంచీ అతడికి నేను పెద్ద ఫ్యాన్‌ని.. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా! టీనేజ్‌లో ఉన్నప్పుడే అతడికి భార్య కావాలని నిర్ణయించుకున్నా. నేను ఏదైనా గట్టిగా అనుకుంటే అది నెరవేరేదాకా నిద్రపోను. ఎంతోమంది అందమైన అమ్మాయిలు దిలీప్‌ని కోరుకున్నారు. కానీ అతడు నన్ను కోరుకున్నాడు. అలా నా జీవిత కల సాకారమైంది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్‌ నా వాడు!’ అంటూ ఓ సందర్భంలో భర్తపై తనకున్న అపార ప్రేమను బయటపెట్టారీ అలనాటి అందాల తార.

తమ 54 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా కలిసే ఎదుర్కొందీ జంట. భర్తకు అనారోగ్యం ఎదురైనప్పుడల్లా అర్ధాంగిగా సేవలు చేస్తూ ఉత్తమ ఇల్లాలు అనిపించుకున్నారు సైరా. ఇలా క్షణమైనా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమను నింపుకున్న ఈ ఐకానిక్‌ కపుల్‌.. ప్రతి సందర్భంలోనూ జంటగానే కనిపించేది.. ఇలా తమ అజరామరమైన అనుబంధంలోని ప్రేమ పాఠాల్ని ఎన్నో జంటలకు రుచి చూపించి ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా నిలిచారు సైరా-దిలీప్‌.

785455112818864128

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని