close
Updated : 01/07/2021 20:49 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

పేరెంట్స్... మీ పిల్లల విషయంలో ఇవి పాటిస్తున్నారా?

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తులుగా పరిణతి చెందాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. అందులో అమ్మ పాత్ర మరింత కీలకం. ఈ క్రమంలో పిల్లలతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం ద్వారా వారిలో ఎదుగుదల ఆశించినట్టుగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ వీలైనప్పుడల్లా వాళ్లతో ఆడుతూ, పాడుతూ ఉంటే పిల్లలు ఆల్‌రౌండర్‌గా రాణిస్తారు.

* చిన్న చిన్న వైఫల్యాలు ఎదురైనప్పుడు పిల్లలు కుంగిపోకుండా చూడాలి. దీనికోసం వాళ్లను ఇతర పిల్లలతో పోల్చిచూడడం మానుకోవాలి. ఎవరి సామర్థ్యాలు వాళ్లకు ఉంటాయి. ఒక అంశంలో ఒకరు మెరుగ్గా ఉంటే వేరే అంశంలో ఇంకొకరు ఉన్నతంగా ఉండొచ్చు. కాబట్టి చిన్నారుల మధ్య పోలిక తీసుకురావడం సరికాదు. మీ చిన్నారికి ఎదురైన సమస్యలు, వాళ్ల బలహీనతలపైనే దృష్టి సారించండి. ప్రతి రోజూ ఇలాగే ఉండదని చెప్పాలి. దీనిద్వారా వాళ్లు ఫెయిల్యూర్‌ని తట్టుకోగలరు. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు గర్వపడడం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండడం లాంటివి కూడా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనూ ఈ పరిస్థితి శాశ్వతం కాదని చెప్పాలి. నిరంతరం శ్రమిస్తేనే ఇప్పుడున్న స్థానం పదిలమవుతుందని వివరించాలి.

* ఆరోగ్యం, పరిశుభ్రత మొదలైన అంశాల్లోనూ పిల్లల అవగాహనను పెంచాలి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, శుభ్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ఇలాంటివన్నీ వాళ్లకు వివరించాలి. ఆరోగ్యం, శుభ్రత అవసరాన్ని వాళ్లకర్థమయ్యేలా వివరించాలి. ఇలాచేయడం ద్వారా వాళ్లు పెద్త్దెన తర్వాత ఆరోగ్యం, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

* డబ్బు ఖర్చు, పొదుపు విషయంలోనూ చిన్నారులకు అవగాహన కల్పించడం ముఖ్యమే. డబ్బు అవసరం, అదెలా వస్తుంది, దాన్ని ఎలా ఖర్చుచేయాలి... ఇలాంటివన్నీ వాళ్లకు వివరించండి. ప్రత్యేకించి డబ్బులు పొదుపు చేయడం చిన్నప్పటి నుంచే వాళ్లకు అలవాటు చేయాలి.

* పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండేలా చూడడమూ ముఖ్యమే. ఏం చేస్తే, ఎలా ఉంటే సంతోషంగా ఉండొచ్చో వాళ్లకు వివరించాలి. వాళ్లు దేన్ని ఇష్టపడితే ఆనందం అందులోనే లభిస్తుందని చెప్పాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకుని వారితో కలిసి ఆ పనులు చేయండి. వాళ్ల అభిరుచి పెరిగి, చేసిన పనిని ఆస్వాదించేలా చూడండి.

* పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఆటలాడుకోకుండా బయట కూడా ఆడేలా ప్రోత్సహించండి. ఉదయం ఆరుబయట ఆడడం వల్ల విటమిన్-డి శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. ఆరుబయట ఆటల ద్వారా వాళ్లలో చురుకుదనం పెరుగుతుంది. ఆరోగ్యానికీ మంచిది. కాబట్టి అవుట్‌డోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమిచ్చి, రోజూ కొంత సమయం వెచ్చించండి.

* పిల్లలు స్వతంత్రంగా ఉండేలా, సొంత నిర్ణయాలు తీసుకునేలా చూడడమూ అవసరమే. మీపై ఆధారపడకుండా వాళ్ల పనులు వాళ్లే చేసుకునేలా శిక్షణ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వాళ్ల సామర్థ్యం మెరుగవడంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుంది. చీటికీ మాటికీ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరమూ తప్పుతుంది.

* చిన్నప్పటి నుంచే పిల్లల్లో భక్తి భావం పెంపొందించడమూ ముఖ్యమే. దీనికోసం పెద్దపెద్ద మంత్రాలు, స్తోత్రాలు లాంటివి నేర్పాల్సిన పనిలేదు. మీతో కలిసి ధ్యానం చేయించడం, సూర్య నమస్కారాలు, గుడికి తీసుకెళ్లడం... లాంటివి చేయాలి.

* పిల్లల్లో దేని గురించైనా తెలుసుకోవాలనే ఆతృత పెంచడమూ ముఖ్యమే. ఫలితంగా పిల్లల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగి, నేర్చుకోవడానికి వీలవుతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే విసుక్కుంటారు. అయితే పిల్లలు ఆ విషయానికి సంబంధించి ఆలోచించారు కాబట్టే ఆ సందేహం వచ్చిందని తెలుసుకోవాలి. మీకు సమాధానం తెలియకపోతే తర్వాతైనా దాని గురించి తెలుసుకుని వాళ్లకు చెప్పాలి. ప్రశ్నలు వేయడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పిల్లలకు అవకాశమివ్వండి. వాళ్లు తప్పనిసరిగా బ్రిలియంట్స్‌గా మారతారు.

* పిల్లల మధ్య చిన్నచిన్న పరీక్షలు పెట్టి వాళ్ల స్కిల్స్ వారంతట వాళ్లే ఉపయోగించుకునే, మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వండి. సొంతంగా చిన్నచిన్న పనులు చేసుకోవడాన్ని ప్రోత్సహించండి. ఎంత నేర్చుకున్నా దాన్ని ఉపయోగించడం తెలుసుకోవడమూ ముఖ్యమే. మీరు చేయాల్సిందల్లా... వెనుక ఉండి పర్యవేక్షించడమే.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని