close
Updated : 28/08/2021 04:41 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడు కోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...

జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణను సమన్వయం చేసుకునేందుకు, పోటీలో నిలదొక్కుకునేందుకు మానసికంగా.. శారీరకంగా ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండేందుకు వ్యాయామం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే ఇక్కడ ఓ ప్రధాన సమస్య ఉంది. జిమ్‌లకు వెళ్తే మగవాళ్లతో పాటు చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది.  మహిళలకు ప్రత్యేక సమయాలున్నా చాలా చోట్ల శిక్షకులు మగవాళ్లే ఉంటారు. ఇదీ అసౌకర్యమే. ఈ సమస్యలకు పరిష్కారంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో మహిళా జిమ్‌లు వెలిశాయి. మహిళా శిక్షకులూ పెరిగారు. దీంతో జిమ్‌లకు వెళ్లే మహిళల సంఖ్యా బాగా పెరిగింది. ఇంతలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ సమయంలో చదువులకే కాదు... వ్యాయామానికీ ఆన్‌లైన్‌ పాఠాలు వచ్చేశాయి. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబుల్లో వందల మంది శిక్షకులు వీడియో పాఠాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీరిని అనుసరించే వారి సంఖ్యా భారీగానే ఉంది.

‘కాలేజీలో చదువుకునేటపుడు సన్నగా కనిపించేదాన్ని.. పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఒళ్లు చేశాను. నచ్చిన డ్రెస్‌ వేసుకోలేకపోతున్నా. వర్క్‌ఫ్రం హోంతో మరింత బరువు పెరిగా. జిమ్‌కు వెళ్లినా అందరి మధ్య వ్యాయామం ఇబ్బందిగా అనిపించి మానేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ వద్ద.. నాలుగు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నా. పొత్తి కడుపు, పిరుదుల  వద్ద ఉన్న అదనపు కొవ్వును తగ్గించే వ్యాయామాలను అడిగి సాధన చేస్తున్నా. అదే యూనిక్‌ జిమ్‌ /ట్రైనర్‌ వద్ద ఇంతగా ఓపెన్‌ అవ్వలేకపోయే దాన్న’ంటూ ఐటీ నిపుణురాలు శర్మిష్ట చెప్పుకొచ్చారు.


‘వ్యాయామాల్లో సౌకర్యవంతమైన వస్త్రధారణ ముఖ్యం. చీర, చుడీదార్‌లో వ్యాయామాలు, యోగాసనాలు కష్టం. ఇటువంటి సున్నితమైన కారణాలు మగువల ఆసక్తిని వెనక్కినెట్టాయి. ఇప్పుడు అలా కాదు. మహిళలు శిక్షణ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నార’ని విశ్లేషించారు హైదరాబాదు అబిడ్స్‌లోని ఇన్‌స్పైర్‌ ఉమెన్‌ జిమ్‌ శిక్షకురాలు అర్షి.


అతివ మనసు ఆమెకే తెలుసు..

హోటల్‌లో నలుగురు స్నేహితురాళ్లు కూర్చుని కాఫీ తాగితేనే చుట్టూ ఉన్న వాళ్లంతా వింతగా చూస్తుంటారు. అటువంటిది జిమ్‌కెళ్తే ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో గమనించానంటారు టోలిచౌకికి చెందిన అబిదా ఫాతిమా. అందుకే పర్ల్‌స్వ్కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశానంటారామె.. ‘యూనిక్‌ జిమ్‌ సెంటర్స్‌లో పురుషులు/మహిళలు ఒకే ప్రాంగణంలో సాధన చేస్తుంటారు. అతివలను సున్నితంగా భావించి తేలికపాటి వ్యాయామాలు చేయిస్తుంటారు. ఊబకాయులు, నడుం, పిరుదుల భాగంలో బెల్లీ ఫ్యాట్‌ ఉన్న మహిళలు వారి ఇబ్బందిని శిక్షకుడితో పంచుకునేందుకు సిగ్గుపడతారు. ఒక మహిళ తన మానసిక, శారీరక పరిస్థితులను మరో మహిళతోనే ధైర్యంగా పంచుకోగలదంటున్నారు శిక్షకురాలు సనాషాబల్‌.


సంతోషం.. సానుకూల ఆలోచన

హిళల శరీరతత్వం ఒక్కొకరికి ఒక్కోలా ఉంటుంది. దానిని అర్థం చేసుకుని తగినట్టుగా వ్యాయామం చేయించాలి. సాటి స్త్రీగా శిక్షకురాలు అంచనా వేసి వ్యాయామాలు చేయిస్తున్నారని ఐటీ నిపుణురాలు అమల్‌ పాటిల్‌ తెలిపారు. వ్యాయామం ప్రారంభించాక తనలో చాలా మార్పులొచ్చాయి, సానుకూల దృక్పథం, సంతోషం, చురుకుదనం పెరిగాయన్నారు  గృహిణి సాక్షి.


గృహిణి ఫిట్‌.. గృహం హిట్‌

థైరాయిడ్‌, రక్తపోటు, మధుమేహం, పీసీఓడీ, హార్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు, వచ్చినా అధిగమించేందుకు వ్యాయామం వైపు మొగ్గు చూపడం క్రమంగా పెరుగుతోంది. దీన్ని అలవాటుగా మార్చుకున్న వారు శారీరకంగా దృఢంగా ఉంటూ మానసిక ఒత్తిడినీ అధిగమిస్తున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లూ, సమాజమూ ఆరోగ్యంగా ఉంటాయి.


కసరత్తులకూ ఆన్‌లైన్‌

బిడియాన్ని పోగొట్టుకుని స్వేచ్ఛగా శరీరాన్ని కదిల్చేందుకు కొంత సమయం తీసుకుంటారు మహిళలు. ఇవన్నీ మనకెందుకని కొందరు మధ్యలోనే మానేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆన్‌లైన్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా మహిళా కోచ్‌ల వద్ద శిక్షణ పొందేందుకు యువతులు, ఐటీ నిపుణులు, గృహిణులు ఆసక్తి చూపుతున్నారు. తమను ఎలా మలుచుకోవాలని ఉందనేదీ నిర్భయంగా చెబుతున్నారు. అందుకే పదేళ్ల క్రితం నలుగురైదుగురు ఉన్న మహిళా వ్యాయామ శిక్షకుల సంఖ్య ఇప్పుడు వందల్లోకి చేరిందన్నారు సెలబ్రిటీ ట్రైనర్‌ కిరణ్ డేంబ్లా. ఫిట్‌నెస్‌ పాఠాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షన్నర మంది ఆమెని అనుసరిస్తున్నారు.

ఆన్‌లైన్‌ వల్ల ఎంతో సమయం ఆదా, నచ్చిన ట్రైనర్‌ను అనుసరించ వచ్చని గుంటూరుకు చెందిన శిక్షకురాలు డాక్టర్‌ విద్య చెప్పారు. ఆవిడ శిష్యుల్లో దేశవిదేశాల వారు ఉన్నారు. మా ప్రాంతంలో మహిళా జిమ్‌ లేదు. కానీ ఆన్‌లైన్‌ వల్ల ఆ కొరత తీరిందని సంతోషంగా చెప్పారు ఆదిలాబాద్‌కు చెందిన వనిత.

- జి.సాంబశివరావు, హైదరాబాద్‌

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని