close
Updated : 27/03/2021 01:03 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మురికివాడల్లో.. విజిల్‌ మోగింది!

రోడ్డు పక్కన రేకుల షెడ్డే ఆమె నివాసం... కనీస గుర్తింపు, చిరునామా లేని దైన్యం...రోజంతా కష్టం చేసి కడుపునింపుకొన్న బాల్యం. కాళ్లకు చెప్పులు కూడా లేని పేదరికం. ఇవన్నీ ఆమెకి అడుగడుగునా అడ్డుపడినా... ఆమె గెలుపుని మాత్రం ఆపలేకపోయాయి. చెన్నై వీధుల నుంచి వెళ్లి మాస్కోలో జరిగిన ఫుట్‌బాల్‌ క్రీడలో విజయ పతాకాన్ని ఎగరేసేవరకూ సాగిన సంగీతాశేఖర్‌ విజయగాథ ఇది. ఇప్పుడు ఆమె కథే డాక్యుమెంటరీగా అందరి మన్ననలూ అందుకుంటోంది.

‘త్వరగా నిద్రలే. వెలుగొస్తే... మరుగుదొడ్డికి వెళ్లే వీలుండదు’... రోజూ తల్లి పిలిచే ఈ పిలుపుతోనే నిద్రలేస్తుంది సంగీత. ఎందుకంటే ఇంటిల్లిపాదీ కాలకృత్యాలు తీర్చుకునేది, స్నానాలు చేసేది, బట్టలు మార్చుకునేదీ పబ్లిక్‌ టాయిలెట్‌లోనే. పొద్దెక్కితే... కామంతో తడిమే కళ్లు వారిని వెంటాడతాయి మరి. అందుకే ఆ పరుగులు. మద్రాసు రైల్వేస్టేషన్‌ సెంట్రల్‌ వద్ద ఉండే వాల్‌టాక్స్‌ రోడ్డులో పాదచారుల మార్గంలో వేసిన చిన్న రేకుల షెడ్డులో సంగీత పుట్టింది. ఆమె కుటుంబం ఆరు తరాలుగా అక్కడే నివాసం ఉంటోంది. సంగీతకు ఆరేళ్లు వచ్చేసరికి తాగుడుకి బానిసైన ఆమె తండ్రి  కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. అసలే అంతంతమాత్రం బతుకులు...పైగా నలుగురు పిల్లల్ని సాకాలంటే మాటలు కాదు. అయినా ఇంట్లో ఒక్కరైనా చదువుకుంటే బాగుంటుందని సంగీతను స్కూల్లో చేర్పించిందామె తల్లి. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. అనారోగ్యం ఆమెను పనికెళ్లనీయకపోవడంతో ఇంటిని నడపడం కోసం పదేళ్ల వయసులోనే సంగీత బాధ్యతల్ని పంచుకోవడానికి ముందుకొచ్చింది. కడుపులో ఆకలి మెలితిప్పుతున్నా...ఓర్చుకుంటూ చీకటి పడేవరకూ పనిచేయడానికి అలవాటు చేసుకుందా పసిది. ఎందుకంటే...ఆ డబ్బుతోనే అమ్మ గంజి కాచి తమ కడుపులు నింపేది.

వారి సాయంతో... ఆ నోటా ఈ నోటా సంగీత పనిచేస్తోన్న అల్యుమినియం సంస్థలో బాలకార్మికులు ఉన్నారన్న విషయం బయటకు పొక్కింది. అప్పుడు కరుణాలయ ఎన్జీవో... అధికారుల సాయంతో సోదాలు చేసింది. సంగీత వారి కంటపడింది. వారు ఆమెను తిరిగి బడిబాట పట్టించారు. అప్పుడే ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుంది సంగీత. ‘ఓ రోజు కొందరు మగపిల్లలు ఫుట్‌బాల్‌ ఆడటం చూశా. నాకూ నేర్పించగలరా అని వారి కోచ్‌ని అడిగా. యాభైమంది మగపిల్లలున్నారు. వారి మధ్య నువ్వు నేర్చుకోగలను అనుకుంటే నాకే అభ్యంతరం లేదు అన్నారాయన. అలా సాధన చేయడం మొదలుపెట్టా. కొత్తదనం, బెదురు లేకుండా ఫుట్‌బాల్‌ ఆడుతున్న నన్ను చూసి ‘ఇంతకు ముందు ఎక్కడైనా శిక్షణ పొందావా’ అని అడిగారు. లేదని చెబితే ‘కచ్చితంగా ఇందులో నీకు మంచి భవిష్యత్తు ఉంది. వదలకు’ అన్నారాయన. నన్ను చూశాకే బాలికలకోసం ప్రత్యేకంగా బృందాన్నీ సిద్ధం చేశారు. ఆడపిల్లలు ఆటలు ఆడటానికి మా ప్రాంతంలో ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే మాపై ఎక్కువగా లైంగిక వేధింపులుండేవి. ఇక షార్ట్స్‌ ధరిస్తే అవి మరింత పెరుగుతాయని భయం. అయితే కోచ్‌, ఎన్జీవో ప్రోత్సాహంతో టీం సిద్ధమైంది. దానికి నన్ను నాయకత్వం వహించమన్నారు.’ అని చెప్పుకొచ్చింది సంగీత.

షూస్‌ కూడా లేకుండానే...  ఏడాది పాటు శిక్షణ సాగింది. సరైన పోషకాహారం ఉండేది కాదు...కాళ్లకు షూస్‌ అసలే లేవు. అలాంటి స్థితిలో చెన్నైలో జరిగిన తొలి టోర్నమెంట్‌ ‘స్లమ్‌ సాకర్‌’లో సంగీత జట్టు పోటీపడి గెలిచింది. అంతేకాదు...అత్యధిక స్కోరు సాధించి బెస్ట్‌ ప్లేయర్‌గానూ నిలిచింది. ఆ గెలుపే ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత కల్పించింది. మొదటిసారి 2016 స్కాట్‌లాండ్‌లో జరిగిన హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారతదేశం నుంచి సంగీత అర్హత సాధించి సత్తా చాటింది. తర్వాత రష్యాలో జరిగిన ‘స్ట్రీట్‌ చైల్డ్‌ వరల్డ్‌ కప్‌’లో అండర్‌-18 గ్రూప్‌కి నాయకత్వం వహించి జట్టుని విజేతగా నిలిపింది. అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదామెకు. ఇంటి చిరునామా, ఐడెంటిటీ కార్డు లేకపోవడంతో పాస్‌పోర్టు, వీసా రాలేదు. దాంతో సంగీత కోర్టు మెట్లెక్కింది. ఇవన్నీ ప్రస్తావిస్తూ మాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో వీధిబాలల సంక్షేమం-అభివృద్ధి అనే అంశంపై ప్రస్తావించింది. బీఎస్సీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. టెడెక్స్‌ వేదికపై మాట్లాడుతూ  ‘అంతకుముందు కనీసం రైలు కూడా ఎక్కలేదు నేను. అడ్డంకులను దాటి ప్రపంచకప్‌ పోటీలకు హాజరై విజేతగా నిలిచినందుకు అమ్మ మురిసిపోతోంది. ఫుట్‌బాల్‌లో ఫిఫా ఉమెన్‌ వరల్డ్‌కప్‌ పోటీల్లో పాల్గొనాలనేదే నా లక్ష్యం అంటోంది సంగీతకు ఆల్‌ది బెస్ట్‌ చెబుదామా!
‘జీవితం నుంచి ఏమి నేర్చుకున్నానని అడిగితే చెప్పలేను కానీ ఫుట్‌బాల్‌ ఆట మాత్రం నాకు జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసింది’ అని చెబుతోంది ఇరవై ఏళ్ల సంగీత. 2018లో రష్యాలో జరిగిన ‘స్ట్రీట్‌ చైల్డ్‌ వరల్డ్‌ కప్‌’లో అండర్‌-18 గ్రూప్‌కి నాయకత్వం వహించి, జట్టుని గెలిపించింది. అలా ఒక్కసారిగా సంగీత పేరు మారుమోగిపోయింది. చెన్నై వీధుల నుంచి అంతర్జాతీయ స్టేడియం వరకూ సాగిన ఆమె పయనాన్ని స్ఫూర్తిమంతంగా చెప్పాలనుకుంది శిఖ, ఐశ్వర్యల స్నేహ బృందం. ‘మేడిన్‌ మద్రాస్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని