close
Updated : 29/03/2021 03:35 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మీరు చూపిన మార్గానికి వందనాలు చందనా!

పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి...
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపన...
సామాజికాభివృద్ధిలో తానూ ఓ భాగం కావాలనే ఆలోచన...
ఆమెను ఐఏఎస్‌ సాధించే దిశగా అడుగులు వేయించాయి.
ఆ లక్ష్యంతోనే కోటిరూపాయల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ, విదేశాల్లో ఉద్యోగాన్నీ తృణప్రాయంగా వదులుకుని వచ్చేశారామె. ఆమే దాసరి హరిచందన. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న ఆమెకు సామాజిక మార్పునకు కృషిచేస్తున్నందుకు యూకే ప్రభుత్వం బ్రిటిష్‌ కౌన్సిల్‌ అవార్డు-2021 ప్రకటించింది.

‘మార్పు కోరుకుంటే రాదు...ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది’ అనే హరిచందన పర్యావరణ ప్రేమికురాలు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పర్యావరణ అర్థశాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ‘కార్బన్‌ క్రెడిట్స్‌’ అనే అంశంపై పరిశోధన చేసి ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం అందుకున్నారు. అయినా ఆమెకు అవేవీ సంతృప్తినివ్వలేదు. ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన నాన్న ఇచ్చిన స్ఫూర్తితో తానుకూడా ప్రజాక్షేత్రంలో పనిచేయాలనుకున్నారు. అందుకు సివిల్‌ సర్వీసే మార్గం అని భావించారు. దాంతో ఆరంకెల జీతం, విదేశాల్లో ఉద్యోగం, విలాసవంతమైన జీవితాన్ని... తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారామె. అనుకున్నది సాధించి ఐఏఎస్‌ అధికారిణిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, సామాజికాభివృద్ధి వంటివాటితో పాటు పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారామె. అవే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. యూకే ప్రభుత్వం బ్రిటిష్‌ కౌన్సిల్‌ అవార్డు- 2021కు ఎంపిక చేసింది. మన దేశం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైంది చందన ఒక్కరే కావడం గమనార్హం. రెండు, మూడేళ్లకోసారి యూకే ప్రభుత్వం ఆ దేశంలో చదివిన పూర్వ విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ అవార్డును ప్రకటిస్తుంది.

షీ మొబైల్‌టాయిలెట్లు...
పునర్విభజన తర్వాత ఏర్పడిన నారాయణపేట జిల్లాకు రెండో కలెక్టర్‌గా అడుగుపెట్టారు హరిచందన. ఈ ప్రాంతంలో వలసలెక్కువ. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన బాధ్యతలకు భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. అయినాసరే వచ్చిన కొద్దిరోజుల్లోనే పాలనపై పట్టు దక్కించుకున్నారు. వలసల్ని అరికట్టడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో రాష్ట్రంలోనే మొదటిసారి కోస్గిలో షీ మొబైల్‌ టాయిలెట్‌ని ప్రారంభించారు. వాటి బాధ్యతను స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. అలానే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో తక్కువ ఖర్చుతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు.
అరణ్య పేరుతో అమ్మకాలు...
మహిళా సంఘాల నేతృత్వంలో నాలుగులక్షలకు పైగా నాణ్యమైన కాటన్‌ మాస్కులను తయారు చేయించి అమ్మారు. వీటిని హైదరాబాద్‌ మెట్రోరైల్‌, ఫిక్కీ వంటి పేరున్న సంస్థలతో పాటు విజయ్‌ దేవరకొండ, శోభూ యార్లగడ్డ వంటి సినీ ప్రముఖులకూ సరఫరా చేశారు. ముఖ్యంగా కర్పూరం, తులసి, పుదీనా, లవంగం, వాము మిశ్రమాలతో తయారుచేసిన ఆయుర్వేద మాస్కులకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. వీటిని అమ్మగా వచ్చిన యాభైలక్షల రూపాయల ఆదాయంతో నైపుణ్యాల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిద్వారా మహిళలకు చేనేత వస్త్రాలు, వెదురు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. అక్కడ తయారైన వస్తువులను ‘అరణ్య’ పేరుతో విక్రయిస్తున్నారు.
వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి...
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పని చేసిన సమయంలోనూ పలు సంస్కరణలు తీసుకొచ్చారు. వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి రోడ్లు, మరుగుదొడ్లు, బస్టాపుల నిర్మాణం చేశారు. చెరువుల్లో వ్యర్థాలను తొలగించి, అవి అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో మూలన పడ్డ వాహనాల టైర్లు, వస్తువులతో పార్కులను అందంగా తీర్చిదిద్దారు.

-నర్సింగోజ్‌ మనోజ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని