close
Updated : 20/04/2021 02:03 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

బంగారు పతకాల పంట పండించింది

చదువుకోవాలన్న అమ్మ కలను తన కళ్లల్లో పెట్టుకుంది.. ఉద్యోగం సాధించాలన్న నాన్న ఆశయాన్ని తనదిగా మార్చుకుంది... ఏ ఇబ్బందులూ తన సంకల్పాన్ని దెబ్బతీయలేవంటోంది మానస. ఆ దిశగా అడుగులేస్తూ... వ్యవసాయ ఇంజినీరింగ్‌లో ఏకంగా ఏడు బంగారు పతకాలను అందుకుంది ఈ చదువుల తల్లి. ఈ సందర్భంగా వసుంధరతో ముచ్చటించింది.

మానసది ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వెలిగండ్ల. నాన్న కొండారెడ్డి, అమ్మ సుబ్బలక్ష్మి. తమ్ముడు నితిన్‌రెడ్డి. పొట్టకూటి కోసం ఇరవై ఏళ్ల క్రితమే హైదరాబాదుకు వచ్చి స్థిరపడిందా కుటుంబం. తన చదువంతా ఇక్కడే సాగింది. ‘నాన్న డిగ్రీ చదువుకున్నారు. ఉద్యోగం చేయాలనేది ఆయన కల. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేకపోయారు. నగరంలోని కొత్తపేటలో టిఫిన్‌సెంటర్‌ పెట్టారు. ఇదే మాకు జీవనాధారం. తెల్లవారు జామున మొదలయ్యే పని పొద్దుపోయే దాకా సాగుతూనే ఉంటుంది. ఇంత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేది మా భవిష్యత్తు కోసమే అని తరచూ అమ్మ చెబుతుంటే వాళ్ల కోసం నేనేం చేయగలనా అని ఆలోచించేదాన్ని. చిన్నప్పుడు అమ్మ బాగా చదువుకోవాలనుకునేదట. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, మామయ్యను మాత్రమే చదివించగలిగారు అమ్మమ్మవాళ్లు. అమ్మ కొంతకాలం రాత్రి బడికి వెళ్లినా అదీ ఎంతో కాలం సాగలేదు. తన కోరిక అలానే మిగిలిపోయింది. ఆ ఇష్టంతోనే ఎంత కష్టపడైనా మమ్మల్ని చదివిస్తామనేది. చదువుకోవాలని ఉన్నా... ఆర్థిక పరిస్థితులు తనకు సహకరించలేదనీ, మీరైనా బాగా చదువుకోవాలని తమ్ముడికీ, నాకూ...  చెప్పేది. అమ్మ మాటలు తెలియకుండానే నాపై బలమైన ముద్రవేశాయి. దీంతో బాగా చదువుకోవాలనుకునేదాన్ని. ఆ కోరికతోనే ప్రణాళికాబద్ధంగా చదవడం ప్రారంభించా. తరగతిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉండేదాన్ని. ఆరు నుంచి పదోతరగతి వరకు దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ పాఠశాలలో చదువుకున్నా. పదోతరగతిలో 9.3 జీపీఏ సాధించాను. తర్వాత ఇంటర్‌ ఎంపీసీ తీసుకున్నాను. 95శాతం మార్కులు సాధించాను’ అని గుర్తుచేసుకుంది మానస.

మామయ్య సలహాతో...
మానస ఎంసెట్ రాశాక బీటెక్‌లో ‘అగ్రికల్చర్‌’ చేయమని వాళ్ల మామయ్య సలహా ఇచ్చారట. బాల్యం అంతా నగరంలోనే గడవడంతో వ్యవసాయం గురించి ఆమెకు పెద్దగా తెలియదు. అయినా సరే వ్యవసాయం మీద పట్టు సాధించాలనుకుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీటు లభించింది. సంగారెడ్డి జిల్లా కందిమండలంలోని కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌లో చేరింది. ‘మొదట అందరిలానే బీటెక్‌ చేసి ఐటీ రంగంలో స్థిరపడాలనుకున్నా. కానీ మా మామయ్య అందరూ చేసేదే నువ్వూ చేస్తే నీ ప్రత్యేకత ఏముంటుంది? అంటూ ఈ కోర్సు గురించి చెప్పారు. ఇరువైపుల తాతల కుటుంబాలు వ్యవసాయంలో ఉన్నా... నాకు సాగుపై పెద్దగా అవగాహన లేదు. ప్రారంభంలో కాస్త కష్టపడ్డా. ఓ దశలో పాఠాలు అర్థమయ్యేవి కావు. ఇటువైపు వచ్చి తప్పు చేశానా అని కూడా ఆలోచించా. కానీ వెనకడుగు వేస్తే అమ్మానాన్నల కష్టం వృథా అవుతుంది. పైగా ప్రయత్నించకుండానే చేయలేను అనకూడదని నాకు నేనే సర్ది చెప్పుకొన్నా. అధ్యాపకుల సహకారం తీసుకున్నా. క్రమంగా ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచీ ప్రణాళిక ప్రకారం చదవడం నా అలవాటు. తెల్లవారుజామున 3 గంటలకే లేచి చదవడం మొదలుపెట్టేదాన్ని. క్రమంగా సబ్జెక్టుపై పట్టు సాధించగలిగా’ అని వివరించింది మానస. మూడు విభాగాల్లో మొదటి స్థానం సాధించి, మూడు బంగారు పతకాలు గెలుచుకుంది. మొత్తంగా అత్యధిక మార్కులు సాధించి మరో నాలుగు బంగారు పతకాల్ని సొంతం చేసుకుంది.

నాన్న కోరిక నెరవేర్చాలి..
‘చిన్నప్పటి నుంచి బాగా చదివి అమ్మ కోరికను నెరవేర్చాను. ఏడు బంగారు పతకాలు వస్తాయని నేను ఊహించలేదు. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధించి నాన్న కలను సాకారం చేయాలి’ అంటోంది మానస. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌లో ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించకపోయినా పరిశోధనలు చేసి కొత్త ప్రాజెక్టుతో ఆహార సంబంధిత అంకుర పరిశ్రమను స్థాపించాలనేది తన కోరిక అని చెబుతోంది.

చదువుకోవాలని ఉన్నా... ఆర్థిక పరిస్థితులు తనకు సహకరించలేదనీ, మీరైనా బాగా చదువుకోవాలని తమ్ముడికీ, నాకూ...  అమ్మ చెప్పేది. ఆ మాటలు తెలియకుండానే నాపై బలమైన ముద్రవేశాయి.

- పి.సూర్యకిరణ్‌, న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని