close
Updated : 20/07/2021 18:22 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అలా 12 ఏళ్లకే ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది!

Photo: Facebook

నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడులతో అట్టుడికే ప్రాంతంలో ఆమె పుట్టి పెరిగింది. వీటి నుంచి త్వరగా తన దృష్టిని మరల్చుకోవాలనుకుంటూ ఐదేళ్ల ప్రాయంలోనే ఆటపై ఆసక్తి, అభిమానం పెంచుకుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, అడ్డంకులు ఎదురైనా తన ప్రయాణాన్ని ఆపలేదు.  ఆంక్షలు, ఇబ్బందులతో కొన్ని మ్యాచ్‌లే ఆడినా అద్భుత విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమె 12 ఏళ్ల హెంద్‌ జజా.

ఈసారి అత్యంత పిన్న వయసు అథ్లెట్‌ ఈమే!

మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి అందరి దృష్టి సిరియాకు చెందిన టీటీ ప్లేయర్‌ హెంద్‌పైనే ఉంది. ఎందుకంటే ఈమె వయసు కేవలం 12 ఏళ్లు మాత్రమే. ఈమెగా క్రీడా సంబరంలో పాల్గొననున్న అత్యంత పిన్నవయసు అథ్లెట్‌ ఈమెనే కావడం విశేషం. ప్రస్తుతం వరల్ట్‌ టీటీ ర్యాంకింగ్స్‌లో 155వ స్థానంలో ఉన్న జజా... కొన్నినెలల క్రితం జోర్డాన్‌ వేదికగా జరిగిన పశ్చిమాసియా టీటీ అర్హత పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఒలింపిక్‌ బెర్తు ఖరారు చేసుకుని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో ఐదో పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. వీటితో పాటు టీటీలో సిరియాకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మొట్టమొదటి ప్లేయర్‌గా గుర్తింపు సాధించింది.

5 ఏళ్ల వయసులోనే !

అంతర్యుద్ధం కారణంగా సిరియా దేశంలో బాగా నష్టపోయిన పట్టణాల్లో హామా కూడా ఒకటి. అక్కడే 2009లో పుట్టింది హెంద్‌. 5 ఏళ్ల వయసులో కోచ్‌ సహాయంతో టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఉగ్రవాద దాడుల నుంచి తన దృష్టిని మరల్చుకోవడానికి ఈ ఆట ఆమెకు బాగా తోడ్పడింది. ఈ క్రమంలో  2016లో ఖతార్‌ వేదికగా ‘ ITTF (ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌)’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది హెంద్‌. అక్కడ వయసులో తనకంటే ఎంతో పెద్దవారైన సీనియర్‌ టీటీ ప్లేయర్స్‌తో పోటీపడి సత్తాచాటిందీ టీనేజ్‌ గర్ల్‌. ఆ గుర్తింపుతోనే ‘ ITTF’ నిర్వహించే మరికొన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ‘హెంద్‌ లాంటి క్రీడాకారిణులు అరుదుగా ఉంటారు. టీటీలో బంతిని అందుకోవడానికి ఆమె పడే తాపత్రయాన్ని చూస్తుంటే  నాకు ఆశ్చర్యమేసింది.  వాస్తవానికి ఆటలో తాను ఇంకా ఎన్నో మెలకువలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతికంగా మరింత మెరుగుపడాల్సి ఉంది. అయితే హెంద్ ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే ఆటపై పూర్తి పట్టు సాధించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టదు. త్వరలోనే ఆమెలో ఓ గొప్పక్రీడాకారిణిని మనం చూడబోతున్నాం’ అంటూ ఈ సందర్భంగా ITTF నిర్వాహకులు ఒకరు ఆమె గురించి ప్రశంసలు కురిపించడం విశేషం.

విద్యుత్‌ సరఫరా కూడా అంతంతమాత్రమే!

రోజుకు కనీసం మూడు గంటల పాటు వారంలో ఆరు రోజుల పాటు సాధన చేస్తుంది హెంద్‌. అయితే చాలామంది అథ్లెట్లలా ఆమె ఇంట్లో సకల సౌకర్యాలేమీ ఉండవు. ప్రస్తుతం సిరియా రాజధాని డమాస్కస్‌లో నివాసముంటోన్న హెంద్‌ తన ఇంట్లోనే ఓ చిన్న గదిని ప్రాక్టీస్‌ రూంగా మార్చుకుంది. కాంక్రీట్‌ ఫ్లోర్‌తో ఏర్పాటైన ఆ గదిలో కేవలం నాలుగు టేబుల్స్‌ మాత్రమే ఉంటాయి. అవి కూడా ఎంతో పురాతనమైనవి. విద్యుత్‌ సరఫరా కూడా అంతంతమాత్రమే. అందుకే సూర్యరశ్మి ద్వారా వచ్చే వెలుగులోనే ఎక్కువగా సాధన చేస్తుంటుందీ యంగ్‌ గర్ల్‌.

31 ఏళ్ల క్రీడాకారిణిని ఓడించి!

ITTF నిర్వహించిన పలు అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటింది హెంద్‌. ఈ క్రమంలో హోప్స్‌, క్యాడెట్స్, జూనియర్స్‌, సీనియర్స్‌... ఇలా నాలుగు విభాగాల్లో నేషనల్‌ టీటీ టైటిల్స్ సాధించిన తొలి సిరియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక కొన్నినెలల క్రితం జోర్డాన్‌ వేదికగా జరిగిన పశ్చిమాసియా టీటీ అర్హత టోర్నీలోనూ సత్తాచాటిందీ యంగ్‌ గర్ల్‌. ఈ పోటీల్లో ఆమె లెబనాన్‌కు చెందిన 31 ఏళ్ల క్రీడాకారిణి మరియానా సహకియాన్‌ను  ఓడించడం విశేషం. ఆతర్వాత టైటిల్‌ విజేతగా నిలిచి టోక్యో బెర్తును ఖరారు చేసుకుంది. ‘టోక్యో బెర్తును దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నా తల్లిదండ్రులు, స్నేహితులతో పాటు నా దేశ ప్రజలందరికీ నేను అందిస్తోన్న ఓ చిన్న బహుమతి’ అని చెప్పుకొచ్చిందీ టీన్‌ సెన్సేషన్‌.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని