close
Updated : 05/08/2021 17:37 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

నాన్న చివరి చూపుకి కూడా నోచుకోలేకపోయాను!

(Photo: Instagram)

ప్రతిష్ఠాత్మక విశ్వ క్రీడల్లో భారత్‌కు అమ్మాయిలే పెద్ద దిక్కుగా మారారు. అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది మన్ననలు అందుకుంటోన్న భారత అమ్మాయిల్లో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆటపై ప్రేమ పెంచుకున్న వారే. అందులో మిజోరాంకు చెందిన 21 ఏళ్ల లాల్రెంసియామీ కూడా ఒకరు.

నాన్న రోజంతా కష్టపడితే రూ.250 వచ్చేవి!

భారత మహిళల హాకీ జట్టులో మేటీ ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది లాల్రెంసియామి. ప్రస్తుతం టోక్యోలో కూడా తనదైన ఆటతీరును ప్రదర్శించింది. ఈ క్రమంలో బ్లూ జెర్సీ ధరించి హాకీ ఆడేందుకు తాను పడిన ఇబ్బందులను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ద్వారా గుర్తు చేసుకుందీ హాకీ క్వీన్.

‘నాది మిజోరంలోని కొలాసిబ్‌. రాజధాని ఐజ్వల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. నాన్న ఓ చిన్న రైతు. అమ్మ గృహిణి. మేం మొత్తం ఏడుగురు సంతానం. అందరమూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం. నాన్న రోజంతా కష్టపడితే 250 రూపాయలు వచ్చేవి. అమ్మానాన్న మమ్మల్ని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. అందుకే నేను కూడా ఏదో ఒకటి సాధించి వారిని సంతోషపెట్టాలనుకునేదాన్ని. అయితే ఆ అవకాశం హాకీ ద్వారా వస్తుందని కలలో కూడా ఊహించలేదు.’

క్రిస్మస్‌కి మాత్రమే ఇంటికి వెళ్లేదాన్ని!

‘నాకు హాకీపై ఆసక్తి కలగడానికి కారణం మా అమ్మే. తను టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. అందుకే హాకీ స్టిక్‌ పట్టుకోగానే ‘గో..హెడ్‌’ అంటూ నన్ను ప్రోత్సహించింది. అయితే మా ఇంటి నుంచి హాకీ అకాడమీకి మధ్య దూరం సుమారు 84 కిలోమీటర్ల దూరం ఉండేది. ఒక్కసారి అక్కడకు వెళ్లి రావాలంటే నాన్న రోజూ సంపాదించే డబ్బులు కూడా సరిపోయేవి కావు. దీంతో నేను అకాడమీలోనే ఉండి శిక్షణ తీసుకుంటానని అమ్మానాన్నలతో చెప్పాను. అప్పుడు ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారమని మరోసారి ఆలోచించుకోమన్నారు. అయితే అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తారని...ఎలాంటి డబ్బులు అవసరం లేదని చెప్పి అమ్మానాన్నలను ఒప్పించాను. ఈ క్రమంలో అకాడమీ నిర్వహించిన కొన్ని ట్రయల్స్‌లో సత్తా చాటి అక్కడ శిక్షణ పొందేందుకు అర్హత సాధించాను.

అకాడమీకి బయలుదేరేటప్పుడు నాన్న కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. ‘నీకు నచ్చిన విధంగా ఉండు’ అంటూ నన్ను పంపించారు. అయితే ఒక్కసారిగా ఇంటిని వదిలి రావడంతో అకాడమీలో ఒంటరితనానికి గురైనట్లు అనిపించింది. పైగా ఇక్కడ పెద్దగా సెలవులు కూడా ఉండేవి కావు. కేవలం క్రిస్మస్ హాలిడేస్ లోనే ఇంటికి వెళ్లేదాన్ని.’

ఇంగ్లిష్‌, హిందీ రాక ఇబ్బంది పడ్డాను!

‘ఎప్పటికైనా బ్లూ జెర్సీ ధరించి భారత జట్టుకు ఆడాలన్నది నా కోరిక. దీనిని నెరవేరుస్తానని అమ్మానాన్నలకు మాట కూడా ఇచ్చాను. ఇల్లు గుర్తొచ్చినప్పుడల్లా ఈ మాటలను గుర్తుకు చేసుకునేదాన్ని. వాటిని నిజం చేసేందుకు మరింత కష్టపడేదాన్ని. ఇక నాకన్నా నా తల్లిదండ్రులే నాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకసారి టోర్నమెంట్లో పాల్గొనడం కోసం నాన్న సంతకం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడకు రావడానికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించదు. అయినా నా కోసం, నా లక్ష్యం నెరవేర్చడం కోసం అకాడమీకి వచ్చారు నాన్న. ఇది జరిగిన కొద్ది రోజులకే జూనియర్‌ నేషనల్‌ టీం నుంచి నాకు పిలుపు వచ్చింది. శిక్షణ కోసం దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే నాకు ఇంగ్లిష్‌, హిందీ అసలు రాదు. ఈ విషయంలో రాణీ రాంపాల్‌తో పాటు మరికొంతమంది సహచరులు నాకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాను. ఆసియా కప్‌, ఏషియన్‌ గేమ్స్‌, యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాను.’

చివరి చూపుకి కూడా నోచుకోలేకపోయా!

‘ఆటలో వెన్నుతట్టి ప్రోత్సహించిన నాన్న గతేడాది కన్ను మూశారు. అయితే ఆయన చివరి చూపునకు నోచుకోలేకపోవడం నా జీవితంలో అతి పెద్ద విషాదం. అప్పుడు నేను టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో ఆడుతున్నాను. చిలీతో కీలకమైన సెమీస్‌ మ్యాచ్ ఉన్న రోజే నాన్న చనిపోయాడన్న వార్త తెలిసింది. దీంతో నేను ఇంటికి వెళ్లలేకపోయాను. దుఃఖాన్ని దిగమింగుతూనే మ్యాచ్‌ ఆడాను. జట్టు విజయం సాధించాక మైదానంలో ఏడుస్తూ కూలబడిపోయాను. అప్పుడు నా సహచరులు నా దగ్గరకు వచ్చి ‘నిన్ను చూసి మీ నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు’ అని నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి నాన్న ఎక్కడున్నా గర్వపడేలా చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒలింపిక్స్‌ కూడా అందులో ఒక భాగం. ప్రస్తుతం నా దృష్టంతా ఆట పైనే ఉంది. నాన్న పై నుంచి నా ఆటను గమనిస్తుంటారనుకుంటున్నా. ఆయన కోసం, జట్టు కోసం, ముఖ్యంగా నా దేశం కోసం గోల్‌ కొట్టినప్పుడల్లా మైదానంలో నేను ఎక్కడున్నానో వెతుకుతూ ఉంటారు’ అని చెప్పుకొచ్చిందీ యంగ్‌ సెన్సేషన్.

ఇలా ఈ హాకీ క్వీన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చూసి ఎంతోమంది చలించిపోతున్నారు... భావోద్వేగానికి గురవుతున్నారు.. ‘హ్యాట్సాఫ్‌ లాల్రెంసియామీ .. నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి!’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని