close
Updated : 16/06/2021 19:55 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అందుకు కూడా సిద్ధమయ్యా కానీ.. పైసా ఆశించలేదు..!

సమాజంలో ఒంటరి తల్లులు, విడాకులు పొందిన మహిళలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయరాని తప్పు చేసినట్లు చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. సూటిపోటి మాటలంటూ మానసిక వేదనకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను అధిగమించి జీవితంలో ముందుకెళ్లాలంటే మాత్రం మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. అలాంటి దృఢమైన వ్యక్తిత్వం గల మహిళల్లో నీనా గుప్తా ఒకరు.
వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో ప్రేమలో పడిన నీనా అతనితో కలిసి మసాబాకు జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలోనే అతని నుంచి విడిపోయారు. దీంతో సింగిల్‌ పేరెంట్‌గానే మసాబాను పెంచి పోషించారీ సీనియర్‌ యాక్ర్టెస్. ఈ క్రమంలో తాను ఎన్నో ఇబ్బందులు పడినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నీనా.


సినిమాలకు మించి మలుపులు!
నీనా గుప్తా... హిందీ సినిమాలు, సీరియల్స్‌ చూసేవారికి ఈ సీనియర్‌ నటీమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతోనే కాదు తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచారీ సీనియర్‌ యాక్ట్రెస్‌. సినిమాల్లో ఉండగానే వివియన్‌ రిచర్డ్స్‌తో ప్రేమలో పడడం..గర్భం ధరించడం...రిచర్డ్స్‌తో విడిపోవడం.. మసాబా జననం...వివేక్‌ మెహ్రాతో రెండో పెళ్లి... సమాజం నుంచి ఛీత్కారాలు... ఇలా సినిమాలకు మించిన మలుపులు ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్నాయి. చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలున్న నీనా... మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా తన కూతురు పెంపకం, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మరికొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు.


అమ్మ నుంచే నేర్చుకున్నాను!
‘మహిళగా స్వతంత్రంగా ఎలా బతకాలో మా అమ్మను చూసే నేర్చుకున్నాను. అందుకే నా జీవితకాలంలో ఎప్పుడూ డబ్బు కోసం ఇతరులపై ఆధారపడలేదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులెదురైనా నాకు నేనే స్వయంగా పరిష్కరించుకున్నాను. మసాబా పుట్టిన తర్వాత కూడా ఇండిపెండెంట్‌గానే ఉందామనుకున్నాను. నా దృష్టిలో ఏ పని కూడా తక్కువ కాదు. చిన్న చిన్న పనులు చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు.’


ప్లేట్లు కడగడానికి కూడా సిద్ధమయ్యా కానీ!
‘మసాబా పుట్టిన తర్వాత ఒక దశలో నేల తుడవడం, ప్లేట్లు కడగడం లాంటి పనులు చేయడానికి కూడా సిద్ధమయ్యాను... కానీ డబ్బు కోసం ఎవరి దగ్గరా ప్రాధేయపడలేదు. యుక్తవయసులో ప్రేమలో పడినప్పుడు భవిష్యత్‌ గురించి పెద్దగా ఆలోచించం. ‘నెక్ట్స్‌ ఏంటి?’ అన్న విషయం కూడా మన మదిలోకి రాదు. నా విషయంలోనూ అలాగే జరిగింది. అయితే ఆ తర్వాత నేను గర్భంతో ఉన్నప్పుడు కానీ...మసాబా పుట్టి పెరుగుతున్నప్పుడు కానీ... ఎవరి నుంచీ పైసా ఆశించలేదు. ఎన్ని ఇబ్బందులెదురైనా నా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదనుకున్నాను. అందుకే చివరకు నా కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వారు, సన్నిహితులు, స్నేహితుల దగ్గర కూడా చేతులు చాచలేదు’ అని చెప్పుకొచ్చారీ అలనాటి అందాల తార. 


సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సూపర్బ్!
90ల్లో తన అందం, అభినయంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న నీనా సెకండ్‌ ఇన్సింగ్స్‌లోనూ రాణిస్తున్నారు. ‘వీరే ది వెడ్డింగ్‌’, ‘ముల్క్‌’, ‘బధాయి హో’, ‘పంగా’, ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నీనా ‘83’, ‘డయల్‌ 100’, ‘గ్వాలియర్‌’ సినిమాలతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇక తన జీవితానికి అక్షర రూపమిస్తూ నీనా రాసిన ‘Sach Kahun Toh’ పుస్తకం ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని