close
Updated : 14/06/2021 21:13 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ప్రేమలో విఫలమయ్యారా?? డోంట్ వర్రీ..

'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..' అంటాడు 'మిర్చి' సినిమాలో ప్రభాస్. అయితే మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావిస్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.అలాంటి సందర్భాల్లోనే మానసిక కుంగుబాటుకు గురవ్వడం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టాలే ఎక్కువ. 'ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం..!' అనే భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకు ఎన్నో మార్గాలున్నాయ్!
బీ పాజిటివ్!
ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బాధాకరమైన సంఘటనలు, గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తలొగ్గితే నష్టపోయేది మీరే! ఇలాంటప్పుడు నెగెటివ్ ఆలోచనలు మానసిక ప్రశాంతత కరవయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడం మంచిది. 'ఇప్పటివరకు నా జీవితంలో జరిగిందంతా ఓ పీడకల. అది నా మంచికే జరిగింది! తను ప్రేమించకపోతేనేం.. ఇంత కంటే మంచి వ్యక్తి నా జీవితంలోకి వస్తారు..' అని మిమ్మల్ని మీరే పాజిటివ్ ఆలోచనల వైపు మరల్చుకోవాలి. దీనివల్ల మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా 'పాజిటివ్'గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే.. ఎలాంటి కష్టమొచ్చినా దాన్ని సులభంగా దాటేయొచ్చు.

పంచుకోండి..
సంతోషాన్ని పంచుకున్నా.. పంచుకోకపోయినా.. బాధను మాత్రం పంచుకోవాలంటారు పెద్దలు. ఎందుకంటే మనసుకు బాధ కలిగినప్పుడు ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుంది. అలాగే వారి నుంచి మీ సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ప్రేమలో విఫలమైనంత మాత్రాన 'జీవితంలో అన్నీ కోల్పోయాం' అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన నుంచి త్వరగా బయటపడి మీకు సహాయపడే, నమ్మకస్తులైన స్నేహితులకు, ఆత్మీయులకు విషయమంతా వివరించండి. దీంతో వారు మీకు ధైర్యం చెప్పడం, మంచి సలహాలివ్వడం.. వంటివి చేస్తారు. తద్వారా 'ప్రేమలో విఫలమయ్యాం' అనే ప్రతికూల భావనలను మనసులోంచి క్రమంగా తొలగించవచ్చు.
ఇకనైనా దూరంగా..
ప్రేమ గుడ్డిది అంటారు. అందుకేనేమో.. చాలామంది ప్రేమలో ఉన్నంతసేపు ఎదుటి వారు మంచివారా? కాదా? అనే విషయం పట్టించుకోరు. కానీ ప్రేమలో ఓడిపోయినప్పుడు మాత్రం 'ముందే నేను ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు..' అంటూ తమని తామే దూషించుకుంటారు. ఎదుటి వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారి ప్రేమను అంగీకరించినట్లయితే ఇలాంటి సమస్యలేవీ ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు. అయితే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రేమలో విఫలమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటప్పుడు ఆ వ్యక్తికి, అతనితో సంబంధం ఉన్న వారికి కూడా ఎంత దూరంగా, జాగ్రత్తగా మెలిగితే అంత మంచిది. ఫలితంగా మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు తావుండదు. దూరం పెరగడం వల్ల మర్చిపోవడం కూడా సులభమవ్వచ్చు.

నచ్చిన పనులు..
మనసు బాగోలేనప్పుడు ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ఖాళీగా, ఒంటరిగా కూర్చుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలతో మరింత కుంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఇష్టమైన వ్యాపకాల కోసం ఆ సమయాన్ని కేటాయించాలి. ఉదాహరణకు.. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, పెయింటింగ్, రకరకాల వస్తువులతో బొమ్మలు తయారు చేయడం, టీవీ చూడడం, సంగీతం వినడం.. ఇలా రోజూ ఇష్టమైన అంశంపై దృష్టి సారించడం వల్ల మనసులోని బాధ నుంచి క్రమంగా ఉపశమనం పొందచ్చు.
స్థల మార్పిడి వల్ల..
ప్రేమలో విఫలమయ్యామన్న భావన నుంచి బయటపడాలంటే కొన్ని రోజులు ఉన్న చోటు నుంచి వేరే ప్రదేశానికి వెళ్లడం, నచ్చిన వారితో గడపడం మంచిది. లేదంటే రోజూ అవే ఆలోచనలు, పాత జ్ఞాపకాలు మనసును మరింతగా బాధపెడతాయి. కాబట్టి కొన్ని రోజుల పాటు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఏదైనా ట్రిప్‌కి ప్లాన్ చేసుకోవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, వాళ్లతో కలిసి బిజీగా గడపడం, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లడం.. వంటివి చేయాలి. అయిన వారితో, ఆత్మీయులతో సరదాగా సమయం గడపడం, వాళ్ల ప్రేమ, ఆదరణ వల్ల మనసు కుదుటపడే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు కరోనా మహమ్మారి గురించి మాత్రం మర్చిపోకండి. ప్రత్యేకించి స్నేహితులను, బంధువులను కలిసేటప్పుడు అన్ని రకాలుగా మీ జాగ్రత్తలో మీరుండండి. 

చూశారుగా.. ప్రేమలో విఫలమైనప్పుడు ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు మనసులో తావివ్వకుండా తిరిగి మళ్లీ మామూలు మనిషిగా మారాలంటే ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలో. వీటితో పాటు మానసిక ప్రశాంతత కోసం రోజూ యోగా, ధ్యానం, నచ్చిన ఆటలు ఆడడం, పాటలు వినడం.. వంటివి కూడా చేయచ్చు. మనుషులు, పరిస్థితులు ఎంత బాధ కలిగిస్తున్నా మంచి రోజులు మన వెన్నంటే ఉంటాయి. సో.. బీ హ్యాపీ!

గమనిక:
ఒకవేళ ఎప్పుడైనా మీరు ప్రేమలో విఫలమైనట్లయితే- ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డారో పంచుకోండి.. మీ అనుభవాలు, సూచనలు, సలహాలు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొంతమందికి ఉపయోగపడచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని