close
Updated : 05/08/2021 16:24 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

Green Workspace : ఆ కిటుకులేంటో తెలుసుకుందామా?!

ఇంటి నిండా జనం, చేస్తే తరగనంత పని.. ఇంటి నుంచి పని చేసే మహిళలు ఇలాంటి రొటీన్‌తో విసుగెత్తిపోతున్నారు. తీరా ఇంటి పనంతా పూర్తై ల్యాపీ ముందు వాలిపోయేసరికి.. అక్కడా నిరుత్సాహకరమైన పని వాతావరణమే దర్శనమిస్తుంటుంది. నిజానికి ఇది చేసే పనిపై ఏకాగ్రత కొరవడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అదే మన పని ప్రదేశాన్ని పర్యావరణహితంగా మార్చేస్తే మనసుకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు పని ఉత్పాదకతనూ పెంచచ్చంటున్నారు. ఇదే విషయం ఓ ప్రయోగాత్మక అధ్యయనంలో కూడా వెల్లడైంది. అయితే ఆలస్యమెందుకు మరి, ఆ కిటుకులేంటో తెలుసుకొని మనమూ మన పని ప్రదేశాన్ని ఎకో-ఫ్రెండ్లీగా మార్చేసుకుందాం రండి..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా మనం ఎంచుకున్న పని ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకుంటాం.. ఇందుకోసం ప్రత్యేకంగా ఫర్నిచర్, అలంకరణ సామగ్రి.. వంటివి కొనుగోలు చేయాల్సి వస్తుందనుకుంటాం.. కానీ ఏ ఖర్చు లేకుండా ఉన్న ఫర్నిచర్‌తోనే.. పర్యావరణహితంగా ఈ చిన్నపాటి మార్పులు చేసుకుంటే పనిప్రదేశాన్ని ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా మార్చేసుకోవచ్చు.

దుమ్ము పని పట్టే మొక్కలు!

ఇంటిని రోజూ శుభ్రం చేసినా తిరిగి దుమ్ము చేరడం సహజం. పని ప్రదేశమూ ఇందుకు మినహాయింపు కాదు. ఇక వారానికోసారో లేదంటే నెలకోసారో శుభ్రం చేయడం వల్ల ఇది మరింతగా పేరుకుపోతుంది. నిజానికి పని ప్రదేశం ఇలా దుమ్ము-ధూళితో ఉన్నా అస్సలు పని చేయాలనిపించదు. మరి, ఈ సమస్యను అధిగమించాలంటే.. ఆ ప్రదేశంలో కొన్ని ఇండోర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేసుకోమంటున్నారు నిపుణులు. దుమ్ముకు-పచ్చటి మొక్కలకు సంబంధమేంటి అని మీకు సందేహం రావచ్చు! అయితే కొన్ని రకాల ఇండోర్‌ ప్లాంట్స్‌ దుమ్మును, అపరిశుభ్రమైన గాలిని ఆకర్షించి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. కాక్టస్‌, స్పైడర్‌ ప్లాంట్‌, కలబంద, ఆస్పరాగస్‌ ఫెర్న్,    తమలపాకు మొక్క.. వంటివి దుమ్ము పని పడతాయట! కాబట్టి వెంటనే వీటిని మీరు పనిచేసే ప్రదేశంలో అమర్చుకుంటే చూడ్డానికి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.. అక్కడి వాతావరణం పరిశుభ్రంగానూ ఉంటుంది.. ఏమంటారు?!

నోటీస్‌ బోర్డ్‌కు బదులుగా..!

రోజూ పని మొదలుపెట్టే ముందు ఆ రోజు చేయాల్సిన పనులేంటో నిర్ణయించుకొని వాటిని పుస్తకంలో రాసుకోవడం లేదంటే ప్రాధాన్యత ప్రకారం స్టికీ నోట్స్‌పై రాసి వాటిని నోటీస్‌ బోర్డుపై అతికించుకోవడం మనకు అలవాటే! అయితే ఇలా పేపర్స్‌ని వృథా చేయడం కూడా ఓ రకంగా పర్యావరణానికి హాని చేసినట్లే! పైగా ఇలా నోటీస్‌ బోర్డుపై పేపర్స్‌ ఎక్కువగా కనిపించేసరికి.. వామ్మో ఇంత పనుందా అంటూ ఆదిలోనే నిట్టూరుస్తుంటాం. మరి, అలా జరగకుండా.. పని ప్రదేశం ఆహ్లాదకరంగా, పర్యావరణహితంగా ఉండాలంటే నోటీస్‌ బోర్డు/పుస్తకాలకు బదులు మీ ముందు ఓ చిన్న బ్లాక్‌ బోర్డ్‌ అమర్చుకోండి. ఫలితంగా పేపర్‌ ఉపయోగించాల్సిన పని ఉండదు.. రోజువారీ పనులేంటో దానిపై ఒకదాని తర్వాత ఒకటి రాసుకొని.. మరుసటి రోజు చెరిపేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు.

కాస్త ఎండ పడనివ్వండి!

చాలామంది హోమ్‌ ఆఫీసుల కోసం ఏసీ రూముల్నే ఎంచుకుంటుంటారు. ఇందులోనే కంఫర్టబుల్‌గా ఉంటుందనుకుంటారు. నిజానికి ఇలా ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో కూర్చోవడం వల్ల శరీరానికి గాలి, వెలుతురు తగలక లేనిపోని అనారోగ్యాలు తలెత్తచ్చు. పైగా గాలి, వెలుతురు లేని గదుల్లో తేమ స్థాయులు (హ్యుమిడిటీ) పెరిగిపోయి పని చేయడానికి అనువుగా ఉండవు. అందుకే హోమ్‌ ఆఫీస్‌ క్యాబిన్‌ని కిటికీ పక్కగా, ఉదయం ఎండ పడే చోట ఏర్పాటుచేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఉదయం పూట ఎండ నుంచి వచ్చే డి-విటమిన్‌ శరీరం గ్రహించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే మూసి ఉన్న గదుల్లో అయితే నిరంతరాయంగా లైట్లు వేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్‌ బిల్లు కూడా మోగిపోతుంది. కాబట్టి గాలి, వెలుతురు ధారళాలంగా ఉన్న ప్రదేశమైతేనే పని చేసుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.

చక్కటి పరిమళం.. వినసొంపైన మ్యూజిక్!

కొంతమందికి గది పరిమళభరితంగా ఉంటే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.. మరికొంతమంది మంద్రస్థాయిలో సంగీతం పెట్టుకొని పని చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు తమకు నచ్చినట్లుగా గది వాతావరణాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ముఖ్యంగా పరిమళాల విషయానికొస్తే.. బయట దొరికే పరిమళాల కంటే అత్యవసర నూనెలు, సెంటెడ్‌ క్యాండిల్స్‌, అగర్‌బత్తీ.. వంటివి ఉపయోగించచ్చు. ఇక సంగీతం విషయానికొస్తే.. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పనిచేస్తే ఏకాగ్రత లోపిస్తుందనుకుంటే గదిలో స్పీకర్‌ ఏర్పాటుచేసుకొని.. ఒత్తిడిగా అనిపించినప్పుడు మంద్రస్థాయిలో సౌండ్‌ పెట్టుకొని ఆస్వాదించచ్చు. నిజంగా ఇలాంటి పని వాతావరణం గురించి వింటుంటేనే ఎంత హాయిగా ఉందో కదూ!!

ఇక వీటితో పాటు రీఫిల్‌ చేసే పెన్నులు, తినడానికి-తాగడానికి తిరిగి వాడుకునే స్టీల్‌/సెరామిక్‌/గాజు పాత్రలు-గ్లాసులు.. వంటివి ఉపయోగిస్తే మీరు పనిచేసే చోట చెత్త పేరుకుపోకుండా ఉంటుంది.. పర్యావరణహితంగానూ ఉంటుంది. ఇలా నీట్‌గా ఉన్న చోట ఏకాగ్రత లోపించకుండా పని చేయాలనిపిస్తుంది..!

కావాలంటే మీరూ మీ హోమ్‌ ఆఫీస్‌ క్యాబిన్‌ని ఇలా ఎకో-ఫ్రెండ్లీగా మార్చేసుకొని చూడండి.. ఇవి కాకుండా ఈ అంశంపై మీకు తెలిసిన, రోజూ పాటించే చిట్కాలేమైనా ఉంటే మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని