ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రభావం ఎలా ఉందంటే!

తాజా వార్తలు

Published : 24/10/2020 01:55 IST

ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రభావం ఎలా ఉందంటే!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి నుంచి ఏప్రిల్‌ కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ ఊహించని ఈ పరిస్థితి వ్యక్తుల ఆహారం, నిద్ర అలవాట్ల మార్పులకు కారణమయ్యింది. అయితే, ఇది ఎంతవరకు ప్రభావం చూపాయనే విషయంపై ప్రపంచంలోనే తొలిసారిగా ఓ అధ్యయనం చేపట్టారు. అమెరికాలోని లౌసియానా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన సర్వే ప్రకారం, స్థూలకాయం ఉన్నవారిలో లాక్‌డౌన్‌ కారణంగా సమస్యలు మరింత ఎక్కువైనట్లు తేలింది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు నాణ్యమైన నిద్ర కూడా కరవైందని ‘జర్నల్‌ ఒబెసిటీ’లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టంచేసింది.

లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వారి జీవణశైలిలో మార్పులు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆహారం, నిద్ర అలవాట్లలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. స్థూలకాయుల్లో ఈ మార్పులు గణనీయంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లాక్‌డౌన్‌ వల్ల ఇంటివద్దే ఉండడంతో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఎక్కువ తినడం, తక్కువ వ్యాయామం చేయడంతో పాటు నాణ్యమైన నిద్రలో మార్పులు వచ్చాయని గమనించారు. వీటికి తోడు ఆందోళన స్థాయిలు కూడా రెట్టింపు అయినట్లు అధ్యయనంలో పాల్గొన్న లియన్నే రెడ్‌మ్యాన్‌ వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న మూడులో ఒకటో వంతు స్థూలకాయులు లాక్‌డౌన్‌ కాలంలో మరింత బరువు పెరిగారని.. మిగతా ప్రజల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే బరువు పెరిగినట్లు తెలిపారు. స్థూలకాయుల్లో శరీరక ఆరోగ్యం కంటే మానసికంగానే ఎక్కువ ప్రభావం చూపినట్లు పరిశోధనలో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో స్థూలకాయుల ఆరోగ్యం విషయంలో డాక్టర్లు మరింత శ్రద్ధ చూపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కాలం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు. వర్చువల్‌ పద్ధతిలో రోగులకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులకు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో జరిపిన ఈ సర్వేలో 7754 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేతో పాటు మరికొన్ని దేశాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తాజా నివేదికలో వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని