గోళ్లు ఆరోగ్యం గురించి చెబుతాయట!

తాజా వార్తలు

Published : 07/12/2020 01:04 IST

గోళ్లు ఆరోగ్యం గురించి చెబుతాయట!

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోళ్లు మన వేళ్లకు అందమైన ఆభరణాలు. అతి సున్నితమైన వేలి కొసలకు ఆసరాగా నిలిచేవి గోళ్లే. అంతేనా మన ఆరోగ్యానికి ఇవి ఆనవాళ్లు కూడా. వీటిలో కనిపించే ప్రతి చిన్న మార్పు శరీరంలో తలెత్తే అనారోగ్యం తాలూకు సంకేతమేనంటారు డాక్టర్లు. వాటిలో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు తదితరాలన్నీ శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ల లోపం వంటివి మొదలుకొని హైబీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి విపత్తుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సంకేతాలు గోళ్లలో ప్రతిఫలిస్తాయట. కేవలం ఆరోగ్యం గురించేనా మనం ఏం తింటున్నాం? శరీరంలో ఏం లోపించిందో కూడా తెలియజేస్తాయి. అందుకే అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు డాక్టర్లు కూడా పేషెంట్ల కళ్లు, పళ్లు, చర్మం, నాలుకతో పాటు గోళ్లను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు.

గోళ్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుంటే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. కొంతమందిలో గోళ్లు కొద్దిగా పెరగగానే వాటంతట అవి విరిగిపోతుంటాయి. అలా జరుగుతుంటే కాల్షియం తక్కువగా ఉందని, విటమిన్‌ డి లేదా జింక్‌ వంటి పోషకాల లోపం ఉందని గుర్తించాలి. దీని పరిష్కారానికి కొవ్వుశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొందరిలో గోళ్లు త్వరగా పెరగవు. పైగా పాలిపోయి ఉంటాయి. రక్తహీనత పోషకాహార లోపం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు గుండె, కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

చేతి వేళ్ల మొదళ్లలో వాపు వస్తే దానిని క్లబ్బింగ్‌ అంటారు. ఇది గుండె జబ్బులకు సంకేతం. గోళ్లపై సన్నటి ఎర్రగీతలు కనిపిస్తూ, గోళ్ల కింది భాగం నలుపు రంగులోకి మారుతుంటే అది గుండెపై పొరలోని వాపునకు సంకేతమంటారు డాక్టర్లు. వంపుపోయి చెంచాలాగా కనిపిస్తే రక్తహీనత ఉన్నట్లే. గోళ్లమీద తెల్లని చిన్నపాటి గీతలు కనిపిస్తున్నప్పుడు, ప్రతిగోరు మీద ఇవి కాస్త హెచ్చుస్థాయలో ఉన్నట్లయితే రక్తంలో ప్రొటీన్లు లోపించాయని అర్థం. ఇలాంటి సమయంలో గుడ్డులోని తెల్లసొన, పప్పు ధాన్యాలు, సోయా తదితరాలను ఆహారంలో చేర్చుకుంటే బాగుంటుంది. గోళ్ల ఉపరితలం హెచ్చుతగ్గులుగా, అక్కడక్కడ లొట్టలు పడినట్లుగా ఉంటే అది సొరియాసిస్‌ రానుందన్న దానికి సంకేతం కావచ్చు. అదే విధంగా నీలం రంగు గీతలు కనిపిస్తే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లు లెక్క. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి, అవి పసుపుపచ్చ రంగులో మందంగా కనిపిస్తున్నప్పుడు కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటోందని అనుమానించాలంటారు నిపుణులు.

ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు. కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. అనుమానించాల్సిన మార్పులేమైనా కనిపించినపుడు వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాలి. వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. తరచుగా కత్తిరించుకోవాలి. గోళ్లలో మట్టి, దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇంటిపనుల్లో తలమునకలై ఉండేవాళ్లు ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. హానికారక రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బరు గ్లౌజులు ధరించాలి. గోళ్లను కొరికే అటువాటు ఉంటే మానేయాలి. గోళ్లను ఎప్పుడూ రంగులతో కప్పివేయటమూ అంతమంచిది కాదు. ఈ జాగ్రత్తలు గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల గోళ్లను ఆరోగ్యంగా చూసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని