కొవిడ్‌తో మానసిక సమస్యలు.. 

తాజా వార్తలు

Published : 12/11/2020 01:38 IST

కొవిడ్‌తో మానసిక సమస్యలు.. 

బాధితులను చుట్టుముడుతున్న మానసిక సమస్యలు

లండన్: మహమ్మారి కరోనా వైరస్‌ కనిపించే దాని కంటే మరింత విధ్వంసానికి కారణమౌతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ వ్యాధి బాధితుల్లో శారీరక అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలకూ కారణమౌతోందని తెలిసింది. ఇదివరకే మానసిక సంబంధ సమస్యలతో బాధపడేవారికి కొవిడ్‌ వచ్చే అవకాశం 65 శాతం ఎక్కువ అని కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్‌లో నిర్వహించిన ఓ భారీ సర్వేలో నూటికి ఇరవై మంది కొవిడ్‌-19 బాధితుల్లో మానసిక సమస్యలు కనిపిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక తమకు అందుబాటులో వచ్చిన గణాంకాల కంటే ఈ సంఖ్య అధికంగానే ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఈ ఫలితాలు లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

తొలిసారిగా మానసిక సమస్యలు

62 వేల మంది కరోనా బాధితులపై జరిగిన ప్రయోగాల్లో ఆందోళన, మానసిక కుంగుబాటు, నిద్రలేమి తరచుగా ఎదురౌతున్నాయని ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపే డిమెన్షియా అనే మానసిక రుగ్మతకు వీరు లోనయే అవకాశాలను కొవిడ్‌ అధికం చేస్తోందట. ఇక ఈ సమస్యలు కరోనా వచ్చిన 90 రోజుల్లోగా ఎదురౌతున్నాయని పరిశోధనకు సారధ్యం వహించిన ప్రొఫెసర్‌ పాల్‌ హారిసన్‌ వివరించారు. కరోనా సోకిన అనంతరం తమకు తొలిసారిగా ఆందోళన, కుంగుబాటు తదితర లక్షణాలు కనిపించాయని పలువురు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు.

కొవిడ్‌ వైరస్‌ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతోందని.. తద్వారా మానసిక  సమస్యలకు దారితీస్తోందన్నారు. ఇతర అంటువ్యాధిల్లో కూడా ఇది మామూలేనని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రజ్ఞులు వివరించారు. గతంలో ఉన్న ఇతర సమస్యలను కూడా కరోనా తిరగ తోడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. భయాందోళనలు భరించలేని స్థాయికి చేరటంతో వైద్య సహాయం కోసం హెల్ప్‌లైన్లకు ఫోన్‌ చేస్తున్న కొవిడ్‌ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలు ఇందుకు గల కారణాలను, నివారణను కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రొఫెసర్‌ పాల్‌ విజ్ఞప్తి చేశారు. బాధితులకు మానసిక వైద్య సహాయం కూడా అందుబాటులోకి తేవటం తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని