కొవిడ్‌: వాష్‌ రూమ్‌లో జాగ్రత్త.. ధూళీ ప్రమాదమే!

తాజా వార్తలు

Updated : 19/08/2020 17:50 IST

కొవిడ్‌: వాష్‌ రూమ్‌లో జాగ్రత్త.. ధూళీ ప్రమాదమే!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌కు సమాంతరంగా కొవిడ్‌పై ఇంకొన్ని పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని వైరస్‌ పీడ విరగడయ్యేంత వరకు మానవాళి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తుండగా.. మరికొన్ని వైరస్‌పై కొత్త అస్త్రాలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నాయి. మరికొన్ని ప్రజల్లో నెలకొన్న  భయాందోళనలు పోగొట్టి ముందున్నాయ్‌ మంచి రోజులు అనే భరోసా ఇస్తున్నాయి. అలా ఇటీవల వెలువడిన ఆ పరిశోధనలు గురించి తెలుసుకుందాం..


వాష్‌రూమ్‌లో జాగ్రత్త!

వాష్‌రూమ్‌ల్లో మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ముందు ఎవరైనా కరోనా రోగి వాష్‌రూమ్‌ను వాడి ఉంటే తరువాత వెళ్లేవాళ్లు నీటిని ఫ్లష్‌ చేస్తే కరోనా వైరస్‌ను కలిగిన నీటి రేణువులు భారీఎత్తున అక్కడ విస్తరిస్తాయని ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. తద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని కథనంలో పేర్కొన్నారు. సామూహిక మరుగుదొడ్లు వాడే సమయంలో, కార్యాలయాల్లోనూ వాష్‌రూమ్‌లు వినియోగించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని చైనా పరిశోధకులు తెలిపారు.


ధూళీ వైరస్‌ వాహకమే!

జలుబుకు దారితీసే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు శరీరం నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే కాకుండా.. గాలి ద్వారా ధూళి వంటి సూక్ష్మకణాలపైకి వ్యాపిస్తాయని వెల్లడైంది! ఇలాంటి కణాల వల్ల మనుషులు, జంతువులు వైరస్‌ బారినపడే ముప్పుందని తేలింది. ఈ మేరకు పలు వరాహాలపై వైరస్‌ వ్యాప్తి తీరును అమెరికా పరిశోధకులు పరిశీలించారు. ‘‘డోర్‌ హ్యాండిల్స్‌, చేతులతో తాకే వస్తువులు, ధూళి కణాలు, టిష్యూ పేపర్లు వంటి వాటి ద్వారా కూడా వైరస్‌ సోకే వీలుంది. వీటిని ఫార్మైట్స్‌ అంటారు. అయితే వీటి ద్వారా కూడా అన్ని వైరస్‌లు ఒకేలా వ్యాప్తి చెందవు’’ అని శాస్త్రవేత్తలు వివరించారు.


లాలాజలం ఆధారంగా కొవిడ్‌ నిర్ధారణ

కొవిడ్‌-19ను గుర్తించేందుకు కొత్తగా లాలాజల ఆధారిత నిర్ధారణ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. కరోనా నిర్ధారణకు అవసరమైన రీఏజెంట్లు, ఇతర ఉపకరణాల కొరతను ఈ పరీక్ష విధానంతో అధిగమించవచ్చని ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ పేర్కొన్నారు. కొత్త విధానానికి ‘సెలైవా డైరెక్ట్‌’ అని పేరు పెట్టారు. వ్యాధి లక్షణాలు లేనివారిలో కరోనాను గుర్తించడానికి ఇది పనికొస్తుందని తేల్చారు. ఇది చాలా సులువైన, చౌకైన విధానం. గొంతు, ముక్కు ద్వారా నమూనాలను సేకరించే ‘నాసోఫ్యారింగియల్‌ శ్వాబింగ్‌’ విధానం కన్నా సులువుగా నమూనాలను తీసుకోవచ్చు. కరోనాకు సంబంధించిన ఇతర పరీక్షల తరహాలోనే దీని కచ్చితత్వం ఉందని పరిశోధకులు తెలిపారు.


చౌకలో అత్యవసర వెంటిలేటర్‌

కరోనా బాధితులకు చికిత్స చేయడానికి అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చౌకలో ఒక వెంటిలేటర్‌ను తయారుచేశారు. అధునాతన పరిజ్ఞానంతో రూపొందిన వెంటిలేటర్లు అందుబాటులో లేని సందర్భాల్లో ఇది అక్కరకొస్తుందని వారు తెలిపారు. సాధారణ వెంటిలేటర్లలో ఒక సెల్ఫ్‌ ఇన్‌ఫ్లేటింగ్‌ సంచి ఉంటుంది. దాన్ని వైద్యులు నొక్కడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని పంప్‌ చేస్తారు. అందుకు భిన్నంగా.. అధునాతన ఆటోమేటెడ్‌ వెంటిలేటర్లలో సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉంటాయి. అవి అనేక అంశాలను స్వయంగా నియంత్రించుకుంటాయి. ‘‘కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ వెంటిలేటర్లకు తీవ్ర కొరత ఉంది. అందువల్ల సులువైన, సమర్థమైన సాధనాన్ని రూపొందించాలనుకున్నాం. సాధ్యమైనంత వేగంగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనుకున్నాం’’ అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన మార్టిన్‌ బ్రెయిడెన్‌బాక్‌ చెప్పారు. తాజాగా రూపొందించిన సాధనం.. సెల్ఫ్‌ ఇన్‌ఫ్లేటింగ్‌ సంచిని తనంతట తానుగా నొక్కుతుంది. తద్వారా గాలిని పంప్‌ చేస్తుంది. ఇందుకోసం అధునాతన, చౌకైన ఎలక్ట్రానిక్‌ పీడన సెన్సర్లు, మైక్రో కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. 


కొవిడ్‌ చికిత్సకు కొత్త ఔషధం

వినికిడి సమస్య, మానసిక రుగ్మతలు సహా అనేక వ్యాధులను నయం చేయడానికి వాడుతున్న ఒక ఔషధం.. కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. అధునాతన కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి, దీన్ని గుర్తించారు. షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌ జీవిత చక్రంలో కీలక పాత్ర పోషించే ఎంపీఆర్‌వో అనే ఎంజైమ్‌ను వీరు విశ్లేషించారు. తన జన్యు పదార్థమైన ఆర్‌ఎన్‌ఏ నుంచి ప్రొటీన్లను తయారుచేసుకునేలా వైరస్‌కు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా మానవ కణంలో వైరస్‌ సంఖ్య భారీగా పెరిగేలా చూస్తుంది. వైరస్‌లోని ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకొనే ఔషధాలను గుర్తించాలని శాస్త్రవేత్తలు తలపోశారు. ఇందుకోసం కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించారు. ఎబ్‌సెలెన్‌ అనే ఔషధం.. ఎంపీఆర్‌వోను లక్ష్యంగా చేసుకోగలదని తేల్చారు. ఈ మందులో యాంటీ వైరల్‌ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేషన్‌ను నిలువరించగలదు.


ఆసుపత్రుల సందర్శనతో ముప్పు పెరగలేదు

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులు, క్లినిక్‌లను వ్యక్తిగతంగా సందర్శించడం వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు పెరగదని అమెరికా పరిశోధకులు పేర్కొన్నారు. గర్భిణులపై ఒక అధ్యయనాన్ని నిర్వహించి ఈ విషయాన్ని తేల్చారు. బ్రిగ్‌హామ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పటల్‌ నిపుణులు ఈ పరిశోధనను నిర్వహించారు. ఆసుపత్రుల్లో కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ఎక్కువగా వీటికి రావడంలేదని వైద్యులు చెబుతున్నారు. అయితే వ్యక్తిగతంగా ప్రజలు రావడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తీరుపై ప్రభావం పడుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బ్రిగ్‌హామ్‌ నిపుణులు తెలిపారు. సురక్షిత పద్ధతిలో ఆసుపత్రులను సందర్శించవచ్చన్నారు. ‘‘నిజానికి టెలీమెడిసిన్‌ ద్వారా వర్చువల్‌ పద్ధతిలో వైద్య సేవలను పొందడం రోగులకు ప్రయోజనకరమే. గర్భిణుల అంశం మాత్రం ఇందుకు భిన్నం. వీరిలో అనేక మంది.. కొన్ని పరిశీలనలు, పరీక్షలు, ల్యాబ్‌ టెస్టుల కోసం అనేకసార్లు ఆసుపత్రులకు రావాల్సి ఉంటుంది’’ అని పరిశోధనలో పాల్గొన్న షరాన్‌ రియల్‌ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 27 మధ్య ప్రసవించిన 3వేల మంది మహిళలపై పరిశోధకులు దృష్టి సారించారు. వీరిలో 111 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారినపడ్డ వారు సరాసరిన 3.1 సార్లు వ్యక్తిగతంగా ఆసుపత్రులను సందర్శించగా, ‘నెగెటివ్‌’గా తేలినవారు 3.3సార్లు సందర్శించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా వైద్యసేవలు పొందడానికి, కరోనా మహమ్మారి వ్యాప్తికి మధ్య ఎలాంటి సంబంధంలేదని స్పష్టమవుతోందని చెప్పారు. అయితే గర్భిణులపైనే ఈ పరిశోధనను నిర్వహించామని, ఇతరులకూ ఇదే సూత్రం వర్తిస్తుందా అన్నది నిర్ధరించేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని