ముంబయిని ముంచెత్తిన వాన

తాజా వార్తలు

Updated : 23/09/2020 20:06 IST

ముంబయిని ముంచెత్తిన వాన

24గంటల్లో 280మి.మీల వర్షపాతం నమోదు

కుండపోతతో చెరువుల్ని తలపించిన రహదారులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరాన్ని ఓ వైపు కరోనా వెంటాడుతుంటే.. మరోవైపు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మంగళవారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రైలు, రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి సహా పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో సబర్బన్‌ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. నగరంలోని పలు ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు/ కార్యాలయాలు మూసివేయాలని బీఎంసీ ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. నగరంలోని ఎస్వీ రోడ్‌ వద్ద రామమందిర్‌ సమీపంలో నీటి పైపు పగిలిపోవడంతో ఆ రహదారిని మూసివేశారు.

నిలిపోయిన హైకోర్టు కార్యకలాపాలు
ముంబయిలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బాంబే హైకోర్టులో కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. ఈ రోజు సినీ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడ్డాయి. అలాగే, ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చివేతపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వేసిన పిటిషన్‌పైనా విచారణ కొనసాగాల్సి ఉన్నప్పటికీ వీటన్నింటిపైనా గురువారం విచారణ జరుగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్‌ తెలిపారు.

5 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం: మంత్రి 

24గంటల పాటు ముంబయి సబర్బన్‌ ప్రాంతంలో అత్యధికంగా 280 మి.మీల వర్షపాతం నమోదైనట్టు ముంబయి వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ హోసాలికర్‌ తెలిపారు. బుధవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన  హెచ్చరించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులకు సహాయంగా ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ తెలిపారు. గత రాత్రి నుంచి ముంబయి, ఠానే, పాల్ఘర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో వరదలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదువుతున్న విషయం తెలిసిందే.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని