TS News: మత్తుగుట్టు విప్పుతున్న లాక్‌డౌన్‌

తాజా వార్తలు

Updated : 11/06/2021 11:07 IST

TS News: మత్తుగుట్టు విప్పుతున్న లాక్‌డౌన్‌

వసతిగృహాలు, గదుల్లో ఉండేవారిలో ఎక్కువగా బాధితులు 
 ప్రస్తుతం దొరక్క విపరీత ప్రవర్తన
 గ్రామాల్లో, కుటుంబసభ్యులతో కలిసి ఉంటుండడంతో బయటపడుతున్న కేసులు

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి లాక్‌డౌన్‌ కారణంగా నల్గొండ జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లాడు. కొద్దిరోజుల్లోనే కొడుకు ప్రవర్తనలో తల్లిదండ్రులు తేడా గమనించారు. చీటికీమాటికీ కోప్పడటం, రాత్రంతా మేల్కొని ఉండటం, ఏది అడిగినా విసుక్కోవడం వంటివి చేస్తుండటంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడని, ఇప్పుడు అది అందుబాటులో లేకపోవడంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని అర్థమైంది.
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఉద్యోగులైన తల్లిదండ్రులు తన కుమారుడు క్రికెటర్‌ని అవుతానంటే హైదరాబాద్‌ పంపి ఓ అకాడమీలో చేర్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అకాడమీ మూసివేయడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచీ తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ఒకరోజు తండ్రి గట్టిగా నిలదీయడంతో కొట్టడానికి సిద్ధమయ్యాడు. పరిస్థితి అర్థం చేసుకున్న తల్లిదండ్రులు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు."
కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, ఇంటి నుంచే పని, పాఠాలు కొనసాగుతుండటంతో మత్తుమందులకు అలవాటుపడ్డ వారి బండారం బయటపడుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల మత్తుమందులు వాడే అవకాశం లేకపోవడం, లభ్యం కాకపోవడంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబ సభ్యులకు దొరికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతా పెద్దసంఖ్యలో బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విచ్చలవిడిగా మత్తు మందుల వినియోగం

రాష్ట్రంలో మత్తుమందుల వాడకం విపరీతంగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గంజాయి సంస్కృతి మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. ఉత్తరాంధ్రలో పండుతున్న గంజాయి హైదరాబాద్‌ మీదుగా బెంగళూరు, ముంబయిలకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్క డైరెక్టరేట్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులే గత ఏడాది దాదాపు 10 వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ గత ఏడాది 257 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 33 కేసులు నమోదు చేసి 56 మందిని అరెస్టు చేసింది. ఇంకా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, రాష్ట్ర పోలీసుశాఖలు పట్టుకున్నది దీనికి అదనం. దీంతో పాటు కొకైన్, హెరాయిన్, ఇతర రసాయన మత్తుమందులు ఉండనే ఉన్నాయి. హైదరాబాద్‌లో అయితే కాలనీల్లోనూ గంజాయి అందుబాటులోకి వచ్చింది. శివార్లలో ఉన్న విద్యాసంస్థల్లో చాలామంది విద్యార్థులు కళాశాలలకు వెళ్లి వచ్చే సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి గంజాయి పార్టీలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు వారికి తెలుస్తుందనే భయంతో వీటికి కొంత దూరంగా ఉంటున్నారు. కానీ మిత్రులతో కలిసి గదుల్లో ఉండేవారు, వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు మాత్రం మత్తుమందులకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు.

పెరుగుతున్న కేసులు

మత్తుమందులు అలవాటు పడి మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కేసులు అనూహ్యంగా పెరిగాయని మానసిక వైద్యులు, ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రెటరీ విశాల్‌ అకుల వెల్లడించారు. మత్తుమందుకు బానిసలై విపరీత ప్రవర్తనకు లోనయ్యేవారికి సంబంధించిన కేసులు గతంలో సంవత్సరానికి 10 నుంచి 15 మాత్రమే రాగా ప్రస్తుతం నెలకు రెండు నుంచి మూడు వరకు వస్తున్నాయని ఆయన వివరించారు. బాధిత పిల్లలకు కౌన్సెలింగ్‌ కోసం వచ్చేవారు కూడా పెరిగారని దీన్నిబట్టి మాదకద్రవ్యాల వాడకం ఏస్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా మిత్రులతో కలిసి గదుల్లోనో, వసతిగృహాల్లోనో ఉండేవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. - ఈనాడు, హైదరాబాద్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని