Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 15/07/2021 10:14 IST

Top Ten News @ 9 AM

1. అయిదు రోజుల్లోగా పూర్తి వివరాలివ్వండి

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై వివిధ శాఖలు సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని మంత్రిమండలి అభిప్రాయపడింది. అన్ని విభాగాల నుంచి అయిదు రోజుల్లో పూర్తి సమాచారాన్ని సేకరించి అందజేయాలని సూచించింది. వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో 56,979 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదించాయి. ఇందులో 21,507 హోం (పోలీసు) శాఖలో కాగా 10,048 వైద్యఆరోగ్య శాఖ, 3,825 ఉన్నత విద్య, మరో 3,538 బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. 

TS News: హైదరాబాద్‌లో మరో ఐటీ హబ్‌!

మణిహారానికి మరో నగిషీ

2. ఆక్వాకూ బీమా

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. ఆక్వా రంగంలో బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్వా యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రజారోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ అనే విధానంతో ముందుకెళుతున్నట్లే.. పశువైద్యంలోనూ హేతుబద్ధమైన, పటిష్ఠమైన ప్రోటోకాల్‌తో కూడిన విధానం, వ్యవస్థలు ఉండాలని నిర్దేశించారు.

ఎటు చూసినా మొండి స్తంభాలే!

3. ముంచెత్తిన వానలు

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి పలుప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఏకధాటిగా పడుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.  వీటి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలివీ..

4. మా నీటికి ఎసరు

కృష్ణా నదిలో తమ నీటి వాటాకు తెలంగాణ ఎసరు పెడుతోందని ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ చేపడుతున్న రాజ్యాంగ విరుద్ధ, చట్ట వ్యతిరేక చర్యలతో కృష్ణా జలాల్లో తమకు దక్కాల్సిన సాగు, తాగునీటి వాటాలను కోల్పోతున్నామంటూ సర్వోన్నత న్యాయస్థానానికి మొరపెట్టుకొంది. రాష్ట్ర ప్రజల జీవన, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఈ అంశంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

5. పార్లమెంటుకు సన్నద్ధమై రండి

పార్లమెంటు సమావేశాలకు అన్ని విధాలా సన్నద్ధమై రావాలని కేంద్ర మంత్రుల్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్దేశాలను ఈ సమావేశాల్లో ప్రభావవంతంగా సభల ముందుంచడానికి కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నూతన మంత్రులు సహా మంత్రిమండలితో బుధవారం ఆయన సమావేశమయ్యారు.

6. కేంద్ర ఉద్యోగులకు 11% డీఏ పెంపు

కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్తంభింపజేసిన కరవు భత్యం (డీఏ) పెంపును ప్రభుత్వం పునరుద్ధరించింది. 17% డీఏని 28 శాతానికి పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ విలేకరులకు వెల్లడించారు.

7. Sharad Pawar: రాష్ట్రపతి రేసులో లేను: శరద్‌ పవార్‌

వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థిగా తాను బరిలో దిగనున్నట్లు వస్తున్న వార్తలను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (80) ఖండించారు. తాను ఆ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్డీయేకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఆ కూటమికి పోటీగా బరిలో దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని పవార్‌ అన్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

8. లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తూ స్పెయిన్‌ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదని అక్కడి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌పై ఫర్‌-రైట్‌ వోక్స్‌ పార్టీ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వీధుల్లోకి ప్రజలు రాకుండా నియంత్రించడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని కోర్టు పేర్కొన్నట్లు తెలిపింది.

9. ఇన్ఫీలో 35,000 నియామకాలు

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌.. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 26,000 మందికి కొత్తగా ఉద్యోగాలిస్తామని గతంలో ప్రకటించగా, గిరాకీకి అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 35,000 మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా నియమించబోతున్నట్లు బుధవారం ఆర్థిక ఫలితాల సందర్భంగా తెలిపింది. 2020-21లో ఈ సంస్థ 21,000 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చింది.

10. పడుతుందా పతక పంచ్‌!

భారత ఒలింపిక్స్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఆరంభమయ్యే టోక్యో క్రీడల్లో మొత్తం తొమ్మిది మంది బాక్సర్లు బరిలో దిగనున్నారు. అర్హత టోర్నీల్లో సత్తాచాటిన మన బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో టోక్యో బెర్తు దక్కించుకున్నారు. అయిదుగురు పురుష, నలుగురు మహిళా బాక్సర్లు ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ విశ్వ క్రీడల బాక్సింగ్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ రెండు పతకాలు మాత్రమే గెలిచింది. అవి కూడా కాంస్యాలే. ఈసారి ఒకటికి మించి పతకాలు సాధిస్తారని, అందులో ఒక పసిడి కూడా ఉంటుందన్న అంచనాలున్నాయి. 

ఒలింపిక్స్‌ పతకం వెనుక కథ
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని