‘పాలను పౌష్టికాహార జాబితాలో చేర్చండి’

తాజా వార్తలు

Updated : 07/09/2020 18:47 IST

‘పాలను పౌష్టికాహార జాబితాలో చేర్చండి’

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన

దిల్లీ: పాలను పౌష్టికాహార జాబితాలో చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పౌష్టికాహారం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యలపై ఉపరాష్ట్రపతి వాకబు చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా వారికి ఉదయం అల్పాహారం సమయంలో లేదా మధ్యాహ్న భోజనంలో పాలను చేర్చాలని వెంకయ్య సూచించారు. దీనిపై స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించిన సూచనలు పంపిస్తామని తెలిపారు. 

పౌల్ట్రీ రంగంలో ఔత్సాహికులకు సహకారం: అతుల్‌ చతుర్వేది

అంతకుముందు కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్‌ చతుర్వేది ఉపరాష్ట్రపతిని కలిశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న చర్యలను పరిష్కరించడంతో పాటు ఆ రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విధానపరమైన నిర్ణయాలతో పాటు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పౌల్ట్రీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్లు చతుర్వేది తెలిపారు. పౌల్ట్రీ రంగానికి ఇచ్చే రుణాల పునర్వ్యవస్థీకరణపై పరిశీలించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య సూచించగా.. దీనిపై ఆర్థికశాఖకు ప్రతిపాదించనున్నట్లు చతుర్వేది చెప్పారు. 


సంఘటిత రంగంలో సహకార సంస్థల ద్వారా పాల సేకరణ కూడా గణనీయంగా పెరిగిన విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి చతుర్వేది తీసుకొచ్చారు. సహకార సంఘాలకు నిర్వహణ మూలధన రుణాలపై ఏడాదికి రెండుశాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ సమయానికి రుణచెల్లింపు జరిగితే.. అదనంగా మరో రెండుశాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు ఆయన  వివరించారు. ఈ సదుపాయాన్ని ప్రైవేటు పాడి పరిశ్రమలకు కూడా అందించాలని ఉపరాష్ట్రపతి సూచించగా చతుర్వేది సానుకూలంగా స్పందించారు. 
పశువులు, గొర్రెలు, మేకలను పెంచే క్షేత్రాలతో పాటు ప్రాంతీయ పశుగ్రాస కేంద్రాలను అభివృద్ధి చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. అధునాతన ఇన్-విట్రో గర్భధారణ సాంకేతికత ద్వారా పశుజాతులను వృద్ధి చేసేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో కృషి జరుగుతోందని ఉపరాష్ట్రపతికి చతుర్వేది తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని