అబద్ధాలపై పోటీ.. వారికి మాత్రం నో ఛాన్స్‌!

తాజా వార్తలు

Published : 18/09/2020 10:11 IST

అబద్ధాలపై పోటీ.. వారికి మాత్రం నో ఛాన్స్‌!


(ఫొటో: బ్రిడ్జ్‌ ఇన్‌ ఫేస్‌బుక్‌)

అబద్ధం ఆడరాదు.. చిన్నప్పుడే మనం నేర్చుకున్న జీవితపాఠమిది. కానీ ప్రతి మనిషీ అవసరానికో.. ఆపదకో ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెబుతూనే ఉంటాడు. అయితే, అబద్ధాలు ఆడటాన్ని ఎవరూ సహించరు.. ప్రోత్సహించరు. కానీ, ఇంగ్లాండ్‌లో అబద్ధాలపై ఏటా పోటీ జరుగుతుంది. అందులో ఎవరు చక్కటి అబద్ధం చెప్పి మెప్పిస్తారో వారు విజేతగా నిలుస్తారు.

ఇంగ్లాండ్‌లో కంబ్రియా ప్రాంతంలో శాంటన్‌ బ్రిడ్జ్‌ గ్రామంలో ఏటా నవంబర్‌ నెలలో ‘వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ లయర్‌’ పేరుతో అబద్ధాల పోటీ నిర్వహిస్తున్నారు. అందరూ నిజమని నమ్మేవిధంగా ఎవరైతే అబద్ధం చెబుతారో వారే విజేతగా నిలుస్తారు. ఆ ఏడాది ‘వరల్డ్‌ బిగ్గెస్ట్‌ లయర్‌’ టైటిల్‌ గెలుచుకుంటారు. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనొచ్చు. అయితే న్యాయవాదులు, రాజకీయ నాయకులు మాత్రం ఈ పోటీలో పాల్గొనేందుకు అనర్హులు. ఎందుకంటే ఆ రెండు వృత్తుల్లో ఉన్నవారు సహజంగానే అబద్ధాలు ఆడుతారని నిర్వాహకుల అభిప్రాయం. 

ఈ పోటీని 1808-1890 మధ్య జీవించిన విల్‌ రిట్సన్‌ అనే స్థానిక పబ్‌ యజమాని జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారట. రిట్సన్‌ అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించడంలో దిట్ట. ‘టర్నిప్స్‌ (ఒక రకం దుంపగడ్డలు) లేక్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో పెద్దవిగా పెరుగుతాయి. వాటిని ఆవుల కోసం షెడ్డులా చెక్కుతారు’ అని అతడు చెప్పిన అబద్ధం బాగా పాపులరైంది. అలా శాంటన్‌ బ్రిడ్జ్‌ ప్రజలు అతడి అబద్ధాల అలవాటును కొనసాగించేందుకు గ్రామంలోని బ్రిడ్జ్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో ఏటా ఈ ‘వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ లయర్‌’ పోటీని నిర్వహిస్తున్నారు. 

2003లో దక్షిణాఫ్రికాకు చెందిన అర్బీ క్రుగేర్‌ తొలి విదేశీ ‘వరల్డ్‌ బిగ్గెస్ట్‌ లయర్‌’గా నిలిచాడు. వస్డేల్‌ వ్యాలీకి తాను ఎలా చక్రవర్తి అయ్యాడో అసత్య వివరణ ఇచ్చి ఈ పోటీలో గెలిచాడు. గతేడాది (2019)లో వర్కింగ్‌టన్‌కు చెందిన ఫిలిప్‌ గేట్‌ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. ‘జామ్‌ ఈటర్స్‌’ అనే పదం ఎలా వచ్చిందో తెలుపుతూ ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ప్రేక్షకులు అతడు చెప్పింది నమ్మేయడంతో ఛాంపియన్‌ అయ్యాడు. కరోనా కారణంగా ఈ ఏడాది పోటీని నిర్వహించబోమని నిర్వాహకులు ప్రకటించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని