అక్కడ పడకలు ఖాళీ.. ఇక్కడ జేబులు గుల్ల..

తాజా వార్తలు

Published : 07/04/2021 01:30 IST

అక్కడ పడకలు ఖాళీ.. ఇక్కడ జేబులు గుల్ల..

ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోతున్న రోగులు

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వేలాది మందిని ప్రమాదంలోకి నెడుతోంది. మహమ్మారి శారీరకంగా కుంగదీస్తూ ఆర్థికంగానూ చితికిపోయేలా చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేవన్న అపోహతో ప్రైవేటుకు పరుగులు తీస్తూ జనం బేజారవుతున్నారు. చికిత్సకు అవుతున్న ఖర్చులు అప్పుల్లోకి నెడుతున్నాయి. ఇటీవల కొవిడ్‌ బారిన పడుతున్నవారిలో 60-70 శాతం మంది ఆసుపత్రుల పాలవుతుండగా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. 

గతంలో 70 శాతం మంది రోగులు ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. ఆరోగ్య సమస్యలు స్వల్పంగానే ఉండేవి. తక్కువ మందికే వెంటిలేటర్‌ అవసరమయ్యేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైరస్‌ నిర్ధరణ అయినవారిలో 50 శాతానికి పైగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గతం కంటే రెట్టింపు మందికి వెంటిలేటర్‌ అవసరం వస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు ఉన్నాయో, లేదో అని, చికిత్సలపై అపోహలతో జనం ప్రైవేటుకు పరుగులు పెడుతున్నారు. అక్కడ రోజూ రూ.50-70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నా.. ఆర్థికంగా మాత్రం కుదేలవుతున్నారు. 

వాస్తవానికి ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స అందించిన అనుభవం ప్రభుత్వ ఆసుపత్రులకే ఉంది. ఎక్కడైనా అవే మందులు ఇస్తారు. ఆక్సిజన్‌ లోటులేకుండా 22 ప్రభుత్వాసుపత్రుల్లో భారీ ట్యాంకులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 1551 సాధారణ పడకలు, 5,268 ఆక్సిజన్‌ పడకలు, 1723 వెంటిలేటర్‌ పడకలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తంగా 8,542 పడకలు అందుబాటులో ఉంచారు. అందులో ఇప్పటివరకు నిండిన పడకలు కేవలం 1241 మాత్రమే. 7,301 పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. 

నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానాలో మాత్రమే 50 శాతానికి పైగా పడకలు నిండాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులకు 110 పడకలు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. చెస్ట్‌ ఆసుపత్రిలో 123 పడకలకు కేవలం నాలుగు మాత్రమే భర్తీ అయ్యాయి. కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో 350 పడకలకు గానూ 217 అందుబాటులో ఉన్నాయి. గాంధీలో 1890 బెడ్లకు 1717 ఖాళీగానే ఉన్నాయి. టిమ్స్‌లో 1261 పడకలు ఉండగా వాటిలో ప్రస్తుతం 974 అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన కరోనా రోగులకు ప్రభుత్వం కేటాయించిన పడకల్లో దాదాపు 80 శాతం అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల విషయానికి వస్తే 10,916 పడకలు ఉండగా 3,429 బెడ్లు నిండాయి.

కరోనా రోగులకు సరైన సమయానికి మెరుగైన చికిత్సలు అందించేందుకు ఎక్కడికక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరా పెంచామని, క్వారంటైన్‌ సెంటర్లను అధికం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా నివారణ చర్యలు చేపడుతూ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని