కొత్త నిర్మాణమా? మార్పులు చేస్తారా?: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 02/01/2020 17:10 IST

కొత్త నిర్మాణమా? మార్పులు చేస్తారా?: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయ భవనాలు కూల్చవద్దంటూ కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ముందుగా దీనికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని భిన్నకోణాల్లో పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ముఖ్యంగా కేబినెట్‌ దీనిపై చేసిన తీర్మానాన్ని పరిశీలించింది. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే తగిన మార్పులతో నిర్మించాలని మంత్రివర్గ తీర్మానంలో ఉన్నందున కొత్త నిర్మాణాన్ని చేపడతారా? మార్పులు చేస్తారా? దీనిపై తుదినిర్ణయం తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరాలను అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు వివరించారు. ఈ అంశంలో సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ తమ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిందని.. దీనిపై ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గతంలో ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినందున ముందుకెళ్లలేకపోయామని చెప్పారు. 

ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు?

ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చవద్దని చెప్పామని.. అంతేకానీ తుదినిర్ణయం తీసుకోవద్దని తామెప్పుడూ చెప్పలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే దానికి సంబంధించిన పలు వివరాలను సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా వివిధ విభాగాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? కొత్తగా వాటిని ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనుకుంటున్నారు? దీనికి ఎంత స్థలం అవసరముంటుంది? కొత్త భవనాలు నిర్మించేవరకు ప్రస్తుతం సచివాలయం ఎక్కడ కొనసాగిస్తారు? తదితర వివరాలన్నీ తమకు సమర్పించాలని పేర్కొంది. దీంతో పాటు ఖర్చు విషయాన్నీ హైకోర్టు ప్రస్తావించింది. దేశమంతా ఆర్థికమాంద్యం కొనసాగుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు మీడియా, పత్రికల్లో వార్తలు వస్తున్నందున ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంటున్నారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సచివాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు చేయబోతున్నారనే విషయం కూడా తమ నిర్ణయంలో కీలకపాత్ర పోషించబోతోందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారీ నిర్మాణం కాబట్టి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశమున్నందున సచివాలయ విభాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించినట్లయితే ఫైళ్ల కదలిక ఏవిధంగా ఉంటుంది.. ఒకచోట నుంచి మరోచోటికి తరలించే సందర్భంగా వాటిలోని గోప్యతను ఎలా పాటిస్తారనే వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయా వివరాలల ఆధారంగానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని