‘రాజధాని మార్చి మమ్మల్ని క్షోభ పెట్టొద్దు’

తాజా వార్తలు

Updated : 07/01/2020 20:49 IST

‘రాజధాని మార్చి మమ్మల్ని క్షోభ పెట్టొద్దు’

సచివాలయ ఉద్యోగుల ఆవేదన

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ రాజధాని మార్పు ప్రతిపాదనతో అమరావతి అట్టుడుకుతోంది. గత కొన్ని రోజులుగా ధర్నాలు, దీక్షలు, కవాతులు, ముట్టడులు.. ఇలా రోజుకో పోరాట రూపంలో రాజధాని ప్రాంత ప్రజలు కదం తొక్కుతున్నారు. మహిళలు సైతం ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అని నినదిస్తూ రోడ్డెక్కారు.  రాజధాని మార్పు అంశంపై రైతులే కాదు.. సచివాలయ ఉద్యోగులూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని విశాఖకు మారిస్తే అమరావతి రైతులతో పాటు తమకూ ఇబ్బందేనని వాపోతున్నారు. రాజధాని అనేది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో.. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగాలి తప్ప ఎవరి రాజధాని వాళ్లు పెట్టుకొని నచ్చినట్టు మార్చుకుంటూ పోతామంటే అంతిమంగా ఇబ్బందులకు గురయ్యేది తామేనంటూ ఆవేదన చెందుతున్నారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలోని మూడో బ్లాక్‌ వద్ద ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగులు సమావేశమయ్యారు. రాజధాని మార్పులు - ఇబ్బందులపై చర్చించారు. రాజధాని మార్చే అంశంపై తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు ఉద్యోగులు మీడియాతో తమ ఆవేదనను పంచుకున్నారిలా..

‘‘రాజధాని అనేది రాష్ట్రంలోని అన్ని రాజకీయ  పార్టీల ఏకాభిప్రాయంతో ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగాలి తప్ప..  ఎవరి రాజధానిని వాళ్లు పెట్టుకుంటామంటే ఎక్కువగా ఇబ్బంది పడేది మా ఉద్యోగులమే.  హైదరాబాద్‌లో కాస్త కుదురుకున్న ఉద్యోగులను ఆగమేఘాలమీద అమరావతికి తరలించారు. ఇప్పుడిప్పుడే అనేకమంది రుణాలు తీసుకొని ఇళ్లు కొనుక్కొని ఉంటున్నారు. కానీ, అసలు ఏమీ చెప్పకుండా అకస్మాత్తుగా ఇప్పుడు వైజాగ్‌ అంటూ మానసికంగా మమ్మల్ని క్షోభకు గురిచేస్తున్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఒక రాజకీయ పార్టీ పైన ఇంకో పార్టీకి ఏవైనా కక్షలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి తప్ప మిగతా అంశాలతో ముడిపెట్టొద్దని మనవి’’

‘‘రాజధాని మార్పు ప్రతిపాదన ఉద్యోగులను మానసికంగా ఎంతగానో కుంగదీస్తోంది. గత వారం నుంచి ఎవరికీ నిద్ర లేదు. ఏ రోజు ఏ వార్త వస్తుందో తెలియడంలేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చినప్పుడు కూడా మేం ఇంత ఇబ్బంది పడలేదు. రాష్ట్ర విభజన జరిగింది గనుక కచ్చితంగా ఏపీకి వెళ్లిపోవాల్సిందే కదా. అమరావతి అనేది మొన్నటి వరకు అందరి దృష్టిలో రాజధాని. దీంతో ఊళ్లలో ఉన్న పొలాలు, ఇళ్లు అన్నీ  అమ్ముకొని, రుణాలు తీసుకొని ఇళ్లు కొనుక్కున్నారు. ఆ ఇళ్లలో ఇప్పుడు ఎవరు ఉంటారు? వాటిని మేం ఏం చేసుకోవాలి? ఇక హైదరాబాద్‌లో పిల్లలు చదువుకుంటుండటంతో అనేకమంది వారాంతంలో వెళ్లి వస్తున్నారు. వాళ్లంతా విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎలా వెళ్లగలుగుతారు? ప్రభుత్వం ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవడంలేదు. రైతుల కంటే ఎక్కువగా ఉద్యోగులే ఇబ్బంది పడుతున్నారు. మేం ఉద్యోగులం గనుక బయటకు వచ్చి చెబితే ఏమంటారోననే భయం నెలకొంది. మమ్మల్ని, మా అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని రాజధానిని మార్చడం ఎంతవరకు సబబో ఇంకోసారి ఆలోచించాలి’’ 

‘‘రాజధాని మార్పుతో మాకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అమరావతి నుంచి హైదరాబాద్‌ వెళ్లాలన్నా.. నెల్లూరు వెళ్లాలన్నా  సౌకర్యంగా ఉండేది. ఈ ప్రతిపాదనతో మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని