ఏపీ ప్రభుత్వంపై క్యాట్‌ ఆగ్రహం

తాజా వార్తలు

Published : 01/02/2020 01:00 IST

ఏపీ ప్రభుత్వంపై క్యాట్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు వేతనం బకాయిలు చెల్లింపులో జాప్యంపై ఏపీ ప్రభుత్వంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించాల్సి ఉంటుందని ట్రైబ్యునల్‌ హెచ్చరించడంతో ... సర్కారు హుటాహుటిన ఇవాళ వేతనం బకాయిలు చెల్లించింది. వేతనం చెల్లింపులో జాప్యం ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణ కిశోర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, సభ్యుడు సుధాకర్‌తో కూడిన బెంచ్‌ ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

రెండు వారాల్లో వేతనం బకాయిలు చెల్లించాలని డిసెంబరు 24న ట్రైబ్యునల్‌ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఈ ఉదయం కృష్ణ కిశోర్‌ తరఫు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రైబ్యునల్‌.. వేతనం చెల్లించకపోతే సీఎస్‌ను పిలిపించాల్సి ఉంటుందని పేర్కొంటూ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. కృష్ణ కిశోర్‌కు ఇవాళే వేతనం చెల్లించినట్లు.. మధ్యాహ్నం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి ట్రైబ్యునల్‌కు తెలిపారు. వేతనం చెల్లించడంలో ఎందుకు జాప్యం జరిగిందో వివరణ ఇవ్వాలని సీఎస్‌ను ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోరడంతో... తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని