కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్దలుకొట్టింది:హరీశ్‌

తాజా వార్తలు

Updated : 12/03/2020 16:45 IST

కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్దలుకొట్టింది:హరీశ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ సూచనల మేరకు మానవీయ కోణంలో అద్భుతమైన బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల ఎన్నికల హామీలను తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్‌ ఆశపడిందన్నారు. ప్రజలందరినీ సంతోషపెట్టే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని.. కాంగ్రెస్‌ నాయకులకు ఉన్న భ్రమలను బడ్జెట్‌ బద్దలు కొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచామని.. ఇప్పటికే 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. 57 ఏళ్లు నిండిన అందరికీ పింఛను మంజూరు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 4లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింది ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి సభకు తెలిపారు.

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే రుణాలు తెస్తున్నాం

కొత్త రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశంలోని వివిధ రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయని హరీశ్‌ అన్నారు. పెట్టుబడి వ్యయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని చెప్పారు. ‘‘కేంద్ర పెట్టుబడి వ్యయం 12 శాతం అయితే రాష్ట్రంలో 30 శాతంగా ఉంది. పదేళ్ల కాంగ్రెస్‌ పాలన కంటే ఐదున్నరేళ్ల తెరాస పాలనలోనే రెవెన్యూ వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకోవడమే మా లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి రూ.40వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం నీటి పారుదలపై రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 78.42లక్షల ఎకరాల్లో రైతులు పంటసాగు చేశారు. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచానికే ఆదర్శం. జీఎస్‌డీపీ వృద్ధిరేటును బట్టే రుణాలు వస్తాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే రుణాలు తెస్తున్నాం’’ అని హరీశ్‌ స్పష్టం చేశారు. 

అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌..

‘‘దేవాలయాల అభివృద్ధి కోసం చరిత్రలో ఎప్పుడైనా నిధులు కేటాయించారా?తెరాస ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేలకోట్లు కేటాయించాం. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఎదుగుతోంది. రైతుబంధు సమితుల ద్వారా రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతాం. కాళేశ్వరం ద్వారా గోదావరిని జీవనదిగా మార్చాం. మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ ప్రభుత్వం గృహ నిర్మాణాల పేరుతో ప్రజలకు అప్పులు మిగిల్చింది. అప్పట్లో ఇచ్చిన నిధులు కనీసం గృహాల బేస్‌మెంట్‌కు కూడా సరిపోయేవి కాదు. రూ.4వేల కోట్ల గృహ రుణాలను మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఉండేది. వారంలో మూడు రోజులు మాత్రమే పరిశ్రమలకు విద్యుత్‌ ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఆ సమస్య లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాదాబైనామాలు పరిష్కరించి కొత్త పాసు పుస్తకాలు ఇచ్చాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తున్న గొప్ప సీఎం కేసీఆర్‌. ట్రాక్టర్లు, ఆటోడ్రైవర్లు, గీత కార్మికులకు పన్నులు రద్దు చేసినన ఘనత మాది’’ అని హరీశ్‌ వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని