స్థానిక ఎన్నికలపై ఈసీదే తుది నిర్ణయం:సుప్రీం 

తాజా వార్తలు

Updated : 18/03/2020 17:01 IST

స్థానిక ఎన్నికలపై ఈసీదే తుది నిర్ణయం:సుప్రీం 

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్‌ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతిచ్చిన ధర్మాసనం..కొత్త పథకాలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆరువారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనావేసి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ ముగించింది.   

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈసీ నిర్ణయంపై సీఎం జగన్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని