20న గచ్చిబౌలి ఆస్పత్రి ప్రారంభిస్తాం:ఈటల

తాజా వార్తలు

Updated : 16/04/2020 19:37 IST

20న గచ్చిబౌలి ఆస్పత్రి ప్రారంభిస్తాం:ఈటల

హైదరాబాద్: తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కి చేరిందన్నారు. కరోనా వ్యాప్తి నేసథ్యంలో అదనపు పడకల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలనుకున్న గచ్చిబౌలి ఆస్పత్రిని ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పది లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, గాగుల్స్‌, వైద్య పరికరాలు సమకూర్చుకుని భద్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్లు పెట్టిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారంటైన్‌ సెంటర్లు, కొవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య, రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను  అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

మరో రెండు ల్యాబ్‌లకు అనుమతి..

హైదరాబాద్‌లో మరో రెండు ల్యాబ్‌లకు కూడా అనుమతి లభించిందని ఈటల చెప్పారు. కార్మికశాఖ ఆధ్వర్యంలోని సనత్‌నగర్‌ ఆస్పత్రి, ఫొరెన్సిక్‌ పరిధిలోని మరో ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి కొవిడ్‌-19 ట్రయల్‌ పరీక్షలు నిర్వహించి తొందర్లోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటోమేటిక్‌ మెషిన్స్‌తో కూడిన ల్యాబ్‌ని మరో మూడు వారాల్లో హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని.. దీని ద్వారా నిత్యం 5 వేల పరీక్షలు జరిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని ల్యాబ్‌ల సామర్థ్యం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ల్యాబ్‌ల్లో సిబ్బందిని కూడా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈటల వివరించారు.

పరీక్షలకు ఇప్పటికీ ముందుకు రావడం లేదు

‘కరీంనగర్‌లో మర్కజ్‌ వెళ్లొచ్చిన ఆరుగురి ద్వారా 81 మందికి కరోనా సోకింది. అక్కడ 10మంది ఇండోనేషియా పౌరులు వచ్చి ఇంటింటికీ తిరిగారు. జిల్లా కలెక్టర్‌, యంత్రాంగం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టి మరిన్ని కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఎక్కువ కేసులు నమోదైన హైదరాబాద్‌లో కూడా కరీంనగర్‌ తరహా చర్యలు చేపట్టాం. కానీ హైదరాబాద్‌ విషయంలో అక్కడక్కడా ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసీ.. వారిని కలిసిన వారు పరీక్షలు చేయించుకునేందుకు ఇప్పటికీ ముందుకు రావడం లేదు. కరోనా సోకినవారు గాంధీలో చికిత్స పొంది కోలుకొని వెళ్తున్నారు. గాంధీ, ఛాతీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, తాత్కాలిక మరమ్మతులపై సమీక్షించాం. వారందరికీ సమయానికి అందించాల్సిన భోజన ఏర్పాట్లు కల్పిస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాం. గాంధీలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం’ అని ఈటల వివరించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన 87 లక్షల కుటుంబాలకు బియ్యం, నగదు పంపిణీ చేశామని ఈటల తెలిపారు. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకునే క్రమంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా వస్తున్నారని.. అలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరముందన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు లక్షల సంఖ్యలో మాస్కులు తయారు చేస్తున్నారని.. హైదరాబాద్‌లో రోజూ 3 లక్షల మాస్కులు తయారవుతున్నాయని ఈటల వివరించారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని