జాస్తి కృష్ణ కిశోర్‌కు కీలక పదవి

తాజా వార్తలు

Published : 22/04/2020 23:37 IST

జాస్తి కృష్ణ కిశోర్‌కు కీలక పదవి

దిల్లీ: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ను ప్రత్యక్ష పన్నుల బోర్డులో ఆదాయపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌గా కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై ఏపీ ప్రభుత్వం వేసిన సస్పెన్షన్‌ను క్యాట్‌ రద్దు చేస్తూ ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఆయనను ప్రత్యక్ష పన్నుల బోర్డులో ఆదాయపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, అనిశా డీజీలకు ఆదేశాలు జారీ చేసింది.  కృష్ణ కిశోర్‌ ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది. కృష్ణ కిశోర్‌ నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని..ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరు నెలల్లోగా  విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిశోర్‌ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణ కిశోర్‌ క్యాట్‌ను ఆశ్రయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని