సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

తాజా వార్తలు

Updated : 24/04/2020 16:14 IST

సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

రంగనాయక సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించిన హరీశ్‌రావు, కేటీఆర్‌


 

సిద్దిపేట: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్‌ వద్ద  రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు మోటార్ ఆన్‌ చేసి రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు.  

తొలుత చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో  మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్‌హౌజ్‌ వద్ద  పంప్‌ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద  మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్‌, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్‌ హుస్సేన్‌, వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ వెంకటరామారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు జలహారతి ఇచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల వ్యయంతో  మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. జలాశయం ప్రారంభం కావడంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

కోటి ఎకరాల మాగాణి సాధనలో హరీశ్‌ది కీలకపాత్ర: కేటీఆర్‌

కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా శ్రమించిన హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ‘‘ఇలాంటి చిరస్మరణీయ ఘట్టం మా చేతులమీదుగా ఆవిష్కృతం కావడం అదృష్టంగా భావిస్తున్నాం. కోటి ఎకరాల మాగాణి సాధనలో హరీశ్‌రావు క్రియాశీలంగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుంది. మెతుకు సీమ  తెలంగాణకు అన్నంపెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నాం. తెలంగాణలో హరిత విప్లవం వస్తుంది. మత్స్య సంపద పెరిగి నీలి విప్లవం రాబోతోంది. పాడి రైతులు క్షీర విప్లవం తీసుకొస్తారు. గొర్రెల పెంపకం ద్వారా గులాబీ విప్లవం వస్తుంది. సిద్దిపేట జిల్లాకు ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వస్తాయి. ఐటీ, ఆగ్రో, ఫుడ్‌, పర్యాటక, ఇతర పరిశ్రమలూ వస్తాయి. 46 వేల చెరువులు, కుంటలు నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ కల. సీఎం కల సాకారానికి ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో కదలాలి’’ అని కేటీఆర్‌ చెప్పారు.

త్వరలో సిద్దిపేటకు రైలు తీసుకొస్తాం: హరీశ్‌రావు

సిద్దిపేటకు నీళ్లు రావాలనేది దశాబ్దాల కలని.. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మార్దనిర్దేశం చేసిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘సమైక్య రాష్ట్రంలో మెదక్‌ జిల్లాలో ఒక్క ఎకరానికీ సాగునీరు రాలేదు. కాలువపై వ్యవసాయం చేసే అదృష్టం సిద్దిపేట జిల్లా రైతులకు వచ్చింది. ఈ జలాలు రైతుల బతుకుదెరువు, జీవన స్వరూపాన్ని మారుస్తాయి. మత్స్య, పాడిపరిశ్రమ, పర్యాటక, పరిశ్రమల అభివృద్ధికి నీళ్లే నాంది. త్వరలో సిద్దిపేటకు రైలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఒక్క ఇల్లు కూడా మునగకుండా జలాశయం నిర్మాణం జరిగింది’’ అని చెప్పారు. అనంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కూలీలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సన్మానించారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని