అప్రమత్తంగా ఉన్నందునే తీవ్రత తగ్గింది:ఈటల

తాజా వార్తలు

Updated : 01/05/2020 20:14 IST

అప్రమత్తంగా ఉన్నందునే తీవ్రత తగ్గింది:ఈటల

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోలుకొని 24 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. మొత్తం 464 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,044కి చేరగా.. వారిలో 552 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. రాష్ట్రంలో పరీక్షలు చేయకపోవడం వల్లే కేసుల తక్కువగా నమోదవుతున్నాయనేది వాస్తవం కాదన్నారు. అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నాయని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ అందరినీ అప్రమత్తం చేశారని ఈటల వివరించారు.

అవగాహన లేకుండా అనవసర ఆరోపణలొద్దు

కరోనా పరీక్షల నిర్వహణలో ఐసీఎంఆర్‌ స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేసిందని ఈటల చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్‌ సూచించిందన్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబసభ్యులకు మాత్రమే పరీక్షలు చేయాలని.. కరోనా పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేకుంటే ఇంట్లో ఉంచి చికిత్స అందించాలని స్పష్టంగా చెప్పిందన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత, అవగాహన లేకుండా అనవసర ఆరోపణలు చేయొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను తెలుసుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు.

‘‘దిల్లీలో మర్కజ్ సదస్సుకి అనుమతి ఇచ్చింది కేంద్రం ప్రభుత్వమే. అయినప్పటికీ మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేశాం. రాష్ట్రంలో 90 శాతం కేసులు మర్కజ్ కాంటాక్ట్ కేసులే. ఇప్పటివరకు నమోదైన 1044 కేసుల్లో 22 మినహా మిగతా కరోనా పాజిటివ్‌ కేసులన్నీ ట్రేస్‌ అవుట్‌ చేశాం. ఆ 22 మందికి కూడా కరోనా ఎలా సోకిందో త్వరలోనే గుర్తిస్తాం. నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటివరకు 47 శాతం బాధితులు కోలుకున్నారు. దాదాపుగా లక్ష మందికి ఐసోలేషన్‌లో వైద్య సేవలు అందించగలిగే సత్తా తెలంగాణకు ఉంది’’ అని ఈటల వివరించారు. కేంద్ర బృందం గాంధీ, గచ్చిబౌలి, కోఠి ఆస్పత్రులను పరిశీలించి రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై కితాబు ఇచ్చిందని చెప్పారు. మరణాలు దాస్తే దాగేవి కాదన్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కంటైన్‌మెంట్‌లను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని మంత్రి వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని