కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం: ఈటల

తాజా వార్తలు

Updated : 05/06/2020 19:31 IST

కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం: ఈటల

హైదరాబాద్‌: కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజలో ఉందని.. రాబోయే కాలంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ వైద్యుల సేవలు, కృషిని అందరూ అభినందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు కూడా గాంధీలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనా ఆస్పత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గాంధీ, నీలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌పూర్ ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. బాధితులకు అవసరమైన ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

కరోనా బాధితుల ప్రాణ రక్షణకు ఎంత వ్యయమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. 10 లక్షలకుపైగా పీపీఈ కిట్లు, వైద్యులకు అవసరమైనన్ని మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రోగులకు అవసరమైన మందు బిల్లలు సరిపడా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా సోకిన వైద్య సిబ్బందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఇతర దేశాల నుంచి భారతీయులను తీసుకువస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి చెందిన వారిని తీసుకొస్తున్నామన్నారు. అలాంటి వారిలో హైరిస్క్‌ కాంటాక్టు ఉన్నవారికి మాత్రం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఇక్కడికి వచ్చారని..  వాళ్లకి పరీక్షలు నిర్వహిస్తే 200పైగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని ఈటల వివరించారు.

‘‘లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ సరిగా లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేవని మరికొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు కరోనా పోరులో ఆటంకంగా మారుతున్నాయి. నిజాయితీ ఉంటే వాస్తవాలను బయట పెట్టాలి. ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం కల్పించి చేయూతనివ్వాలి. అంతేకాని అవాస్తవాలు ప్రచారం చేయడం సరైందికాదు’’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని