అందరికీ కొవిడ్‌ పరీక్షలు ఎలా సాధ్యం: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 08/06/2020 23:10 IST

అందరికీ కొవిడ్‌ పరీక్షలు ఎలా సాధ్యం: కేసీఆర్‌ 

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. ‘‘ కేవలం గాంధీ ఆస్పత్రిలోనే 2 వేల మందికిపైగా చికిత్స చేసే సామర్థ్యం ఉంది. గాంధీలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు వెయ్యి ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 247 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ పేషెంట్లతో కిక్కిరిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఏ కారణంతో మరణించినా సరే కొవిడ్‌ పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశం సరికాదని, దీని అమలు సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘ కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, జరుగుతున్న ప్రచారానికి పొంతన లేదు. రాష్ట్రంలో 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్‌-95 మాస్కులున్నాయి. ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన పడకలు మొత్తం 3600 సిద్ధంగా ఉంచాం. చికిత్స పొందినవారు అంత తృప్తిగా ఉంటే, కొందరు మాత్రం విమర్శించడం బాధాకరం. వైద్యలు, వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా విధుల్లో ఉన్నవారికి వైరస్‌ సోకడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. దిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఐసీఎంఆర్‌ ప్రకారం దేశంలో 10 వేల మందికి వైద్య సిబ్బందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 153 మంది వైద్య సిబ్బందికి వైరస్‌ సోకింది. వీరిలో ఎవ్వరి పరిస్థితి విషమంగా లేదు. కరోనా మృతుల్లో ఇతర కారణాలతో చనిపోయిన వారే ఎక్కువ. దాదాపు 95 శాతం మంది కరోనాతోపాటు ఇతర కారణాలతో చనిపోయారు. కరోనా విషయంలో తరచూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కేసుల వల్ల సీనియర్‌ వైద్యాధికారులు రోజూ కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 900 -1000 మంది మరణిస్తుంటారు. అందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి ఇంట్లోనే వైద్యం అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని