జగన్నాథ రథయాత్ర: ఈసారి లాగేదెవరు?

తాజా వార్తలు

Published : 12/06/2020 00:59 IST

జగన్నాథ రథయాత్ర: ఈసారి లాగేదెవరు?

పూరీ: భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర. అయితే ఈ నెల 23న జరగాల్సిన పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే జగన్నాథ యాత్ర ఈ ఏడాది యథావిధిగా ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నా.. లక్షల మంది రాక నేపథ్యంలో కరోనా ప్రబలే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. 

ఇదిలా ఉండగా దశాబ్దాల సంస్కృతిని ఆపేదిలేదని ఆలయ అర్చకులు, నిర్వాహకులు అంటున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న దైతపతి సేవకులు 18వ శతాబ్దంలో తీవ్రమైన కరవు వచ్చినప్పుడు కూడా రథయాత్రను ఆపలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. భక్తులు లేకుండా తామే రథయాత్రను నిర్వహిస్తామని అన్నారు. కానీ, భక్తులు లేకుండా రథాన్ని లాగేదెవరు? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. తమ కుటుంబంలోని 36మంది నియోగులు రథాన్ని లాగుతారని దైతపతి సేవకులు తెలిపారు. అయితే రథయాత్ర నిర్వహణపై ఒడిశా ప్రభుత్వం నిర్ణయమే కీలకంగా మారనుంది. ఆలయ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు.

రథయాత్రపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. రథయాత్రలో వినియోగించే మూడు రథాల తయారీని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సుమారు 200మంది జగన్నాథుడి రథాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరితో పాటు 754మంది ఆలయ ఉద్యోగులు, దైతపతి సేవకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ అని తేలింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని