Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 29/07/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఏడేళ్లలో తెలంగాణకు 15వేలకు పైగా పరిశ్రమలు: కేటీఆర్‌ 

మహేశ్వరంలో ఉన్న ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ.483 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు(సరికొత్త ప్రాజెక్టు) ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రెండేళ్లలో పెట్టుబడులను రూ.1200 కోట్లకు పెంచనున్నట్లు తెలిపింది. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గడిచిన ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం 15 వేల పైచిలుకు పరిశ్రమలను.. తద్వారా 2లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులను సాధించుకుందని కేటీఆర్‌ అన్నారు. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమన్నారు. 

2. రెండో దశ నాడు-నేడు.. మారనున్న 16వేల పాఠశాలల రూపురేఖ‌లు

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆగ‌స్టు 16 నుంచి అన్ని పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు 16లోగా వంద శాతం బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారన్నారు. రెండో సారి విద్యా కానుక అన్ని పాఠశాలల్లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు, బెల్టు, స్కూలు బ్యాగులు 80శాతం, యూనిఫాంలు 80శాతం, నిఘంటువులు 20శాతం అందుబాటులో ఉన్నాయని.. ఈ సంవ‌త్సరం అదనంగా డిక్షనరీలు అందించాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు.

ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌ రిజిజు
ఏపీలో కొత్తగా 2,107 కేసులు.. 20 మరణాలు

3. హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్‌ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దాన్ని తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.

4. ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జులై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ జులై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా థియేటర్లు తెరచుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. శానిటైజర్లు, సామాజిక దూరం, మాస్కులు వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది.

5. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ  కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుదుత్పత్తి అవసరమని వివరించారు. 

6. వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు!

వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఓబీసీ-27శాతం, ఈడబ్ల్యూఎస్‌-10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రిజర్వేషన్లు యూజీ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌), పీజీ, దంత వైద్యవిద్య కోర్సులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇవి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయస్థాయి కోటా విభాగంలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

7. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ నిష్క్రమణ..

భారత అగ్రశ్రేణి బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్‌ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. ఇవే ఆఖరి ఒలింపిక్స్‌గా భావిస్తున్న మేరీకోమ్‌ ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓటమి పాలైంది.

8. దారుణం.. కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి!

మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హసన్‌ జిల్లా బెలూర్‌ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులు మూటలను గుర్తించారు.

9. చైనాను తాకిన డెల్టా వేరియంట్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు డెల్టా వేరియంట్‌ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) వెల్లడించింది. తాజాగా ఈ వేరియంట్‌ చైనాను తాకింది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన చైనా నగరాలు, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న వారికి మూడో డోసును అందించేందుకు యోచిస్తోంది.

10. హమ్మయ్య మార్కెట్లకు లాభాలొచ్చాయి..

దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ, లోహ, ఆర్థిక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు లాభాలతో కళకళలాడాయి. కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. 52,693 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కొన్ని రంగాల్లో షేర్లలో లాభాల స్వీకరణతో సూచీ కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకుంది. చివరకు 209 పాయింట్ల లాభంతో 52,653 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,778 వద్ద స్థిరపడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని