Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Published : 15/07/2021 21:02 IST

Top Ten News @ 9 PM

1. TS NEWS: 26 నుంచి రేషన్‌కార్డుల పంపిణీ

ఈనెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సీఎం ఆదేశించారు. ఈనెల 26 నుంచి 31 వరకు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.

2. రేపే కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్లు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల జలవివాదం నేపథ్యంతో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపర్చారు.  2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నా అసాధారణంగా ఏడేళ్లపాటు ఆలస్యమైంది.

జల వివాదంపై స్పందించిన కేఆర్‌ఎంబీ

3. స్నేహితుల మధ్య సఖ్యత ఏమైంది: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలను భిన్న ధృవాలు పాలించినప్పుడు తలెత్తని నీటి వివాదం, కుదిరిన సఖ్యత.. ఇప్పుడు స్నేహితుల మధ్య ఎందుకు బెడిసికొట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్‌ బ్యూరో సమావేశంలో అభిప్రాయపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణ తీసుకునేలా ఎలాంటి వివాదం లేకుండా ఒప్పందం అమలైందనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. జలవివాదాన్ని కలిసి పరిష్కరించుకోలేని పరిస్థితులే ఉంటే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. 

4. TS NEWS: దోస్త్‌ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు

దోస్త్‌ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లకు గడువు ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఇవాళ్టి వరకు 1.40లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు చెప్పారు.  ఈనెల 31న డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 9వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 2 నుంచి 9 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని పేర్కొ్నారు. ఆగస్టు 14న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. 

5. రూ.కోట్లు తెచ్చిన కోకాపేట భూములు

కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఇవాళ వేలం నిర్వహించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా..వేలంలో గరిష్ఠంగా రూ.60.2 కోట్లు పలికింది. తాజా వేలంతో హెచ్‌ఎండీఏకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. అధికారులు ఊహించిన ధరకంటే కోకాపేట భూములు రెట్టింపు ధర పలకడం గమనార్హం. రాజపుష్ప స్థిరాస్తి సంస్థ గరిష్ఠ ధరతో 1.65 ఎకరాలు దక్కించుకుంది.   

6. JEE Main: పరీక్షల షెడ్యూల్‌లో మళ్లీ మార్పు

జేఈఈ (మెయిన్‌) నాలుగో విడత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ పరీక్షలను ఆగస్టు 26, 27, 31; సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. జేఈఈ మెయిన్‌ నాలుగో సెషన్‌ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. 

7. Politics: విపక్షాలను ఏకంచేసే దిశగా దీదీ?

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతున్నారు. అధికార భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 25న మమతాబెనర్జీ దిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ తదితరులతో విడివిడిగా సమావేశం కానున్నారు.

ఆమె.. స్వీపర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి..!

8. పదేపదే రోడ్లు మూసేస్తున్నారు: కేటీఆర్‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోకల్ మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డును కొవిడ్ నిబంధనలు కారణంగా చూపించి మూసేశారన్నారు. నిబంధనల పేరుతో రోడ్లను మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

9. చైనా కుయుక్తులు.. సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు

భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్‌ శిబిరాలను నిర్మిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

10. US Corona: మూడు వారాల్లో రెట్టింపైన కేసులు! 

కరోనా వైరస్‌ దాటికి అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు అక్కడే చోటుచేసుకున్నాయి. అయితే, వేగంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంతో వైరస్‌ తీవ్రత అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ, గతకొద్ది రోజులుగా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. కేవలం గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విస్తృతి, వ్యాక్సినేషన్‌ రేటు తగ్గడం, జులై 4న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కొవిడ్‌ వ్యాప్తి మరోసారి పెరగడానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని