Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Updated : 16/07/2021 21:13 IST

Top Ten News @ 9 PM

1. గెజిట్‌ విడుదల ఓ ముందడుగు: సజ్జల

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని పెద్ద ముందడుగుగా భావిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గెజిట్‌ విడుదలను పాజిటివ్‌ ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. గెజిట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని, వాటిని సవరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. కృష్ణా జలాలలపై ప్రకాశం జిల్లా వారిలో చంద్రబాబు లేనిపోని  అనుమానాలు సృష్టిస్తున్నారన్న సజ్జల.. రాయలసీమ ఎత్తిపోతల వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని, ఈమేరకు సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 

2. Ts News: ఖానామెట్‌లో ఎకరం రూ.55 కోట్లు

ఖానామెట్‌ భూముల వేలం ప్రక్రియ ముగిసింది. ఖానామెట్‌లో ఉన్న 14.91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి శుక్రవారం హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ వేలం నిర్వహించగా రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. భూముల వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లు, గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. 2.92 ఎకరాలను రూ.160.60 కోట్లకు మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. 3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు లింక్‌వెల్‌ టెలీ సిస్టమ్స్‌ కైవసం చేసుకుంది. ఎకరాకు రూ.48.60 కోట్ల చొప్పున లింక్‌వెల్‌ సిస్టమ్స్‌ కొనుగోలు చేసింది.

గెజిట్‌ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

3. వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

జాబ్‌ క్యాలెండర్‌లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామని, వీటిలో గ్రూప్‌ 1, 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు  రావాల్సి ఉందని, ఇవన్నీ వచ్చాక ఎన్ని పోస్టులు వస్తే అన్ని పెంచి ఆగస్టులో గ్రూప్సు సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 

4. Ap News: వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న, పూర్తయిన ఐదు ప్రాజెక్టులను మాత్రమే గెజిట్‌ లో పేర్కొనడం విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఆ జాబితాలో వెలిగొండ ప్రాజెక్టును చేర్చేలా బాధ్యత తీసుకోవాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి కుమార్‌, బాలవీరాంజనేయ స్వామి.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.  గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించడం ప్రకాశం జిల్లాకు పిడుగుపాటు లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు.

5. భూ బాగోతం బయటపెడతా: రేవంత్‌

కోకాపేట భూముల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూ బాగోతం వెనక తెరాస నేతలే ఉన్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ ఎలా చేశారు? అందుకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా రేపు బయటపెడతానని రేవంత్‌ ప్రకటించారు. ఎకరా రూ.60 కోట్లు పలకాల్సిన భూమి కేవలం రూ.30 కోట్లకే దోచేశారని తెలిపారు. టెండర్లు వేయకుండా కొంత మందిని మేనేజ్‌ చేశారని.. కేసీఆర్‌ తన బినామీలు, పార్టీ వారి కోసమే మేనేజ్‌ చేశారని ఆరోపించారు.

6. జాబ్‌ క్యాలెండర్‌పై జనసేన పోరాటం: పవన్‌

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈనెల 20న అన్ని జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైకాపా చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్‌ క్యాలెండర్‌లో చూపించిన ఖాళీలతో నిరాశ చెందిందన్నారు.

7. గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ స్టేషన్‌ నుంచి ప్రతివారం వారణాసికి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్టేషన్‌ పైభాగంలో రూ.790కోట్లతో నిర్మించిన ఫైవ్‌స్టార్ హోటల్‌ను కూడా లాంఛనంగా ఆరంభించారు. తన సొంతపట్టణం వాడ్‌నగర్‌ నుంచి కలిపే గాంధీనగర్‌-వరెథా ఎంఈఎంయూ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు.

Politics: కర్ణాటకలో నాయకత్వ మార్పు..?

8. భయపడేవారు ఆరెస్సెస్‌లో చేరండి: రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీకి భయంలేని నాయకులు మాత్రమే కావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. పిరికివారికి పార్టీలో స్థానంలేదని ఉద్ఘాటించారు. భయపడేవారంతా పార్టీని వీడి ఆరెస్సెస్‌లో చేరండి అని వ్యాఖ్యానించారు. ‘నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారు. వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు కృషి చేయాలి. పార్టీలో కొందరు భయస్థులు ఉన్నారు. వారిని బయటకు విసిరేయండి. పిరికివారంతా పార్టీని వీడి వెళ్లండి. ఆరెస్సెస్‌ వైపు పరుగులు తీయండి’ అని పేర్కొన్నారు.

9. Vaccine: 66 కోట్ల డోసులకు ప్రభుత్వం ఆర్డర్‌

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 66 కోట్ల డోసుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.14 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. త్వరలోనే వీటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

10. పరారీ వ్యాపారుల షేర్ల విక్రయం..రూ.800 కోట్ల రికవరీ

పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకుంది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలోనే స్పష్టం చేసింది.

America: విదేశీ విద్యార్థులకు విమాన కష్టాలు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని