Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Updated : 21/07/2021 21:01 IST

Top Ten News @ 9 PM

1. Ts News: తెరాసలో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎల్లంపల్లికి వరద.. 16 గేట్లు ఎత్తివేత

2. 12 MRO కార్యాలయాల్లో అనిశా సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని 12 తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) సోదాలు నిర్వహించింది. విశాఖపట్నంలోని సీతమ్మధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం తహసీల్దార్‌ కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే విజయనగరం జిల్లాలోని ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సోదాలు  చేపట్టారు. రెండు జిల్లాల్లోనూ ఆరు బృందాలు చొప్పున ఏర్పడిన అనిశా అధికారులు సోదాలు చేశారు.

3. ఫోన్‌ ట్యాపింగ్‌ దుర్మార్గమైన చర్య: రేవంత్

దేశంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేయడం దుర్మార్గమైన చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బాధ్యులపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘పెగాసస్‌’ ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. హ్యాకింగ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో గళం వినిపించడంతో పాటు క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

4. Mumbai: ముంబయి, థానెలో రెడ్ అలర్ట్‌

ఆర్థిక రాజధాని నగరం ముంబయిని వానలు ముంచెత్తున్నాయి. దాంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి, రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబయి, థానె, పాల్ఘర్‌కు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ‘గత ఆరు గంటలుగా ముంబయిలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి, థానె, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు’ అని వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. గురువారం కూడా వానలు తెరిపినిచ్చే సూచనలు కనిపించడం లేదని అంచనా వేసింది.

5. Kerala: శని, ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌!

కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శని, ఆదివారాల్లో (ఈ నెల 24,25 తేదీల్లో) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెస్ట్‌లను పెంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. శుక్రవారం రోజు అదనంగా 3లక్షల పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని కలెక్టర్లను కోరింది. కరోనా కేసులను నియంత్రించడమే లక్ష్యంగా నిబంధనలను కఠినతరం చేయాలంది. 

6. సిద్ధూ ఇంటికి 60 మంది ఎమ్మెల్యేలు!

పంజాబ్‌ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. సిద్ధూను పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో రాజకీయాలు చల్లబడతాయనుకుంటే.. పరిస్థితి ఇప్పుడు మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం స్వర్ణ దేవాలయం సందర్శనకు పెద్దఎత్తున నేతలు తరలి రావాలన్న సిద్ధూ పిలుపునకు అనూహ్య స్పందన రావడం ఇందుకు కారణం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధూ నివాసానికి సుమారు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ విధంగా ఈ కార్యక్రమం బలప్రదర్శనను తలపించింది.

పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం యడ్డీ డిన్నర్‌ వాయిదా!

7. సరిహద్దుల్లో చైనా దుడుకుతనం ..!

సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. జిత్తులమారి డ్రాగన్‌ సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు  ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి ఆవల గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

8. E-Commerce: డిస్కౌంట్‌ సేల్స్‌పై నిషేధం వద్దు!

దేశంలో ఇ-కామర్స్‌ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తూ నిర్వహించే వస్తు, సేవల ‘డిస్కౌంట్‌ సేల్‌’ నిర్వహణపై నిషేధం విధించడాన్ని మెజారిటీ ఆన్‌లైన్ వినియోగదారులు వ్యతిరేకించినట్లు ఓ సర్వే తేల్చింది. ఇ-కామర్స్‌ కంపెనీల విక్రయాల్లో అసలు ప్రభుత్వ జోక్యం అవసరం లేదని కొందరు అభిప్రాయడ్డట్లు పేర్కొంది. ‘లోకల్‌సర్కిల్స్‌’ అనే సామాజిక మాధ్యమం నిర్వహించిన సర్వేలో ఇ-కామర్స్‌ విస్తరణపై వినియోగదారులు పలు ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడించారు.

9. Olympics: ప్రారంభ వేడుకలకు 15 దేశాల ప్రముఖులు

శుక్రవారం జరగనున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ప్రారంభ వేడుకలను వెయ్యి మందిలోపు అతిథులతోనే నిర్వహించాలని జపాన్ భావిస్తోంది. కొవిడ్‌ను నియంత్రించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కట్సునోబూ కటో తెలిపారు.

10. ATM సెంటర్‌ పేల్చేసి.. ₹28లక్షలతో పరార్‌!

మహారాష్ట్రలోని పుణె నగరంలో ఆగంతకులు రెచ్చిపోయారు. తెల్లవారు జామున ఏటీఎం కేంద్రంపై పడి భారీ నగదుతో పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఏటీఎం కేంద్రం వద్ద ఇద్దరు దుండగులు పేలుళ్లకు పాల్పడి డబ్బును దోచుకొని ఉడాయించినట్టు గుర్తించామని పింప్రీ చించ్వాడ్‌ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని పేల్చేసి దాదాపు రూ.28 లక్షల నుంచి రూ.30లక్షల వరకు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని